శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

ఆంధ్ర మహాభారతం కవిత్రయ ప్రణీతం సభాపర్వం,ద్వితీయాశ్వాసం 172 నుండి 264వరకు స్వేఛ్ఛానువాదం

ధర్మరాజు, శకునిల మధ్య జూదం మొదలైంది. ధర్మరాజు పావులు ముట్టుకోకనే,సంపదలు,రాజ్యమూ ఓడిపోయాడు, ఆ తరవాత తనను పందెంలో ఒడ్డి ఓడిపోయాడు, తమ్ములతో సహా!అప్పుడు శకుని నువ్వు ఇంకా ఆడచ్చు, ద్రౌపదిని పందెంగా పెట్టచ్చు అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని పందెంఒడ్డి ఓడిపోయాడు. ఆ తరవాత దుర్యోధనుడు విదురుని పిలిచి ద్రౌపదిని సభకు తీసుకురమ్మన్నాడు. నీకు ఉచితానుచితాలు తెలియటం లేదు, ఎవరికి ఏ పని చెప్పచ్చో చెప్పకూడదో తెలియకవున్నావని అనడం తో ద్రౌపదిని సభకు తీసుకురమ్మని ప్రాతికామికి చెప్పేడు. 

ప్రాతికామి ద్రౌపది దగ్గరకుపోయి సభలో జరిగినది చెప్పి, ఆమెను సభకు రమ్మన్నాడు. విన్న ద్రౌపది,తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా? ధర్మరాజునే కనుక్కురమ్మంది. అదేమాట సభలో చెప్పాడు ప్రాతికామి. అనుమానం సభలోనె తీరుస్తారు తీసుకురమ్మని చెప్పాడు, దుర్యోధనుడు. ఆమాటే వెళ్ళి ద్రౌపదికి చెప్పాడు, ప్రాతికామి.  ద్రౌపది ప్రాతికామి వెనక బయలుదేరి సభలో కురువృద్ధుల చెంతకు చేరింది.  ప్రాతికామి భీమునికి భయపడుతున్నాడు, నీవుపోయి  ద్రౌపదిని సభకు, తీసుకురమ్మని దుశ్శాసనునికి చెప్పాడు, దుర్యోధనుడు

దుశ్శాసనుడు తనకోసం బయలుదేరుతున్న సంగతి తెలుసుకున్న ద్రౌపది సభలో ఉన్న గాంధారి దగ్గరకు పరుగెత్తింది.ఎక్కడిదాకా పరుగెట్టిపోతావు?  నిన్ను పట్టకమాననని,  దుశ్శాసనుడు అటువస్తుంటే పట్టపురాణి గాంధారి దగ్గరకి పరుగుపెట్టింది. దుశ్శాసనుడు గాంధారి దగ్గరున్న ద్రౌపదిని పట్టబోతుంటే నన్ను ముట్టకు,రజస్వలను, ఏకవస్త్రను అని చెప్పింది. దుశ్శాసనుడు పట్టపురాణి సమక్షంలో నీవు ఏకవస్త్రవైనా, వివస్త్రవైనా సభకు తీసుకెళతానని, ద్రౌపదిని కొప్పుపట్టి సభలోకి ఈడ్చుకొచ్చాడు, అప్పుడు కృష్ణుని తలచింది,ద్రౌపది. అంతట వికర్ణుడు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు. ఎవరూ బదులు చెప్పలేదు.ఐతే నేను ధర్మ నిర్ణయం చెబుతున్నా! ఆమె అధర్మ విజిత,అంతేకాదు ఏకవస్త్రను సభకు ఈడ్చుకురావడం అన్యాయం అన్నాడు. దానికి కర్ణుడు కుర్రవాడివి, కురు వృద్ధులు, గురువులు ఉన్నచోట ఇలా పలకడం కూడదు. ఒక స్త్రీకి ఒకడు భర్త,ఈమెకు అనేకులు భర్తలు, ఈమెను బంధకి అంటారు, అందుచేత ఈమె ఏకవస్త్రగా గాని,వివస్త్రగాగాని సభకు తీసుకురావచ్చు,ధర్మం తప్పదు, అన్నాడు.కర్ణుని మాటపై దుర్యోధనుడు, పాండవుల,ద్రౌపది వస్త్రాలు ఊడతీయమన్నాడు. 

దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రం లాగుతుంటే అది అశేషమై వస్త్రాలు గుట్టగా పడ్డాయి,కాని ద్రౌపది ఒంటిపై బట్ట తొలగలేదు. అది చూచి దుశ్శాసనుడు సిగ్గుపడ్డాడు. ఇది చూచి భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతానని శపధం చేశాడు. సభలోనివారంతా ధృతరాష్ట్రుని కౌరవులను నిందించారు, ముసలిరాజులంతా పట్టించుకోలేదనీ తిట్టారు. అప్పుడు విదురుడు కలగేసుకుని సభకి ఇలాచెప్పాడు.వికర్ణుడు ధర్మబుద్ధితో చెప్పేడు. సభలో ధర్మసందేహం తీర్చకపోతే అబద్ధం ఆడిన ఫలితం పొందుతారు, అందుచే ధర్మం చెప్పి తీరాలన్నాడు. అప్పుడు ద్రౌపది పాండవుల పత్నిని, గోవిందుని చెల్లిని,నేడు వీనిచే సభామధ్యంలో, నరపతులు, కురువృద్ధులు,గురువృద్ధులు ఉండగా,  నన్నిలా చేయడం తగునా, నా మాటలకెవరూ సమాధానం చెప్పరే! నే దాసినా? నే దాసినా? అని అరిచింది.దానికి భీష్ముడు అమ్మా! నీ ప్రశ్న ధర్మ సూక్ష్మం, ధర్మరాజే సమధానం చెప్పగలడు, వీరి చర్యలఫలితం తొందరలోనే వీళ్ళు అనుభవిస్తారన్నాడు.

ఆ తదుపరి కర్ణుడు జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని ఒక్కణ్ణి కట్టుకో, పనికిరానివాళ్ళు ఎంతమంది ఉన్నా మేలులేదు, అని ఎకసక్కెమాడేడు.అంతట దుర్యోధనుడు తొడ చూపాడు.రవిలిపోయిన మనసుతో భీముడు తొడలు విరిచి చంపుతానని ప్రతిన చేశాడు. ఇది విన్న భీష్మ ద్రోణులు, కోపానికి ఇది తగు సమయం కాదన్నారు.అంతా ఎరిగిన గాంధారి విదురుని తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకిపోయి, సభలో జరిగినదంతా భర్తకు తెలిపింది, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయని కూడా చెప్పింది. 

విన్న ధృతరాష్రుడు దుర్యోధనుని పిలిపించి పాండవులభార్య గౌరవనీయురాలిపట్ల తప్పు మాటలు మాట్లాడం తగదు, చిన్నప్పటినుంచి నీ దుష్ట స్వభావం మాన్చుకోలేదు, నీ మూలంగా పాండవులకు దుఃఖం కలిగిందని, వారిపట్ల దురాగ్రహం పనికిరాదు, అని తిట్టాడు. అందరికి మంచి చేయాలని తలచి ద్రౌపదిని పిలిపించి

’నా కోడళ్ళంద’రిలోనూ ఎన్నదగినదానివి, అయోనిజవు, నీకు వరమివ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. దానికి ద్రౌపది ధర్మరాజును దాస్య విముక్తుని చేయమని, కారణం చెప్పింది,ధర్మరాజు తనయుడు దాసపుత్రుడనే పేరు లేకుందుకే అని చెప్పింది. మరో వరం కోరమన్నాడు. మిగిలిన పాండవులను అస్త్ర శస్త్రాలతో దాస్య విముక్తి చేయమంది. తధాస్తు అంటూ, మరో వరం కోరుకోమన్నాడు. 

నేను క్షత్రియ కాంతను, నేను రెండు వరాలు కోరడానికే అర్హురాలను, అని మూడో వరం సున్నితంగా తిరస్కరించింది. . ధృతరాష్రుడు ఆమెను మెచ్చి పాండవులను పిలిపించాడు. ధర్మరాజా! నీ సర్వసంపదలతో, నీ స్వరాజ్యాన్ని ఎప్పటిలా ఏలుకో,ఇంద్రప్రస్థం పోయి సుఖంగా ఉండమన్నాడు.

ద్రౌపది వరాలు కోరలేదు, ఆమెను పిలిపించి ధృతరాష్ట్రుడు వరాలెందుకిచ్చాడు? మెదడుకి పదును పెట్టండి….

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

  1. శర్మ గారు,
    యుద్ధాలకు కారణాలు కాదు నేనన్నది. యుద్ధంలో ఎవరు పాల్గొనాలి అని మాత్రమే. భూభారం తగ్గుతుంది అన్నమాట అటుంచితే. వైరం ఉన్న రాజులు మాత్రం పరస్పరం కొట్టుకు చస్తే సరిపోయేదిగా? ఆధునిక కాలంలో వీలు కాకపోవచ్చు లెండి.

    అయినా జీవితంలో విశేషానుభవం కలిగిన వ్యక్తి మీరు. మీ ప్రశ్నకి సమాధానం కూడా మీరే ఇవ్వగలరు 🙏.

    పైన మీ గురించి ఏమంటిరి ఏమంటిరి “అచ్చరంముక్క రానోణ్ణి” అనా? మా చెవుల వెనక కాబేజీలు కాలీఫ్లవర్లు గానీ కనిపిస్తున్నాయేమిటండీ?

    • విన్నకోటవారు,
      //ఆధునిక కాలంలో వీలు కాకపోవచ్చు లెండి.//
      పెద్దలమాట చద్ది మూట కదా! 🙂
      //అయినా జీవితంలో విశేషానుభవం కలిగిన వ్యక్తి మీరు. మీ ప్రశ్నకి సమాధానం కూడా మీరే ఇవ్వగలరు 🙏. //
      మీరుగినా జిలేబినా? 🙂
      //పైన మీ గురించి ఏమంటిరి ఏమంటిరి “అచ్చరంముక్క రానోణ్ణి” అనా? మా చెవుల వెనక కాబేజీలు కాలీఫ్లవర్లు గానీ కనిపిస్తున్నాయేమిటండీ//
      తెలుగచ్చరం ముక్కలొచ్చినోళ్ళంతా జిలేబిలేనేటండి? నేనూ అసుమంటోడినే నండి.
      ఓలమ్మ!ఓలమ్మో!! కళ్ళు గినా చూయించుకోవాలేటో, ఏటి చోద్దెం సంవచ్చరమవలే కల్లు ఆపరేసన్ జేయిచ్చుకుని,డాటేర్ బావు కాడికి పారెల్లాలి, 🙂

  2. బోనగిరి గారు,
    మీరన్నదాంట్లో పాయింట్ ఉందండోయ్.
    నిజానికి భూభారం తగ్గించమని భూదేవి విష్ణువుతో మొరపెట్టుకున్నట్లు పురాణాల్లో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది కదా. 🙂

  3. పాండువులకి రాజ్యంకోసం, అన్ని లక్షలమంది చావాల్నా? ఫిటింగుపెట్టేది నికృష్టుడు.. నెపం మాత్రం ధుర్యదనుడిమీదకు.

    • మంచి ప్రశ్న, వెంకటేష్ గారు.
      నాకూ ఎప్పుడూ విచిత్రంగా అనిపిస్తుంది. మహాభారత యుద్ధమనే కాదు, ఏ యుద్ధంలో నైనా అసలు సైనికులలాంటి ఇతరులెందుకు పాల్గొనాలి అని. శత్రురాజులు మాత్రం ద్వంద్వయుద్ధం చేసుకుంటే సరిపోతుంది కదా, ఓడిపోయిన వాడి రాజ్యం గెలిచినవాడికి చెందుతుంది అనే షరతు మీద. బోలెడంత జనక్షయాన్ని నివారించవచ్చు.

      • విన్నకోటవారు!
        పల్లెటురివాణ్ణీ, చదుకోననివాణ్ణీ సుమా! మరోలా అనుకోవద్దూ! చిన్న నుమానం. పాతరోజుల్లో వాళ్ళైతే మూర్ఖులు, పౌరుషం వగైరా వగైరాలతో ప్రాణాలు తీసుకున్నారు, చాలామంది ప్రాణాలూ తీశారు. నేటి కాలంలో అందరూ చదువుకొన్నవారే కదండీ, మరెందుకు యుద్ధాలు జరుగుతున్నాయంటారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో రెండు దేశాల అధిపతుల్ని బరిలో దింపేసి సమస్య తేల్చుకోమనచ్చుగా! ఏమంటారు? మరలా ఎందుకు జరగటం లేదంటారు?

  4. మరి రెండో సారి జూదానికి పిల్చినప్పుడు కూడా ఆయన బుద్ధి అలా ఏడిసిందేమండి? ఆయనే కదా పిల్చాడు? మొదటి సారి బుద్ధిలేదు, మరి రెండోసారో? ఆయన ధుర్యోధనుడి తండ్రే కదా? కుర్రాడికీ ఆయన బుద్దులే వచ్చాయి కాబోలు. లేకపోతే కృష్ణుడు చెప్తూనే ఉన్నాడు ముందునుంచీ. ‘నా చేతుల్లో ఏం లేదు’ అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసాడు. ఈయనా భీష్మ ద్రోణులూ ఇది ధర్మం కాదు నీ ఉప్పు తిన్నా ఈ పని మేము చేయం అని ఎందుకనలేకపోయేరు? విపరీత కాలే వినాశ బుద్ధి అని కదా. అంత వరకూ ఎందుకు, కుంతి కానీ, భీష్ముడు కానీ ఆఖరికి కృష్ణుడు కానీ సభలో కానీ మరో చోట కానీ ఈ కర్ణుడు కుంతి కొడుకే అని చెప్పేస్తే అసలీ గొడవే ఉండేది కాదు కదా? కృష్ణుణ్ణి వదిలేయండి ఆయన నోరు విప్పరాదు – దుష్ట శిక్షణ కోసం పుట్టాడు కనక ఆయన ప్లాన్ లు ఆయన వేస్తాడు. మిగతా వారో?

    • dee Geeగారు,
      అదా భారతం! నేనా అచ్చరం ముక్క రానోణ్ణి. ప్రశ్న మీద ప్రశ్న, భారతంలో లింకులెక్కువగదు సార్! సమాధానం అంత తేలికంటారా? 🙂

వ్యాఖ్యానించండి