శర్మ కాలక్షేపంకబుర్లు-బతికియుండిన సుఖముల బడయవచ్చు

బతికియుండిన శుభములబడయ వచ్చు.

వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవితసంగమః

రామాయణమ్..సు.కాం..సర్గ 13–౪47

మరణించుట వలన పెక్కు ప్రమాదములు కలుగవచ్చును.బ్రతికియుండిన సుఖముల బడయవచ్చు. బతికియున్నవారెప్పుడైనను కలియవచ్చు,అందువలన ప్రాణములు నిలుపుకొందును.

హనుమ లంకలో దిగారు. సీతకోసం వెతికి వేసారిపోయారు, సీత కనపడలేదు. ఒక బలహీన క్షణం లో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, మార్గాలు కూడా ఆలోచిస్తారు. అంతలో ఇదేమి ఇలా ఆలోచిస్తున్నానుకొని లంకిణిని గెలిచి శుభారంభం చేశాను. బతికియుండిన శుభములు బడయవచ్చు, బతుకుతాను,నా వారందరిని బతికించుకుంటాను అని నిర్ణయం తీసుకుంటారు. ఇది పాసిటివ్ తింకింగో మరేదో మీరే చెప్పాలి.

తెలిసో,తెలియకో చైనా ఒక వైరస్ ని ప్రపంచం మీద వదిలింది. దానిని ఎలా ఏ మందులతో ఎదుర్కొంది చెప్పటం లేదు. తన దేశంలో ఎంతమంది మరణించిందీ పూర్తిగా తెలియని విషయమే. అమెరికా, అగ్రరాజ్యం అల్లాడుతోంది మందులకోసం.భారత దేశం కరోనాని సమర్ధంగా ఎదుర్కుంటోంది. ఎలా మడితోనూ, గచ్చాకు పుచ్చాకుతోనా అని హేళన చేస్తున్నవారూ లేకపోలేదు. మనవారికి మందులు లేకుండా ఇతరదేశాలకి మందులు అమ్ముకుంటోంది భారత ప్రభుత్వం , ఇది మరో అసత్య ప్రచారం. అవే కావాలంటోంది అగ్రదేశం. మానింది మందు బతికింది ఊరు అని సామెత.

దేశంలో వలస కార్మికులు ఆకలితో అల్లాడుతున్నారని కొందరి ప్రచారం. మా దగ్గర లాక్ డవున్ ప్రకటీంచిన మరునాటి నుండే వ్యక్తులు సంస్థలు ఆహారం అందించడం మొదలు పెట్టాయి. స్కూళ్ళు కాలేజిలు వసతి కూడా ఏర్పాటు చేశాయి. మానవత వెల్లి విరిసింది. మన వారిని బతికించుకోడమే మన ప్రధమ కర్తవ్యం.బతికియుండిన సుఖముల బడయ వచ్చు నన్నదే నినాదం. ఒక ఫోన్ నంబర్ ఇచ్చి దీనికి ఫోన్ చేయండి, మీకు ఎక్కడైనా మనఊరిలో, ఎంతమందికైనా ఆహారం ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నవారున్నారు.  స్వలాభాపేక్ష మరచి ఏ కూరైనా కెజి ఇరవైకే అమ్ముతున్నవారున్నారు.  అసత్యాలు అర్ధ సత్యాలు ప్రచారం చేస్తున్నవారున్నారు. ప్రభుత్వం ఇంటికే కావలసిన సరుకులు చేరేస్తోందన్నది మరచిపోయారు మరికొందరు.ఆర్ధికంగా వెనకబడిపోతున్నాం,మరొకరి సన్నాయి నొక్కులు. అసలు బతికి ఉన్నప్పుడు కదా, బతికుంటే నేడు కాకపోతే రేపు సాధించుకుంటాం, మరొకరి మాట

దేశం కరోనాని జయించగలదు అనే నమ్మకాన్ని కలిగి ఉంది.దేశం మొత్తం మీద ఇటువంటి వ్యక్తులు సంస్థలు చాలానే పని చేస్తున్నాయి. మందు కూడా కనుక్కునేలాగే ఉంది.ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాలు చాలా తక్కువనే చెప్పాలి.ప్రపంచం మనకేసి చూస్తోంది,ఆశ్చర్యపోతోంది కూడా. బతుకు బతికించు అన్నదే నేటి నినాదం.జీవితం చూసిన ఒకరి మాట.కరోనాని దూరంగా తరిమేస్తున్నట్లే నిత్య శంకితులను దూరంగా వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి. IGNORE  them.

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
చేరి మృగతృష్ణలో నీరు త్రావ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖులమనసు రంజింపరాదు.

సర్వే జనాః సుఖినో భవంతు
సమస్త సన్మంగళాని భవంతు

నిత్య శ్రీ రస్తు
నిత్య మంగళాని భవంతు
సర్వ శ్రీ రస్తు
సర్వమంగళాని భవంతు 
సర్వే జనాః సుఖినో భవంతు.

శర్మ కాలక్షేపం కబుర్లు-పదమూడేళ్ళు ఆలస్యంగా అమలు జరిగిన శిక్షలు.

పదమూడేళ్ళు ఆలస్యంగా అమలు జరిగిన శిక్షలు.

ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు. ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడాడు. ఆమెను సభకు కొప్పు పట్టి ఈడ్పించారు, దుశ్శాసనుడు వలువలూడ్చాడు. ఆసందర్భంగా భీముడు రౌద్రంగా ఈ శపధం చేశాడు అనగా శిక్ష విధించాడు,

ధృతరాష్ట్రుని తో సహా పెద్దలందరూ ఉండగా. ఆ తరవాత ద్రౌపదికి ఎడమతొడ చూపిన దుర్యోధనునికీ శిక్ష విధించాడిలా, అందరు చూస్తుండగా,వినగా. న్యాయం చెప్పిన వికర్ణునినోరు నొక్కేశారు, పెద్దలు.ఆ శిక్షలివీ

కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ సూచు చుండన్ మదో
ద్ధురు డై ద్రౌపదినిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోక భీ
కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తాఘని
ర్ఘర ముర్వీపతి సూచుచుండ నని నా స్వాదింతు నుగ్రాకృతిన్.

దీనికి అర్ధం చెప్పక్కర లేదు కదా, ఈ పద్యం అందరికి వచ్చినదే.రొమ్ము చీల్చి రక్తం తాగుతానని.

ఆ తర్వాత

ధారుణి రాజ్య సంపదమదంబున గోమలి కృష్ణజూచిరం
భోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరుజేయుదుసుయోధను నుగ్రరణాంగనంబునన్.

దీనికీ అర్ధం చెప్పక్కరలేదు, అందరికి తెలిసింది కనక, తొడలు విరగ్గొట్టి చంపుతానని శిక్ష వేసేడు. తన వేసిన శిక్ష తనే వాయిదా వేసుకున్నాడు. నిజానికి భీముడు అప్పుడే అది అమలు చేసినా ఆక్కడ ఆపగల దమ్మూ,ధైర్యం ఉన్నవాడెవడూ లేడు, కాని ధర్మరాజు కంటి చూపుకు ఆగిపోయాడు. కాలమూ గడిచింది. ఎంతకాలం పదమూడేళ్ళు. భీముడు కసి పెంచుకున్నాడు ఎప్పటికప్పుడు. గాయపడిన మనసు కెలక వేస్తూనే ఉంది,పదమూడేళ్ళూ.

యుద్ధం సిద్ధమైంది.ఆ యుద్ధ కాలంలో కౌరవ సర్వసేనాపతులుగా విధి నిర్వహించిన సమయాలూ చిత్రంగానే ఉంటాయి. భీష్ముడు పది రోజులు,ద్రోణుడు ఐదు రోజులు,కర్ణుడు రెండున్నరరోజులు, శల్యుడు అర రోజు.అనగా ప్రతి సర్వసేనాపతీ మారినప్పుడు బలం తగ్గిపోతూనే వచ్చింది. కర్ణుడు సేనాపతిగా ఉన్నకాలం. దుస్ససేనుడు భీమునితో తలపడ్డాడు.ఘోర యుద్ధం జరిగింది. అందులో దుస్ససేనుడు తన రధం తనే నడుపుకుంటూ భీముని తాకేటట్టుగా యుద్ధం జరిగింది. అప్పుడు కూడాభీముని మీద బాణాలు నాటేడు. అంతే భీముడు రధం దిగిపోయాడు,గద పుచ్చుకుని. దుశ్శాసనుని రధంకి పూన్చిన గుర్రాలను చంపేశాడు. దుస్ససేనుడూ నేలకు దిగాడు. గద్ద కాళ్ళలో చిక్కిన కోడిపిల్లయ్యాడు,దుస్ససేనుడు. గదతో రొమ్ము మీద కొడితే నెత్తురు కక్కుకుని భూమి మీద పడ్డాడు. అంత భీముడు

మును సభ బలికినదానం దనివోక యిచ్చటికి వెదకి వచ్చితి యే
మనియెదనుము నీ మాటలు,వినుటకు నాకినుక సాల వేడ్క పడియెడిన్.

ఒరే సభలో ఏదో అన్నావుగా అదిసరిపోక ఏంటి పేలుతున్నావు, పేలరా నీ మాటలు వినడం నాకు వేడుకగా వుంది సమా అని కత్తి పట్టుకుని ముఖం మీద తిప్పేడు, మోకాళ్ళతో పొడుస్తూ కింద పడిఉన్న దుస్ససేనునితో

ఏ నురము వ్రచ్చినెత్తురు దేనియ యిదె ద్రావెదం గదిసి నను గడిమిన్
మానుప దిక్కు గలిగిన వ్రాని మ్మెలగింపు మీ మొనగలవారిన్.

నీ గుండెలు బద్దలు చేసి రక్తం తేనెలా తాగుతాను, నన్ను ఆపగల దమ్ము ఉన్నవాడెవదో మీ పక్క ఉన్నవాడిని పిలవరా అని కత్తితో గుండె చీలిచి రక్తం తాగేడు. ఇది చూసిన పాంచాల సేనలే భయపడ్డాయి, ఆ సమయంలో భీముని చూసి. అంత ఘోరంగా శిక్ష అమలు చేశాడు.

ఇక దుర్యోధనుడినెలా చంపేడు?

గదా యుద్ధం జరుగుతోంది ఘోరంగా దుర్యోధనుడు గదతో ఎగిరి దూకుతూవుండగా, భీముడు తొడల మీద కొట్టి కూల్చేసేడు. ఆ తర్వాత దుర్యోధనుని తల తన్నేడు, అది చూసి ధర్మరాజు తప్పని వారించాడు.భీముని మీదకు రాబోయిన అబలరాముని కృష్ణుడు వారించాడు.

భీముడు తను విధించిన శిక్షలను తనే అమలుచేశాడు, పదమూడేళ్ళు ఆలస్యంగా.ఆలస్యంగానైనా శిక్ష తప్పక అమలు చేయబడింది.ఇలాటిదే మరో సంఘటన మరో సారి….

శర్మ కాలక్షేపం కబుర్లు-రామోవిగ్రహవాన్ ధర్మ

రామో విగ్రహవాన్ ధర్మ

రామాయణం నుంచి ఎన్నేని కొటేషన్ లు చెప్పచ్చు కాని ప్రముఖంగా చెప్పేవి ఈ కింది రెండూ….

సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
అప్రియస్యచ పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః.

మన మనసుకు నచ్చే ప్రియ సల్లాపాలు పలికేవారే చుట్టూ చేరతారు.అయాచితంగా హితవు చెప్పేవాడు దొరకడు.వాడు దొరికినా మనం వినలేం. (తర్జుమా:ఉష శ్రీ)

ఇది నిత్య సత్యం.చెప్పినది నిజంకాదని తెలిసినా మనకెందుకొచ్చిన బెడద. ఊరుకున్నంత ఉత్తమం లేదు కదా అనుకునేవారే ఎక్కువ. ఏమో రేపు ఈయనతో మనకేమన్నా పని బడుతుందేమో, దీనికోసం మనం ఈయనతో గొడవ పడటం ఎందుకూ అని నిజం చెప్పరెవ్వరూ. పొరబాటున ఒకరెవరో నిజం చెప్పబూనుతారు, దానిని మనం వినం. అలా చెప్పబూనినవానిని హేళన చేస్తాం, దానితో వారు, మనకెందుకొచ్చిన తంటా అని ఊరుకుంటారు. ఇది లోక రీతి.

మరొకటి.
రామోవిగ్రహవాన్ ధర్మ
సాధు సత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకేస్య
దేవానా మివ వాసవః

రాముడు మూర్తీభవించిన సత్యం.సాధువు. పరాక్రమవంతుడు.దేవతలలో ఇంద్రునివంటివాడు.
ఐతే వీటిని చెప్పినవారు, సమయ సందర్భాలూ చూదాం.

ఈ రెండిటినీ చెప్పినవాడు రామభక్తుడు, అంధ భక్తుడు కాదు. అసలు సిసలు వైరి రాక్షసుడైన మారీచుడు.రావణుని మంత్రి.ఎప్పుడు చెప్పేడూ? మారీచా నువు బంగారు జింకలా సీతకు కనపడు. దానికోసం రాముని పంపుతుంది, ఆ సమయంలో సీతను ఎత్తుకువస్తానని అన్న ప్రభువు రావణునితో చెబుతాదు,నిర్భయంగా,ఇలా

.కొరగాని చారుల మాటలతో అతిచంచల స్వభావుడవైన నీవు రాముని గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. నా దొక్కటే కోరిక రాముడు కోపగించి సర్వ రాక్షస సంహారానికి పూనుకోకుండా భగవంతుడే కాపాడలి.నిన్ను చూస్తుంటే సీత నీ వినాశానికే పుట్టినట్లుంది. నీ మూలంగా రాక్షస జాతి లంకా నగరం నాశనం కానున్నాయి. నిన్నీ పాప కార్యానికి పురికొల్పినవాడు నిజానికి నీ శత్రువే అన్నాడు. నిజంగానే ఎంత నిష్టురమైన సత్యం చెప్పాడు, నిజంగానే రావణుడూ వినలేదు.

శర్మ కాలక్షేపంకబుర్లు-సీత చెప్పిన కత్తి కత


సీత చెప్పిన కత్తి కత

సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ దండకారణ్యం చేరారు. వనాలను చూస్తూ ముని ఆశ్రమాల సొగసు పరిశీలిస్తూ నడుస్తున్నారు. ఒక రోజు హటాత్తుగా ఒక రాక్షసుడు విరాధుడు అనేవాడు ఎదురయ్యాడు. రామ లక్ష్మణులను భయపెడుతూ సీతను పట్టుకున్నాడు. రామ లక్ష్మణులిద్దరూ విరాధుని రెండు భుజాలూ నరికేశారు, ఐనా విరాధుడు చావలేదు. రాముడు విరాధుని పట్టిఉండగా లక్ష్మణుని గొయ్యి తియ్యమన్నాడు, పూడ్చిపెట్టడానికి, అప్పటికి వీరెవరో తెలిసిన విరాధుడు మరణిస్తూ రామ లక్ష్మణులను శరభంగ ముని ఆశ్రమానికి వెళ్ళమని సూచించి చనిపోయాడు. శరభంగ ముని ఆశ్రమం చేరు కున్న రామ లక్ష్మణులను శరభంగముని స్వాగతిస్తూ తాము దేవేంద్రునితో వెళ్ళవలసివున్నా వీరి కోసం అగినట్లు చెబుతూ తమ శక్తులను ధారపోస్తాం తీసుకోమని అడిగారు. విన్న రాముడు తానే వాటిని స్వయంగా సంపాదించుకోవాలనుకుంటున్నానని చెబుతూ తాము నివసించడానికి యోగ్యమైన స్థలం చెప్పమని కోరేరు. దానికి శరభంగ ముని మీరు సుతీక్ష్ణుని ఆశ్రమానికి వెళ్ళండి అని సూచిస్తూ, ఈ ప్రాంతంలో రాక్షసుల బెడద ఎక్కువగా ఉన్నదని వారినుంచి మునిలోకాన్ని రక్షించమనీ కోరుతారు. సుతీక్షణుని ఆశ్రమానికి వెళ్ళారు, సీతారామలక్ష్మణులు. స్వాగత సత్కారాల తరవాత సుతీక్షణుడు కూడా దివ్య శక్తుల్ని తీసుకోమని అడిగితే శరభంగునికి చెప్పినట్టే చెప్పి, రాక్షసుల బెడదనుంచి మునిలోకాన్ని కాపాడమని కోరుతూ ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ముని ఆశ్రమాలూ దర్శించమని చెప్పారు. మరునాడు అగమ్యంగా బయలు దేరిన సీతారామలక్ష్మణులు నడుస్తుండగా సీత రాముని ఉద్దేసించి ఇలా అంది.

రామా! మనం ఇక్కడికి వచ్చింది రాక్షస సంహారానికే అని మునిలోకం అనుకుంటున్నది.అధర్మం ఎంతటివారినైనా వంచిస్తుంది. అందులో అసత్య భాషణం, పరదారాగమనం, వైరం లేని హింస దానికి మార్గాలు. మీపట్ల మొదటి రెండు చేరలేవు కాని మూడవదైన వైరంలేని హింస మనల్ని బాధించేలా ఉంది. రాక్షసులతో మనకు వైరం లేదు. రాక్షసులు ఎదురైతే మీరు ఆగలేరు. మనం అరణ్యంలో ఉండద్దు. ఈ సందర్భంగా నాకో కత గుర్తుకోస్తోంది చెబుతా,వినండి అని చెప్పి ఇలా చెప్పింది.

ఒక ముని తపస్సు చేసుకుంటున్నారు, పరిక్షాధికారి ఇంద్రుడు సైనిక వేషంలో ఒక కత్తిని ముని కి ఇస్తూ దాచిపెట్టమన్నాడు. ముని కత్తి అందాన్ని పదును చూసి ముచ్చటపడి దాని సంరక్షణకోసం కూడా పట్టుకు తిరగడం ప్రారంభించారు. ఆయన ఆ కత్తిని ఉపయోగిస్తూ అకారణ హింసకు పాల్పడడం మొదలు పెట్టేరు, అధర్మానికి లొంగి. ఆ చర్యలు ఆయనను తపస్సుకు దూరం చేయడమే కాదు నరకానికి తీసుకువెళ్ళాయి. అందుచేత మీరిద్దరూ ఏమి చేస్తే మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నది. దానికి రాముడు

సీతా నీకు మాపట్ల ఉన్న ప్రేమానురాగాలకి చాలా సంతోషం కలిగింది. అడవిలో ఉన్నా అయోధ్యలో ఉన్నా నేను రాజవంశీయుడినే. మంచివాళ్ళను,బలహీనులను రక్షించడమే రాజధర్మం.అందుకే ఆయుధాలు ధరిస్తాం. ఈ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న వీరిని బాధ పెట్టే దుష్టులను శిక్షించడం నా ధర్మం,అందుచేత ఆయుధం విడవనని చెప్పేడు.

శర్మ కాలక్షేపం కబుర్లు-ఉద్దాలకుడు,చండిక

ఉద్దాలకుడు,చండిక

మనదేశంలో వాక్స్వాతంత్ర్యం ఎక్కువ, ఎవరేనా ఏమైనా మాటాడేస్తారు. ఇలా మాటాడచ్చు మాటాడకూడదు అనే శషభిషలేం లేవు.

ప్రభుత్వం చెప్పిన దేనినైనా కాదనడమే కొంతమంది మాట. వీరు దుఃఖ భాగుల్లో ఒకరైన నిత్య శంకితులు. అయ్యో! ఇది మంచిదేమో, ఆచరించ తగినదేమో అనే విచక్షణలేదు. కాదనడమే ధ్యేయం.ఇంతకంటే వివరించను. ఈ సందర్భంగా జైమిని భారతం లో ఒక చిన్న కత గుర్తొచ్చింది, చెబుతా!అవధరించండి.

ఉద్దాలకుడు అనే ఆయన ఒక ముని. తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. కొంతాకాలం తరవాత పితృఋణం తీర్చుకోవాలి అని వివాహానికి ప్రయత్నం చేశాడు. పితృఋణం ఏంటని అనుమానం కదా, సంతానాన్ని కనడమే పితృఋణం తీర్చుకోవడం, అంటే వంశాభివృద్ధి చేయడం.. ఒకకన్య దొరికింది, ఆమె పేరు చండిక. వివాహం చేసుకున్నాడు. కాపరం నడుస్తోంది, బ్రహ్మచారి కాదు సంసారి కాదన్నట్టు ఉన్నాడు. ఉద్దాలకుడు చెప్పిన ప్రతి మాటని ఖండిచడమే వ్రతమైపోయిందా ఇల్లాలికి. వివాహమైన కొత్త కదా సరిపెట్టుకున్నాడు. ఎన్నాళ్ళకీ ఆమెలో మార్పు కనపడలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచించి, గురువుతో చెప్పుకున్నాడు, తన కష్టం. గురువు ఆలోచించి ”నువ్వు చెప్పిన ప్రతి పనికి వ్యతిరేకంగా చేస్తోంది కనక, నీకు కావలసిన దానికి ప్రతిగా ఆమెకు చెప్పమని” చెప్పేడు. నేను నీ సంసారం చూడడానికి వస్తున్నానని చెప్పేడు.

ఇంటికొచ్చిన ఉద్దాలకుడు చండికతో తనకు కావలసిన దానికి వ్యతిరేకంగా చెప్పడం మొదలెట్టేడు. ”జపమాల తెంచి పారెయ్యి జపము లేదు తపస్సు లే”దంటే. ”అయ్యయ్యో! మంచి జపమాల తెంచుకుంటారా! అని, జపం చేయండి” అని పట్టుకొచ్చి ఇచ్చింది. ”మడి లేదు తడీ లేదు పంచలని చింపెయ్య”మంటే, ఆరేసిన మడి పంచలు మడత పెట్టి తెచ్చి ఇచ్చింది. ఇలా కావలసినదానికి వ్యతిరేకంగా చెబుతూ కాలం గడుపుతుండగా గురువుగారు వస్తున్నట్టు కబురు తెలిసింది.

వార్త తెలిసాక చండికతో ”గురువు లేడు దేవుడూ లేడు, నా కోసం ఎవరొచ్చినా లేనని చెప్పెయ్యి. ఇక్కడొక రోజు ఉంటానన్నాడు. లోపలికి రానివ్వకు తరిమెయ్యి, బడిత పూజ చెయ్యి, ఆతిథ్యం కాదు, మంచి నీళ్ళు కూడా ఇవ్వకని” చెప్పిపడుకున్నాడు. మర్నాడు ఉదయమే ఉద్దాలకుని గురువుగారొచ్చారు. ”అమ్మా! ఉద్దాలకుడున్నాడా నేనాయన గురువును” అని అడిగాడు. చండిక ”ఉన్నారండి, లోపలికి దయచేయ”మని ఆతిధ్యం ఇచ్చి ఉద్దాలకుని లేపి ”గురువుగారొచ్చారు చూడమ”ని వంట పనిలో పడింది.మంచి వంట చేసి విందు ఇచ్చి ఉద్దాలకుని చే గురువును సత్కరింపజేసి పంపింది. బయట కొచ్చిన తరవాత గురువుకు నమస్కారం చేస్తూ ”మీరు చెప్పిన మంత్రం పని చేసిందని” ఆనందించాడు. కాలం గడుస్తుండగా ఉద్దాలకుని తండ్రి తద్దినం రోజు రాబోతుండగా, ఉద్దాలకుడు చండికతో ”మాతండ్రి తద్దినం తిథి ఎల్లుండి, తద్దినం లేదు గిద్దినం లేదు ఏమీ చెయ్య”నన్నాడు. కత మామూలే తద్దినం పెట్టి తీరాలంది చండిక. ఐతే ఎవరో సామాన్యులని భోక్తలుగా పిలుస్తానంటే కుదరదు ఆచారవంతులనే పిలవాలని పిలిపించింది. రెండు కూరలు రెండు పచ్చళ్ళు చాలు భోజనానికి అంటే కాదు నాలుగు కూరలు,నాలుగు పచ్చళ్ళు చేయాల్సిందే. అవిగాక గారెలు,ఆవడలు,అరిసెలు,అప్పాలు, పరమాన్నం వండి తీరాల్సిందే అని పట్టుబట్టి చేసింది. ఆ తరవాత దక్షణ ఇవ్వక్కర లేదంటే దక్షిణ భారీగా ఇప్పించింది. ఇక చివరి రంగమైన పిండాల పార్వణ మిగిలింది. ఇంత సవ్యంగా పితృ కార్యం జరగడంతో ఆనందంలో ఉద్దాలకుడు విషయం మరచాడు.

పిండాలను జలంలో వదలివస్తానన్నాడు. అంతే చండిక వాటిని తీసుకుపోయి పెంట మీద పారేసింది. చూసిన ఉద్దాలకునికి పట్టరాని కోపమే వచ్చింది, శ్రార్ధం ఇలా తగలబడిపోయినందుకు. అమిత కోపంతో శపించాడు ”రాయివి కమ్మని”. చిగురుటాకులా వణికిపోయింది చండిక, చూసిన ఉద్దాలకుడు చలించిపోయాడు. శాప విమోచనం చెప్పి తపస్సుకు వెళ్ళిపోయాడు.

మంచి చెడ్డల విచక్షణా జ్ఞానం నశించిన నేటి కుహనా మేధావులు చండికలాగే ఉన్నారు.

శర్మ కాలక్షేపంకబుర్లు-సర్వేజనాః సుఖినో భవంతు.

 • సర్వేజనాః సుఖినో భవంతు.


  పంచశత్కోటి  యోజన  విస్తీర్ణ మహామండలే, లక్షయోజన విస్తీర్ణ జంబూ ద్వీపే, భరత వర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైల ఈశాన్య ప్రదేశే, గంగా గోదావరీయోర్మధ్య దేశే, భీమ ఖండే, సమస్త దేవతా సన్నిధౌ

  శ్రీమహా విష్ణూరాజ్ఞేయ ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే,  అష్టావింశతి మహాయుగే,  కలియుగే, ప్రథమ పాదే, దశాధిక పంచ సహస్ర తమే, అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శార్వరి నామ సంవత్సరే, ఉత్తరాయణే, వసంత ఋతౌ, చైత్రమాసే శుక్లపక్షే, పాడ్యమ్యాం , సౌమ్యవాసరే, శుభ నక్షత్రే, శుభకరణ ఏవంగుణ విశిష్టాయాం, శుభదినే

సర్వదేవతా ప్రీత్యర్ధం యుగాది శుభతిదౌ

శుభమస్తు.
శాంతిరస్తు.
తుష్టిరస్తు.
పుష్టిరస్తు.
ఆరోగ్యమస్తు.
ఐశ్వర్యమస్తు.
సర్వేజనాః సుఖినో భవంతు.

ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవా ఽ వశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః
హరిః ఓం

 

 

శర్మ కాలక్షేపంకబుర్లు -ముందుంది ముసళ్ళ పండగ.

ముందుంది ముసళ్ళ పండగ.

”ముందుంది ముసళ్ళ పండగ”

ఇదొక జాతీయం, ఇది ఒక సినిమాలో రచయిత మేధా శక్తితో ”ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్ఛివల్” గా అపభ్రంశం చెందింది, అదేవాడుకలో ఉన్నది,నేటివారి మెదళ్ళలో. 🙂 అసలర్ధమేంటీ? అసలు కష్టాలు ముందున్నాయీ అన్నదే దాని సారాంశం.

ముసురు ఏకవచనం ముసుళ్ళు బహువచనం. తెనుగులో ఏక,బహువచనాలే ఉన్నాయి. సంస్కృతంలో మాత్రం, ఏకవచనం,ద్వివచనం, బహువచనం లేదా అనేకవచనం అని మూడున్నాయి. ముసురు అనగానేమి? ఏడతెఱపి లేని వర్షం. ఎడ అన్నా తెఱపి అన్నా ఒకటే అర్ధం కాని ఎడతెఱపి అని వాడతారు, అగ్గి నిప్పులాగా 🙂 దీనికేంగాని…

ముసురు అనగా ఎడమివ్వని వర్షం అనుకున్నాం కదూ! ఈ వర్షం దబాటువానలా ఉండదు. చినుకు,చినుకు రాలుతూనే ఉంటుంది, ఇరవైనాలుగు గంటలూ. ఖతరా ఖతరా దరియా బన్ జాతీహై అన్నది ఉర్దూ సామెతనుకుంటా. అనగా బొట్టూ బొట్టూ నీరు సముద్రం అవుతుందని భావం.

వర్షాన్ని ”దుక్కి” లలో కొలిచేవారు, పాత రోజుల్లో వ్యవసాయ దారులు.. ఇది అపభ్రంశం చెంది దుక్కు, ఆతరవాత దిక్కుగా కూడా మారిపోయింది. ”ఒరే! ఒక దుక్కు వర్షం పడిందిగాని రేపు ఉదయమే అరక తోలుదాం” అన్నమాటలు వినపడేవి. ఒక్క సారి చాలు తోలడానికి తగిన వర్షం పడిందన్నది భావం. ఇలా రెండు సార్లు చాలు తోలడాన్ని ”ఇనుమారు” అనేవారు. ఇప్పుడీ మాటలు పల్లెలలో కూడా వినిపిస్తున్నట్టులేదు. సరే కవితా వ్యవసాయులకు ఇవేం పట్టినట్టూ లేవు.

వర్షాన్ని కొలిచేందుకు బహిరంగ ప్రదేశంలో చెట్టూ చేమా లేనిచోట ఎత్తుగా ఔన్స్ గ్లాసులాటిదానిని ఉంచి, చినుకులు చింది గ్లాసులో పడకుండా జాగర్తలు తీసుకుని, అందులో పడ్డ నీటిని కొలిచేవారు. అలా సంగ్రహించిన నీరు అరంగుళం ఉంటే ఒక దుక్కు వర్షం పడినట్టనేవారు. ఇప్పుడు వర్షాన్ని మిల్లి మీటర్లలో చెబుతున్నారు. ఈ సోదికేంగాని….

ఇలా ముసురు పడితే వారం పదిరోజులుండిపోయేది. ”పొయిమీదకి పొయి కిందకి ఉంటే వానాకాలమంత సుఖం మరోటి లేదురా” అనేది పెంచినమ్మ. ఇలా పొయిమీదకి అంటే ఆహార పదార్ధాలు సమృద్ధిగా ఉండడం., పొయి కిందకంటే ఎండు వంట చెరకు బాగా ఉండడం. పల్లెలలో వంట చెరుకు తడసిపోకుండా ఉండడానికి దూలలనుంచి రెండు తాళ్ళు, ఎడంగా కిందకి వదిలి వాటిని ముడేసి వాటి మీద వంట చెరకు పేర్చి ఉంచుకునేవారు. వర్షం ఎడతెఱపి లేకపడితే ఆహారపదార్ధాలు లేక, వండుకోడానికి కట్టెలు లేక బాధలు పడేవారు. ముసురు పడితే ఇంకా బాధలు, బయటికి పోలేకపోవడం, అనారోగ్యాలు చేయడం,మట్టి ఇళ్ళు వానకి నానిపోయి కూలిపోవడం, ఇలా అనేకమైన కష్టాలు ఉండేవి. ఒక ముసురుకే ఇలా ఐతే ఇక వరస ముసుళ్ళు పడితే బతుకు దుర్భరంగా ఉండేది. ఒకప్పుడు ఎండాకాలంలోనే ముసురు పట్టేది. ఇలా ఒక ముసురుకే బాధ పడుతుంటే రాబోయే శ్రావణ,భాద్రపదాలలోమరిన్ని ముసుళ్ళు మరింత బాధపెడతాయని హెచ్చరించడమే ఈ ముసళ్ళపండగ మాట.

నేడు ఒక సారి జనతా కర్ఫ్యూ చేసినంతలో కరోనా ఐపోలేదు, ముందు జాగరతలు ఇంకా తీసుకోవాల్సిందే.ఇప్పుడు కనక ఎండలకి తగ్గితే వర్షాలు పడ్డ తరవాత ఇది విజృంభిస్తుంది. చైనా ఇరవై రెండు వేల మంది సంప్రదాయ వైద్యుల్ని వైరస్ మొదలైన చోటికి తరలించి వ్యాధిని అదుపులోకి తెచ్చింది. ఈ వైద్య విధానమూ రహస్యంగానే ఉంచింది.ఈ నాటికి వేక్సిన్ లేని ఈ వైరస్ పట్ల జాగ్రత్తలు ఎక్కువ అవసరం. మన సంప్రదాయ ఆచారాలు మంచివి కాని వీటి పట్ల విముఖత పెచ్చుగా ఉన్నవారు ఆచరించడానికి బాధపడే సావకాశాలు కనపడుతున్నాయి. తస్మాత్ జాగ్రత జాగ్రత.

ఇంట్లో ఉండండిరా ఎవళ్ళనీ ముట్టుకోకండీ అంటే ఊరేగింపులు జరిపే మిమ్మల్ని ఎవడు కాపాడగలడు? ఇలాగే చేసి ఇటలీ వాళ్ళు పిట్టల్లా రాలి పోతున్నారు. మీ ముఖాన ఏం రాసి ఉందో ఎవరికెరుక. ఆరోగ్య సూత్రాలు పాటించమంటే వితండవాదాలు చేసే మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు.

దేశవ్యాప్తంగా రైళ్ళు రద్దయ్యాయి. విదేశాలనుంచి వచ్చిన వారు క్వారంటైన్ పాటించకపోవడం పరిపాటైపోయింది. క్వారంటై స్టాంప్ వేసినవారు రైళ్ళలో తిరుగుతున్నారు, కరోనా వ్యాప్తి చెందుతోంది. 80 జిల్లాలని మూసివేశారు. జాగ్రత్తలు తీసుకోండి, కష్టం గట్టెక్కమంటే తేలిగా తీసుకుంటే జాతికే నష్టం.

రాబోయే కాలంలో కష్టాలున్నాయన్నదే ముసళ్ళపండగ మాట.

శర్మ కాలక్షేపంకబుర్లు–దేవ శుని

దేవ శుని

శునకః మగ కుక్క శునీ ఆడ కుక్క. ఈ ఆడ కుక్కకో పేరు. అదే ”సరమ” ఇది దేవతల కుక్కట. దేవతల కుక్క అనగా దేవతలయొక్క కుక్క షష్టీ తత్పురుష సమాసమా? లేక కుక్క దేవతా? ఇదే సమాసమో తెలీదు 🙂 ఏమైనాగాని ఈ కుక్కకో కత అదీ ఎక్కడా? ఋగ్వేదంలో. అదేంటో చూదాం. కుక్క దేవతంటే ఇష్టం లేనివాళ్ళు చదవద్దు 🙂


దేవతల రాజు దేవేంద్రుడు, ఈయన ఈ దేవతల కుక్కకి ఒక పని అప్పజెప్పేడు. అదే దేవతల ఆవుల్ని మేతకి తోలుకుపోవడం కాయడం, వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడమే ఆ పని. సరమ చాలా జాగ్రత్తగా ఈ పని చేస్తూ వచ్చింది.


ఒక రోజు దొంగలు దేవతల ఆవుల్ని దొంగిలించి తోలుకుపోయారు. సరమ దేవేంద్రుని దగ్గర దొంగలు ఆవుల్ని తోలుకుపోయిన సంగతి చెప్పింది. విన్న దేవేంద్రుడు సైన్యాన్ని వెంట బెట్టుకుపోయి ఆవుల్ని విడిపించుకు రమ్మన్నాడు. సరమ సైన్యంతో వెళ్ళింది. దొంగలనాయకునితో ఆవుల్ని అప్పగించమని చెప్పింది. దొంగల నాయకుడు సరమా నువ్వు ఎంత భక్తిగా ఆవుల్ని కాసినా ఒక్క రోజునా దేవేంద్రుడు నీకు పాలు తాగమని ఇవ్వలేదు. నువ్వు నీ సైన్యంతో మా పక్షానికొచ్చెయ్యి. నీకు నిత్యమూ ఆవుల పాలు ఇస్తాను అని చెప్పి ప్రలోభ పెట్టేడు.సరమ ఈ ప్రలోభానికి లొంగిపోయి దొంగలతో సైన్యంతో సహా చేరిపోయి పాలు తాగుతూ కాలం గడుపుతోంది.


ఆవుల్ని విడిపించుకురావడానికి పోయిన సరమ, సైన్యం ఎందుకు తిరిగిరాలేదేమోనని దేవేంద్రుడు పరిశీలించగా జరిగినది తెలిసింది. అప్పుడు దేవేంద్రుడు సైన్యంతో వెళ్ళి దొంగలను శిక్షించి ఆవుల్ని మళ్ళించి, సరమ నెత్తి పై కొట్టడంతో అప్పటివరకు సరమ తాగిన పాలన్నీ కక్కుకుంది. సరమను కుక్క సైన్యాన్ని, తనతో వచ్చిన సైన్యాన్ని వెంట బెట్టుకుని దేవేంద్రుడు అమరావతి చేరుకున్నాడు.ఈ దేవతల కుక్క భారతం మొదటిలో కనపడుతుంది, సరమ పేరుతో. ఈమెకు ఒక కొడుకు, వాడి పేరు సారమేయుడు, చిన్నవాడు. ఇతను జనమేజయుడు చేస్తున్న దీర్ఘసత్రయాగం

( బహుకాలం సాగే అన్నదానం ఎడతెరిపి లేక) దగ్గరకి ఆడుకోడానికి వచ్చాడు. ఇది చూసిన జనమేజయుని తమ్ములు శ్రుతసేనుడు,భీమసేనుడు, ఉగ్రసేనుడు అనేవాళ్ళు సారమేయుణ్ణి బయటికి తరిమేశారు, కొట్టేరు. వాడు పోయి తల్లి సరమకి చెప్పుకున్నాడు. కోపం పట్టలేని సరమ జనమేజయుని దగ్గరకొచ్చి


క్షితినాథ కడు నకరుణాన్వితులై నీతమ్ములతి వివేకదూరుల్

మతి దలపక నా పుత్రకు నతిబాలకు ననపరాధు నడచిరి పెలుచన్.


తగునిది తగ దని యెదలో వగవక సాధులకు బేదవారలకెగ్గుల్

మొగి జేయు దుర్వినీతుల కగుననిమిత్తాగమంబులయిన భయంబుల్


రాజా! కరుణలేని నీతమ్ములు, ఆలోచన లేనివారు, నాకొడుకు బహుచిన్నవాడు, అపరాధం ఏమీ లేనివానిని కొట్టేరు.

ఇది చే య చ్చు, ఇది చేయకూడదని ఆలోచించక, పేదవారికి,సాత్వికులకు బాధ కలిగించేవారికి కారణం లేని భయాలు కలుగుతాయని చెప్పి వెళ్ళిపోయింది.


సరమ దేవతల కుక్కే! కుక్కదేవత కాదు. కుక్క దేవతైతే పిల్లలుండరు. దేవతలకి పిల్లలుండరుగా!

శర్మ కాలక్షేపంకబుర్లు-చలిజ్వరం పెట్టి

చలిజ్వరం పెట్టి

ప్రతి తుమ్ము,దగ్గు కరోనా కాదు. అలాగని మనకేం కాదనుకోవడమూ తప్పే. ఏదో ఐపోతోందనుకోవడమూ తప్పే. కరోనా గురించిన చాలా చర్చే నడిచింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ఈ వేడిలో ఈ సూక్ష్మజీవి బతకడం కష్టం. కాని అనుకూల పరిస్థితులుంటే బతుకుతుంది. ఆ అనుకూల పరిస్థితులు కల్పించకుండా ఉండడమే మన కర్తవ్యం, ఒకరినుంచి మరొకరికి పాకకుండా చూసుకోవడం మరో కర్తవ్యం.. ఆ వైరస్ ను మన దగ్గరకి రాకుండా చూసుకోవడమే కావలసినది. చాలా మంది చాలా చెప్పేరు, మన పాత అలవాట్లను ఆచరిస్తే వైరస్ మన దరి చేరలేదు. చేతులు కాళ్ళు కడుక్కోండి, బయటనుంచి రాగానే. బయటికెళ్ళి వచ్చిన బట్టలు వేరుగా పెట్టండి లేదా తడిపెయ్యండి.ఇవన్నీ బయటనుంచి శత్రువును మనం ఇంటిలోకి రాకుండా చేసుకునేవి.ఇంటిలోపల డెట్టాల్ వాడండి, లేదా పటిక నీళ్ళు వాడండి.వేడిగా తినండి…ఇలా ఎన్నో,ఎన్నో..

మనదేశం ఎప్పుడూ బయటి శత్రువు పట్ల జాగ్రత్త గానే ఉంది. బయటి శత్రువు మనల్ని ఏమీ చేయలేకపోయాడు కాని మనకి అంతశ్శత్రువులున్నారు. వారివలనే దేశం ఎప్పుడూ ఓడిపోయింది. అలాగే ఇప్పుడు మనం బయటి శత్రువు కంటే లోపలి శత్రువుకే భయపడాలి. అదేంటీ?

అదే చలి జ్వరం పెట్టి. గత ఏభై ఏళ్ళలో మన నట్టింట తిష్ట వేసినది. ఒకప్పుడు ఇది గొప్ప, కాని నేడు ఇది అవసరం. ఈ చలి జ్వరం పెట్టిలో ఏముంటాయి? ఏమైనా ఉండచ్చు, మొన్న చేసిన కంది పచ్చడి మిగిలినది మొదలు, నాలుగురోజుల కితం కొట్టిన కొబ్బరి చిప్ప దాకా! కొంతమంది ఇల్లాళ్ళు ఇందులో తమ భర్త చల్లగా ఉండాలని సూత్రాలు కూడా దాస్తున్నట్టు వార్త. కొంతమంది నిన్న రాత్రి మిగిలిన అన్నం కూడా ఈ ఫ్రిజ్ లో పెడుతున్నట్టే ఉంది. సరే ఇక పాలు కూరలు తప్పనివే. బయటి వాటికి ఎంత దూరంగా ఉందామన్నా రోజూ వచ్చే పాలు తప్పవుగా. పాల పేకట్లు రాగానే నీళ్ళలో పడేసి ఉంచి విప్పి పాలు కాచుకోడం కొంతమంది అలవాటు. ఇలా చేయడం మూలంగా బయటనుంచి వచ్చే వైరస్ ని అరికట్టవచ్చు. లేదా ఆ పేకట్లు అలాగే ప్రిజ్ లో పెట్టేస్తే ఏమీ లేకపోతే సమస్యలేదుగాని పొరబాటున వైరస్ వస్తే ఈ ఫ్రిజ్ దానికి స్థావరం ఐ పోతుంది. అలాగే బయటనుంచి తెచ్చుకున్న కూరలు ఉప్పునీళ్ళలో కడిగి ఒక సారి ఎండలో పెట్టి అప్పుడు ఫ్రిజ్ లో పెట్టండి.వండిన పదార్ధాలని ఎక్కువ కాలం ఫ్రిజ్ లో పెట్టద్దు.

కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రిజ్ ఆరోగ్యంగా ఉండాలి. అందుకు దీన్ని వారం పది రోజులకో సారి డి ఫ్రీజ్ చేసి, సామాన్లన్నీ బయటికి తీసి డెట్టాల్ నీళ్ళతో కడిగి మరలా మంచి నీళ్ళతో కడిగి పొడిగుడ్డతో తుడిచి అప్పుడు మళ్ళీ అన్ని సరుకులూ సద్దండి. అక్కరలేనివి ఎక్కువ కాలం నిలవున్నవి తీసి బయట పడేయండి.బయటనుంచి తెచ్చుకున్న పచారీ సరుకులుగాని మరేవైనా సరే కొంతసేపు ఎండలో ఉంచెయ్యండి. ఏవైరస్ ఉన్నా చస్తుంది, ఆ తరవాత సద్దుకోండి.రోజూ ఉదయం సాయంత్రం ఒక గంట ఎండలో నుంచోలేరూ! 🙂 ఆ తరవాత మీ చిత్తం, మా భాగ్యం.

నిన్నటి రాత్రి నుంచే (21 రాత్రి) ప్రజలు బయట తిరగడం మానేశారు.

చైనా భక్తులు, ప్రధాని మోడి మరియు భారత పౌరులు కలసి కరోనా ను హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారని సుప్రీం కోర్ట్ లోనూ UNHRC పిటిషన్లు వేసినా ఆశ్చర్యపోకండి

శర్మ కాలక్షేపంకబుర్లు-పాపి చిరాయువు.

పాపి చిరాయువు.

”అయ్యా! చాలా కాలం అయ్యింది మీరు మీ బ్లాగుని దర్శించి “పాపి చిరాయువు” అని అంటారు ఎందుకని.” ఇలా మెసేజి వచ్చింది నాలుగు రోజుల కితం. మెసేజి ఇచ్చిన దెవరు, కాంటాక్ట్ డిటైల్స్ మిస్సయ్యాయి,వెతుక్కున్నా. దోరకలేదు,చివరికి దొరికేయి. అది మరో కత మరోసారి….

మెసేజి రెండు భాగాలు, మొదటిది అభియోగం. తలవంచి నమస్కరిస్తున్నా! ఇక రెండవది,రాయక తప్పలేదు, అదేమనగా…….

పాపి చిరాయువు కదా! ఇందులో పాపియన నెవ్వరు? పాపం చేసినవాడు. పాపమననేది? మరో ప్రశ్న. దీనికి మనపెద్దలు చెప్పిన సమాధానం. ”పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం” అనగా ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఎవ్వారినైనా పీడించడం పాపం.

దీన్ని వివరిస్తే ఎంతేనా ఉంది. కొద్దిలో తేల్చేస్తా. ఇతరులకు అవసరంలో మాట సాయం నుంచి సొమ్ము సాయం చేసేదాకా ఏదైనా ఉపకారమే! దీనిలో ప్రతిఫలాపేక్ష ఉండదు, కాని పుణ్యం మాత్రం చేరుతుంది, మన ప్రమేయం లేకనే! ఇక పాపం అన్నది ఇతరులను పీడించడం, ఇది కూడా మాట దగ్గరనుంచి సొమ్ము దాకా ఆపై శారీరికంగా, మానసికంగా హింసించడం దాకా పాపకార్యాలే!

తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే, నిప్పు ముట్టుకుంటే కాలకమానుతుందా! అలాటిదే ఇదిన్నూ! ఇటువంటి పనులు చేసేటపుడు మన అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది, పాపం చేస్తున్నావూ అని కాని మనం అంతరాత్మని జో  కొట్టేస్తాం.

. అందుకే ”నవ్వుతూ చేసి ఏడుస్తూ అనుభవించడం అని” సామెత. పుణ్య పాప కర్మలకి ఫలితం తప్పదు, ఫలితం అనుభవించకా తప్పదు.”ఎవరు చేసిన కర్మవారనుభవింపకా ఏరికైనా తప్పదన్నా! ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పాగలరు, అనుభవింపక తప్పదన్నా!” తత్త్వం.

ఈ పాపపుణ్య కర్మల ఫలితం మరొకరు అనుభవించడం కుదరనిదిన్నూ! పుణ్యకర్మకి భాగస్థులు ఒక్కరే అది భార్య మాత్రమే! భార్య చేసుకున్న పుణ్యంలో మాత్రం భర్తకి భాగం లేదు. భర్త చేసిన పాపంలో భార్యకు వాటాలేదు. అలాగే పాపానికి కూడా భాగస్థులున్నారు. కర్త,కారయిత,అనుమోదకులు.అనగా కర్త పాపం చేసేవాడు, కారయిత పాపం చేయించేవాడు, అనుమోదక అనగా చేస్తున్న  పాపాన్ని  చూసి చంకలెగరేసి బాగుంది,బాగుందన్నవాడు.

ఉత్కృష్టమైన పుణ్యపాపాల ఫలితాలూ ఉత్కృష్టంగానే ఉంటాయి. పుణ్యాన్ని అనుభవించాలంటే దేవతవుతారు. పుణ్య ఫలం పూర్తికాగానే మళ్ళీ మానవలోకంలో పుడతారు. ఎలా పుడతారు? అందంగా,ఆరోగ్యంగా, ధనవంతులుగా,తెలివైనవారుగా పుడతారు. అసలు కత ఇప్పుడు ప్రారంభమవుతుంది. పూర్వజన్మ పుణ్య ఫలం చేత ఇలా పుట్టేమన్న స్పృహ పోతుంది. ఇక ధన యవ్వన ఇతర గర్వాలు పెరిగిపోతాయి. కామక్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు పెరిగిపోతాయి. ఇంక చూడండి చేసేవన్నీ పాపాలే ఐ ఉంటాయి. పుణ్య ఫలం వల్ల కలిగిన దీర్ఘాయువు ఇలా దుర్వినియోగం అవుతుంది. చేస్తున్నవేమో పాపాలు కాని దీర్ఘాయువుగా ఉంటాడు. చూడ్డానికి ఇవి రెండు భిన్నంగా కనపడుతూంటాయి. అయ్యో ! దేవుడా ఈ పాపాలు చేస్తున్నవాడిని దీర్ఘాయువుగా ఉంచావే అని వాపోతుంటాం. అదీ పాపీ చిరాయువు కత.

అసలు విషయం చెప్పాల్సి వస్తే చాలా ఉంది కాని మధ్యలోచే దారి తప్పించేశాను,ఏమనుకోవద్దు. క్లుప్తంగా చెప్పి ముగించేశానంతే!బాకీ తీర్చేసుకున్నాను.

 

శర్మ కాలక్షేపంకబుర్లు-బోద్ధారో మత్సరగ్రస్తాః

బోద్ధారో మత్సరగ్రస్తాః

మంచిమాట ఎవరికీ అక్కరలేదు. ఈ మాటన్నది నేనుకాదండి,స్వయంగా భర్తృహరి అన్నదే! ఈ మాటంటూనే శతాకాలు మొదలెట్టేరు, మొదట చెప్పినది నీతి శతకమే, ఇదే మొదటి శ్లోకం, అవధరించండి.

బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః
అబోధోవహాతాశ్చాన్యే జీర్ణ మజ్గ సుభాషితమ్

బోద్ధలగువారు మత్సర పూర్ణమతులు
ప్రబలగర్వభూషితుల్ ప్రభువులెన్న
నితరమనుజు లబోభోపహతులుగాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.

తెలిసినవారు అసూయాపరులు, ప్రభువులా గర్వాంధులు. సామాన్యులకు తెలుసుకొనుతెలివి లేదు, కావున నేను చెప్పదలచిన సుభాషితం నాయందే అణగిపోయినది.

ఆనాటికి ఈనాటికి ఇందులో మార్పురాలేదు.

ప్రభువులు ఎప్పుడూ ప్రభువులే! నిరంకుశులే! ఏ కాలంలో ఐనా! వారికి, సుభాషితం చెవినేసుకునే సమయమే ఉండదు. అధవా చెవినిబడ్డా ఆచరించే మనసు, సమయం ఉండవు. వారికెంత సేపు వారి గొప్ప కైవారం చేయించుకోడం, వంది మాగధుల స్తుతులు, రాబడి లెక్కల చిక్కులు, కాంతల కౌగిళ్ళు, ఇంకా ఇతర విషయాలే తప్పించి మంచిమాట వినే సావకాశమెక్కడా?

నేను రెండవవారుగా చెబుతున్నా తప్పించి,భర్తృహరి మాత్రం వీరిని మొదటగానే చెప్పారు, ”బోద్ధారో” అంటే మంచి చెడ్డ చెప్పవలసినవారు.. వీరిని బోద్ధలన్నారు. వారు నేటికాలపు మేధావులు, అనుకోవచ్చు. అసలు నీతిబోధ వీరే చెయ్యాలి కాని వారికా సమయమే దొరకదు. వీరికి తమ గొప్ప నిరూపించుకోడానికి, కాంతాకనకాల పై మోజు తీర్చుకోడానికి, ప్రభువుల దయ చూరగొనడానికి,ప్రభువుల,కాంత కైవారాలు సలపడానికి, ఇతర మేధావులను కించపరచే దానిలోనే సమయం సరిపోదు. వీరు మత్సరగ్రస్తులన్నారు, కవిగారు. అంతశ్శత్రువులారన్నారు,పెద్దలు. వీటిలో చివరిదే మత్సరము అదేఅసూయ.కామ, క్రోధ,మోహ,లోభ,మద, మాత్సర్యాలే అవి. ఒక్కొకమెట్టు పెరుగుతూ చివరిదైనదే అసూయ. ఈ అసూయ కూచోనివ్వదు,నిలబడనివ్వదు. అసూయ చేసే చిన్నెలు చూడవలసినదేగాని చెప్పడం వర్ణించడం చాలా కష్టం. ఆడ,మగ తేడా లేదు వీరిలో. ఇక వీరెన్ని రకాలు, నా తల మీద ఉన్న వెంట్రుకలన్ని గ్రూపులు, గ్రూపులో కూడా ఒకరంటే మరొకరికి పడదుగాక,పడదు. ఉన్నమాట చెప్పుకోవాలంటే అందరూ స్వార్ధపరులే! అందరూ కాంతాకనకాల వెంట పరుగులు తీసేవారే! ఇక సమాజానికి మంచిమాట చెప్పే సమయమేదీ? బహు కొద్దిమంది కుమ్మరావలో ఇత్తడి ముంతల్లా అక్కడక్కడ కనపడచ్చు.

మిగిలినవారు, సామాన్యులు. వీరికి రెక్కాడితేగాని డొక్కాడదు, శరీరమాద్త్యం ఖలు ధర్మ సాధనం, వీరిది. ఏరోజు కారోజు ”పిట్టనికొట్టా పొయిలో పెట్టా” సరిపోతుంటుంది, పొయిమీదకి పొయి కిందకి వెతుక్కోడమే వీరికి జీవిత లక్ష్యం, పరమార్ధం అయినది..వీరికి సుభాషితం వినే సమయమే లెదు. ఒక్కొకపుడు విన్నా, ఆచరించే సమయం లెదు, తాహతసలే లేదు. కారణం ఏదైనా సుభాషితం ఆచరించాలంటే విత్తం కావాలి, అది వీరి దగ్గర పూజ్యం, అందుచేత ఒక వేళ మంచి మాట వీరి చెవిని పడినా అది నిష్ప్రయోజనం.

కవిగారు ఇంకా ఇలా అనుకున్నారు, ఇటువంటి సమాజంలో నా సుభాషితం ఎవరికి కావాలి? ఎవరికి చెప్పను, అని వేదన పడ్డారు, సుభాషితం నా లోనే అణగిపోయిందన్నారు. అలాగని చెప్పడం మానేసేరా? లేదు. ఆరు శతకాలు చెప్పేరు, చెప్పడం నాధర్మం,నా పని నేను చేస్తున్నా! విత్తనాలు వెదజల్లుతున్నా! పండే పంటని సద్వినియోగ పరచుకోవడమనేది, ముందు తరాల పని, అనుకున్నారు.నేటికీ కవిగారు చెప్పిననాటి పరిస్థితులు మారలేదు.

నేటికీ కవిగారు చెప్పిననాటి పరిస్థితులు మారలేదు. నేటి ప్రభువులు ఇదంతా మతమౌఢ్యం, చెప్పడానికే వీలు లేదంటున్నారు, బడిలో. తరవాత తరాలవారి మాటేమో……

శర్మ కాలక్షేపంకబుర్లు-బొబ్బర్ల అట్టు.

బొబ్బర్ల అట్టు.

బొబ్బర్లు తెలుసుకదా! బలేవారే బొబ్బర్లు తెలియకపోవడమేంటండి? నేటి కాలంలో చిరు ధాన్యాలని, రాగులు,చోళ్ళు,గంటెలు,ఊదలు,చామలు, కొర్రలు, ఇలా పేరు కూడా ఎప్పుడూ విననివాటి వెనకపడి ఎక్కడ దొరుకుతున్నాయంటే అక్కడికి పరుగెట్టీ కేజి మూడొందలంటే కొనుక్కుని తెచ్చుకుని తినటం లేదూ?

ఏం తింటున్నారూ? నేటి స్టార్ కొచ్చను కదా? ఎందుకు వీటి వెనకపడి వీటిని తింటున్నారు? ఒఖ్ఖ మాటలో చెప్పాలంటే వేలం వెర్రి ఇదంతా, మరేంలేదు..ఇవి తింటే వందేళ్ళు బతుకుతాంటా! రోగమే ఉండదుటా! ఇలా ఊహాగానాలు. . ఇదిగాక మరోమాట కూడా, ఇప్పుడు ఎవరూ,ఎప్పుడూ వినని తృణ ధాన్యం తింటున్నామన్నదో స్టేటస్ సింబలై పోయింది. అదేగాక ఇప్పుడు హై సొసైటీలో చోడిజావ తాగుతున్నామని చెప్పుకోడమూ, గంజి తాగుతున్నాం ఉడుకునుంచి రక్షించుకోడానికని చెప్పడం గొప్పైపోయింది. సరే ఏదైనా అతిచేస్తే గతి చెడుతుందని నానుడి. ఇటువంటి చిరు ధాన్యాలు తినడం మంచిదే! దానితో పాటుగా చేయవలసిన పనులు చేయకపోతే చిరు ధాన్యాలు తిన్నా ఒకటే బియ్యపు అన్నం తిన్నా ఒకటే! నా మాట బాధించవచ్చు, ఏం చేస్తాం ఇది నిజం.

రేపో నేడో స్టార్ హోటల్లో కొర్రన్నం+ కొరివికారం, గానుగు నూనెతో, నంజుడికి వెన్నతో తిని, కొద్దిగా ఉప్పేసుకుని ఉల్లిపాయ కొరుకుతూ గంజి తాగి రావడం ఫేషన్ కావచ్చు, ఎవరు చూడొచ్చేరు చెప్పండి? దారి తప్పేనా మన్నించండి.

కందులు,మినుగులు,పెసలు లాటి పప్పు ధాన్యాలే బొబ్బర్లు కూడా. పాతరోజుల్లో వీటిని ఉప్పుతో ఉడకబెట్టుకుని తినేవారు. వీటినే గుగ్గిళ్ళు అంటారు, వీటిని గుర్రాలకీ పెట్టేవారు, పొడుగుపాటి బుట్టలో పోసి గుర్రం మూతికి కట్టేసేవారు. ఈ గుగ్గిళ్ళు తిన్న గుర్రం అలుపులేక పరుగెట్టేది, మళ్ళీ దారి తప్పిపోయానండీ!

ఈ బొబ్బర్లని రాజామా అంటారు ఉత్తరాదివారు. రాజమా పప్పుతో రోటీలు,పుల్కాలు, ఉల్లిపాయ కొరుక్కుని స్టఫ్డ్ మెరపకాయతో తింటే ఓ ఆనందమే ఆనందం. బొబ్బర్లు పేదవారి ఆహారం, వీటితో రకరకాలు చేసుకోవచ్చు…ఇలా….

రాత్రి బొబ్బర్లు నానబెట్టండి, ఉదయానికి బలే ఉబ్బుతాయి. మిక్సీ లో వేయండి, మెత్తగా రుబ్బండి. చిటికెడు పసుపేసి, తగిన ఉప్పెయ్యండి. అట్టులా వేసుకోడానికి తగినంత పల్చగా చేసుకోండి. నాన్ స్టిక్కులొద్దు, ఇనప పెనం మీద అట్టులా వేసి, అల్లం పచ్చిమిర్చి వేయండి. సన్నగా కాలనివ్వండి, తగిన నూని వేయండి. అబ్బో పెసరట్టు రుచికంటే గొప్పగా ఉంటుంది.

ఇక పుణుకుల్లా వేసుకోవాలంటే ఉండయ్యేలా పిండి ఉంచండి. అందులో మిర్చి, అల్లం వేసుకోండి. ఉండల్లా చేసి నూనెలో బంగారం రంగొచ్చేదాకా వేయించి తియ్యండి. బలే రుచిగా ఉంటాయి. వీటిని పోపుపెట్టిన పెరుగులో వేయండి. చల్ల పుణుకుల్లా బొబ్బర పుణుకులు మంచి రుచిగా ఉంటాయి.

చివరగా పెసరట్ల కూర వండుకుంటాం కదా! అలాగే బొబ్బరట్లతో గాని, పుణుకులతోగాని కూర వండుకోవచ్చు.

శర్మ కాలక్షేపంకబుర్లు-శివుడు శ్మశానంలోనే ఎందుకుంటాడు?

పనిలో ఉన్నారా? ఫరవాలేదు, మీ పని చేసుకుంటూ, ఒక చెవి ఇటు పడేసి మహన్యాసం వినండి.   

 

శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు?

ఈ ప్రశ్న నాది కాదు, ఈ అనుమానం సాక్షాత్తు అమ్మవారికే వచ్చి, అయ్యవారిని నిండుకొలువులో అడిగేసింది, (భారతం. అనుశా.ప. అశ్వాసం….4….418 నుండి443 వరకు స్వేఛ్ఛానువాదం.) ఆ కధాక్రమంబెట్టిదంటే………

శంకరుడు కైలాసంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు,మునులు,భూతగణాలు నిండిఉన్న కొలువులోఉన్న,ఆ సమయంలో గౌరీదేవి వెనుకనుంచి వచ్చి, శంకరుని రెండుకళ్ళూ తనచేతులతో మూసింది. లోకాలన్నీ చీకట్లుకమ్మేయి, జీవులన్నీ సంక్షోభం చెందాయి.. శంకరుడు మూడవనేత్రం తెరిచారు. హిమనగం మండిపోవడం మొదలయింది. అది చూసిన గౌరి ”స్వామీ మూడవకన్ను తెరిచారేమీ? దానివల్ల నా తండ్రి హిమవంతునికి బాధ కలిగిందని” వేడుకుంది, ”మూడవకన్ను తెరవడానికి కారణం రహస్యమైతే చెప్పద్ద”ని ముద్దుగా అలిగింది కూడా. అందుకు శంకరుడు కరుణగా చూడగా, హిమనగం మామూలయింది. ”గౌరీ, నీకు తెలుపకూడని రహస్యాలు నాకులేవని, నేను లోకాత్మకుడిని, సర్వలోకాలు నన్నుపట్టి ఉంటాయి. నువ్వు నా రెండుకళ్ళూ మూశావు, లోకాలు చీకటి, సంక్షోభం చెందాయి, అందుకు మూడవకన్ను తెరవాల్సివచ్చింద”న్నారు. ఆ! ఇది మంచి సమయం, ఉన్న అనుమానాలన్నీ తీర్చేసుకుంటాననుకుని ప్రశ్నల వర్షం కురిపించడం మొదలెట్టింది.

”మీకు నాలుగు ముఖాలెందుకున్నాయి?”

”ఒకప్పుడు సుందోపసుందులనేవారు ఉండేవారు.వాళ్ళులోకాలను బాధిస్తుండేవారు. మయుడు లోకంలోని అన్ని అందాలను పోతపోసి ఒక స్త్రీని సృస్టించి నా దగ్గరకు తెచ్చాడు. అది నాకు ప్రదక్షిణంగా నా చుట్టూ తిరిగింది. ఆమెను నాలుగు దిక్కులా నిశితంగా పరిశీలించడం కోసం నాలుగు ముఖాలు ధరించాను, అప్పటినుంచి చతుర్ముఖుడనయ్యాను.”

”మీకు కంఠం మీద నల్లమచ్చ ఏమి?”

”దేవతలు, దానవులు కలిసి పాలకడలి మధించినపుడు వచ్చిన హలాహలాన్ని మింగి అక్కడ ఉంచాను. అందుకు అక్కడ మచ్చ ఏర్పడింది. ఇంకా ఏమయినా ప్రశ్నలుంటే అడగ”మన్నారు, శంకరులు.

”పినాకమనే విల్లు ధరిస్తారు కారణం చెప్ప”మంది గౌరి.

”కణ్వుడనే మహాముని ఆదియుగం లో తపస్సు చేశాడు. ఆయనపై పుట్టలు మొలిచాయి. ఆ పుట్టమీద ఒక వెదురుపొద మొలిచింది, అది చాలా అద్భుత పరిమాణంలో పెరిగింది. బ్రహ్మగారు ఆమునికి వరాలిచ్చి, ఆ వెదురునుంచి మూడు విల్లులు తయారు చేశారు. ఒకటి పినాకము,నా దగ్గర ఉన్నది. రెండవది శార్ జ్గము, ఇది విష్ణువు దగ్గర ఉన్నది. మూడవది తాను తీసుకున్నారు . అప్పటినుంచి పినాకం చేతిలో ఉండటం మూలంగా పినాకపాణి అని నాపేరు”.

”లోకంలో మరేదీ వాహనం లేనట్టు ఎద్దును వాహనం చేసుకున్నారేమీ?” గౌరి ప్రశ్న.

”హిమనగం దగ్గర తపస్సు చేసుకుంటున్నా. చుట్టూ గోవులు చేరిపోయాయి, చాలా బాధపెట్టేయి. కోపంగా చూడగా సంతాపం చెందేయి. అప్పుడు విష్ణుమూర్తి వృషభాన్ని నాకు కానుకగా ఇచ్చారు. నాకు ‘గోపతి’ అని పేరుకూడా పెట్టేరు. అప్పటినుంచి ఎద్దు నా వాహనమైనది.”

”మీరేమో పరమ శుచిమంతులు, మంచి ఇంట్లో వాసం చేయక శ్మశానం లో ఉన్నారేమి   స్వామీ?”

”భయంకరమైన భూతాలు, ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మగారు నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానం లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉండటంతో లోకాలు రక్షింపబడ్డాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం అంటారు, జనం తిరగరు, అందుకు ఇక్కడనుంచి లోకాలను రక్షించాలనుకున్నా”.

”ఈ బూడిద రాసుకోడం, పాములు ధరించడం, శూలం,పరశువులు ఆయుధాలు, భీకరమైన రూపం ఏమి స్వామీ?.”

”లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి శీతం, రెండవది ఉష్ణం. ప్రపంచం ఈ రెంటితోనే ఉంది. సౌమ్యం విష్ణువు, ఆగ్నేయం నేను, విశ్వాన్ని భరిస్తాను, అందుచేత వేడి, భయంకరమైన రూపం ధరిస్తాను”

”మరి చంద్రవంకను  నెత్తిన ఎందుకు ధరిస్తారు?”

”దక్షయజ్ఞ సమయంలో నేను దేవతలని బాధించాను, ఆ సమయంలో చంద్రుడిని కాలితో తొక్కేను, చంద్రుడు నన్ను శరణు వేడాడు, ’అయ్యో! పొరపాటు చేసేననుకుని చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాను”

అమ్మకి వచ్చిన అనుమానాలని శంకరులు తీరిస్తే వివరాలు అందరికి తెలిశాయి. అమ్మకివన్నీ తెలియవా? తెలుసు పిల్లలకి తెలియచేయాలని అమ్మ చేసిన చిన్న మాయ.

నమః శOభవేచ/ మయోభవేచ/ నమః శంకరాయచ/ మయస్కరాయచ/ నమః శ్శివాయచ/ శివతరయాచ/

ఈశాన సర్వ విద్యానాం/ ఈశ్వర సర్వభూతానాం/ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా/ శివోమే అస్తు సదా శివోం/.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఘనపాఠి

 

Posted on నవంబర్ 22, 2015

ఘనపాఠి

వేదాన్ని శ్రుతి,స్వాధ్యాయం అని కూడా అంటారు. శ్రుతి అనగా వినబడినదని అర్ధం. అనూచానంగా వేదాన్ని కంఠోపాఠంగా మాత్రమే ఉంటోంది. రాసుకోవచ్చుగా అన్నారు మేధావులు, అలాకాదు వేదాన్ని ఉదాత్త అనుదాత్త స్వరాలతో పలకాలి, లేకపోతే అర్ధం మారిపోతుంది, కనుక ముఖతః ఉండక తప్పదన్నారు. అదీగాక ఈ వేద పారాయణ శబ్దానికి శక్తి ఉంది. అందులో విషయం గురించి తర్కించేటంత తెలివి నాకు లేదు, ఇది అప్రస్తుతం కూడా.

వేదం లో ఉన్న వాటిని సూక్తులు అంటారు. వేదం లో వాటిని ఋక్కులు అనీ అంటారు. ఈ సూక్తులను కంఠోపాఠం చేయడానికి కొన్ని పద్దతులున్నాయి, అవి

1.వాక్య పాఠం లేదా సంహితా పాఠం 2.పదపాఠం 3.క్రమ పాఠం 4.జట పాఠం .5. ఘన పాఠం. వీటి స్వరూపాలు చూద్దాం. ఇవిగాక మరిన్ని పద్ధతులూ ఉన్నాయట. ఇలా చేయడం మూలంగా అక్షరం కూడా బీరుపోకుండా ఉంటుంది. అక్షరం బీరుపోకుండా అన్న నానుడి దీనినుంచి పుట్టినదే!

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో ముక్షీయ మామృతాత్

ఇది మహా మృత్యుంజయ మంత్రం.దీనిని వివిధ రకాలుగా పారాయణ చేయడం చూదాం.

1. వాక్య లేదా సంహితా పాఠం:- పై సూక్తాన్ని అలాగే సంధులు విడతీయకుండా గానం చేసేది వాక్య లేదా సంహితా పాఠం.

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో ముక్షీయ మామృతాత్

2.పద పాఠం:- ఇందులో సూక్తాన్ని పదాలుగా విడతీసి గానం చేయడం.

పదాలుగా 1.త్రయంబకం2.యజామహే3.సుగంధిం.4.పుష్టి5.వర్ధనం. 6.ఉర్వారుక7. ఇవ.8.బంధనాత్ 9.మృత్యో 10.ముక్షీయ 11.మాం 12.అమృతాత్. పదాలుగా విడతీసి గానం చేయడాన్ని పద పాఠం అంటారు. ఇలా వేదాన్ని అధ్యనం చేసినవారిని తెనుగునాట స్వాధ్యాయి అనేవారు.

3.క్రమ పాఠం:- క్రమ పాఠంలో పై సూక్తిలోని పదాలను క్రమంలో గానం చేయడం. అది ఇలా,

పదాలు. 1-2,2-3,3-4,4-5,5-6,6-7,7-8,8-9,9-10,10-11,11-12.

త్రయంబకం యజామహే, యజామహే సుగంధిం, సుగంధిం పుష్ఠి, పుష్టి వర్ధనం, వర్ధనం ఉర్వారుక, ఉర్వారుక మివ, ఇవబంధనాత్, బంధనాత్ మృత్యో, మృత్యో ముక్షీయ, ముక్షీయమాం, మాంఆమృతాత్.

ఇలావేదాన్ని అధ్యయనం చేసినవారిని క్రమాంతస్వాధ్యాయి అనేవారు.

జట పాఠం:- సూక్తంలో పదాలని
1-2,2-1,1-2;
2-3,3-2,2-3;
3-4,4-3,3-4;
4-5,5-4,4-5;
5-6,6-5,5-6;
6-7,7-6,6-7;
7-8,8-7,7-8;
8-9,9-8,8-9;
9-10,10-9,9-10;
10-11,11-10,10-11;
11-12,12-11,11-12.
ఇలా కూర్చి సుస్వరంగా గానం చేస్తే, అదిలా ఉంటుంది. ఇలా వేదాన్ని అధ్యయనం చేసినవారిని జటాంత స్వాధ్యాయి అంటారు.

త్రయంబకం యజామహే,యజామహే త్రయంబకం,త్రయంబకం యజామహే;
యజామహే సుగంధిం, సుగంధిం యజామహే,యజామహే సుగంధిం;
సుగంధిం పుష్టి,పుష్టి సుగంధిం, సుగంధిం పుష్టి;
పుష్టి వర్ధనం, వర్ధనం పుష్టి, పుష్టి వర్ధనం;
వర్ధనం ఉర్వారుక,ఉర్వారుక వర్ధనం ,వర్ధనం ఉర్వారుక;
ఉర్వారుకమివ, ఇవ ఉర్వారుక,ఉర్వారుకమివ;
ఇవ బంధనాత్, బంధనాత్ ఇవ, ఇవ బంధనాత్;
బంధనాత్ మృత్యో,మృత్యో బంధనాత్ బంధనాత్ మృత్యో;
మృత్యో ముక్షీయ,ముక్షీయ మృత్యో ,మృత్యో ముక్షీయ;
ముక్షీయ మాం, మాం ముక్షీయ, ముక్షీయ మాం;
మాం అమృతాత్,అమృతాత్ మాం ,మాంఅమృతాత్;

ఘన పాఠం:- సూక్తంలో పదాలని
1-2,2-1,1-2-3,3-2-1,1-2-3;
2-3,3-2,2-3-4;4-3-2,2-3-4;
3-4,4-3,3-4-5,5-4-3,3-4-5;
4-5,5-4,4-5-6,6-5-4,4-5-6;
5-6,6-5,5-6-7,7-6-5,5-6-7;
6-7,7-6,6-7-8,8-7-6,6-7-8;
7-8,8-7,7-8-9,9-8-7,7-8-9;
8-9,9-8,8-9-10,10-9-8,8-9-10;
9-10,10-9,9-10-11,11-10-9,9-10-11;
10-11,1-10,10-11-12,12-11-10,10-11-12.
ఇలా కూర్చి సుస్వరంగా గానం చేస్తే, అదిలా ఉంటుంది. వేదాన్ని ఇలా అధ్యయనం చేసినవారిని ఘనాంత స్వాధ్యాయి లేదా ఘనపాఠీ అంటారు. వీటిని గురుముఖతః నేర్చుకోవలసిందే. అలవాటులో ఇది ఘనాపాఠీ అయింది. ఈ ఘన పాఠంలో కూడా కొన్ని భేదాలున్నాయి. ఇంత కష్టపడి వేదం జిహ్వాగ్రాన ఉంచుకున్నవారు, అదీగాక పరిక్షలో నూటికి నూరు మార్కులూ రావలసిందేగాని కొన్ని తగ్గినా కుదరనిదీ ఈ విద్య. అందుకు వీరిని ఘనపాఠీ అని గౌరవించడం జరుగుతుంది.  ఈ ఘనపాఠీ పదానికి కూడా వికృతార్ధమే చెప్పేస్తున్నారు.

౧-౨,౨-౧,౧-౨-౩,౩-౨-౧,౧-౨-౩;
త్రయంబకం యజామహే;యజామహే త్రయంబకం,త్రయంబకం యజామహేసుగంధిం,సుగంధింయజామహే త్రయంబకం,త్రయంబకం యజామహేసుగంధిం
౨-౩,౩-౨,౨-౩-౪;౪-౩-౨,౨-౩-౪;
యజామహే సుగంధిం, సుగంధిం యజామహే,యజామహే సుగంధింపుష్టి,పుష్టి సుగంధింయజామహే,యజామహే సుగంధింపుష్టి;
౩-౪,౪-౩,౩-౪-౫,౫-౪-౩,౩-౪-౫;
సుగంధిం పుష్టి,పుష్టి సుగంధిం, సుగంధిం పుష్టివర్ధనం,వర్ధనంపుష్టి సుగంధిం, సుగంధిం పుష్టివర్ధనం;
౪-౫,౫-౪,౪-౫-౬,౬-౫-౪,౪-౫-౬;
పుష్టి వర్ధనం, వర్ధనం పుష్టి, పుష్టి వర్ధనంఉర్వారుక,
ఉర్వారుక వర్ధనంపుష్టి, పుష్టి వర్ధనంఉర్వారుక; ,
౫-౬,౬-౫,౫-౬-౭,౭-౬-౫,౫-౬-౭;
వర్ధనం ఉర్వారుక, ఉర్వారుకవర్ధనం,వర్ధనం ఉర్వారుకమివ,ఇవ ఉర్వారుకవర్ధనం,వర్ధనం ఉర్వారుకమివ;
౬-౭,౭-౬,౬-౭-౮,౮-౭-౬,౬-౭-౮;
ఉర్వారుకమివ, ఇవ ఉర్వారుక,ఉర్వారుకమివబంధనాత్,
బంధనాతివౌర్వారుక,ఉర్వారుకమివబంధనాత్;
౭-౮,౮-౭,౭-౮-౯,౯-౮-౭,౭-౮-౯;
ఇవ బంధనాత్,బంధనాత్ ఇవ, ఇవ బంధనాత్బంధనాత్మృత్యో,మృత్యోబంధనాత్ ఇవ, బంధనాత్బంధనాత్మృత్యో;
౮-౯,౯-౮,౮-౯-౧౦,౧౦-౯-౮,౮-౯-౧౦;
బంధనాత్ మృత్యో,మృత్యో బంధనాత్,బంధనాత్ మృత్యోముక్షీయ;ముక్షీయమృత్యోబంధనాత్,బంధనాత్మృత్యో ముక్షీయ;
౯-౧౦,౧౦-౯,౯-౧౦-౧౧;౧౧-౧౦-౯,౯-౧౦-౧౧
మృత్యో ముక్షీయ,ముక్షీయ మృత్యో,మృత్యో ముక్షీయమాం;మాంముక్షీయమృత్యో,మృత్యో ముక్షీయమాం;
౧౦-౧౧,౧౧-౧౦,౧౦-౧౧-౧౨;౧౨-౧౧-౧౦,౧౦-౧౧-౧౨
ముక్షీయ మాం, మాం ముక్షీయ, ముక్షీయ మాం అమృతాత్, అమృతాత్ మాం ముక్షీయ, ముక్షీయ మాం అమృతాత్.

విషయ సేకరణ, శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి గ్రంధం The Vedas నుంచి.

ఘనపాఠం వినండి

https://drive.google.com/file/d/1dNMOVa1jPv4t9FbwewZM0vF4UvqwxmXn/view?usp=sharing

14 THOUGHTS ON “శర్మ కాలక్షేపంకబుర్లు-ఘనపాఠి”

 1. Venkatram Rao Kalaga on 12:17 వద్ద నవంబర్ 26, 2015 said:మార్చు 0 0 Rate ThisSarma GaruExcellentWe expect moreReply ↓
 2. anniyya@yahoo.com on 09:53 వద్ద నవంబర్ 23, 2015 said:మార్చు 0 0 Rate Thisమేక మేక తొక తోక మెకమెక తొకమేక మెకతోక. ఇవి చాలా కష్టం సార్.Reply ↓
 3. Zilebi on 22:29 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisబాగుందండీ శర్మ గారు,మరి ఆ ఘన ఘటం ఆకాశం లో కలిసి పోయాక ఆ స్వరమాలిక స్థానం/ప్రస్థానం ఎక్కడ ?జిలేబిReply ↓
  • kastephaleon 00:24 వద్ద నవంబర్ 23, 2015 said:మార్చు 0 0 Rate ThisZilebi గారు,
   సంఘటితమైతే జీవం విఛ్ఛినమైతే……అంతా మిధ్య. ఆకాశంలో కలిసిన తరవాత స్వరమాలికా లేదు/స్థానమూ లేదు. అనంతంలో కలిస్తే విడిగా కనపడుతుందా? 
   ధన్యవాదాలు.Reply ↓
 4. venkat on 22:10 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisavunu, cinemaalo vinadame thappa, poorthigaa theliyadu. mee valla..thelisindi..Thank you so much.Reply ↓
 5. తాడిగదప శ్యామలరావు on 07:06 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisదాన్ని ఉదాత్త అనుదాత్త స్వరాలతో పలకాలి, లేకపోతే అర్ధం మారిపోతుందన్నారు. నిజమే. కాని ఈ‌రెండే కాక స్వరిత, ప్లుతాలనే‌మరో రెండు స్వరబేధాలు కూడా ఉన్నాయనుకుంటాను. నాకు సరిగా తెలియదు.Reply ↓
  • kastephaleon 00:18 వద్ద నవంబర్ 23, 2015 said:మార్చు 0 0 Rate Thisతాడిగదప శ్యామలరావు గారు,
   చాలా విషయాలు మనకు తెలియనివే ఉన్నాయి. వేద శాఖలు 1192 ట. అందులో ప్రస్తుతం ప్రకటం గా ఉన్నవి 92 శాఖలట. ఇక మీరు చెప్పినవి కూడా ఉండ్చ్చు, నాకూ తెలిఅయదు.
   ధన్యవాదాలు.Reply ↓
 6. స్వాతి on 06:21 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisహమ్మయ్య, మీరు మళ్ళీ వచ్చేసారు. ఆనందం. అప్పుడెప్పుడో స్వర్ణకమలం సినిమాలో ఘనపాఠి గురించిన ఒక సీన్ ఉంటుంది (మీరు సినిమాలు చూసేవారో తెలియదు మరి). నాకప్పుడు అర్థం కాలేదు అసలు ఘనపాఠి అంటే ఏమిటో, తెలుసుకోవాలనే ప్రయత్నమూ చేయలేదు. ఇదిగో ఇన్నాళ్ళ తరువాత మీ మూలాన తెలుసుకునే అవకాశం కలిగింది. Reply ↓
 7. Dr.Suman Lata Rudravajhala on 02:04 వద్ద నవంబర్ 22, 2015 said:మార్చు 0 0 Rate Thisమీరు అందరికీ పరిచయమున్న మహా మృత్యుంజయ మంత్రం ఉదాహరణ ఇస్తూ వేదం పాఠాలకు ఇచ్చిన వివరణ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు ఉంది .ధన్యవాదాలు. మీ ‘ కాలక్షేపం ‘ కబుర్లు మాకు జ్ఞాన ప్రసాదాన్ని అందిస్తున్నాయి అని మాత్రమె చెప్పగలను . సుమన్ లతReply ↓
  • kastephaleon 00:12 వద్ద నవంబర్ 23, 2015 said:మార్చు 0 0 Rate ThisDr.Suman Lata Rudravajhala గారు,
   పరమాచార్య అనుగ్రహ భాషణాలను మరొకరు ఆంగ్లంలో కి అనువదించి పుస్తకం వేశారు. దానినుంచి విషయం సేకరించి ఒక ఋక్కుకు అన్వయించి చెప్పేను. వారు చాలా చెప్పివున్నారు, నా భాషా పరిజ్ఞానం తో తప్పులు చెబుతానేమోనని భయపడి ముగించాను. మొన్న బ్లాగ్ మూసినపుడు అక్కడక్కడా చెదురుగా ఉన్న టపాలు రాసినవి, సగం రాసినవి అన్నీ మూట్ కట్టేను. అందులో ఇది కనపడింది. ఇంకా రాయాలనుకున్నాగాని, సవరించి ముగించాను.
   అమ్మ మీ ద్వారా అనుగ్రహించిన అభిమానానికి
   ధన్యవాదాలు.

శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !

పాలకోసం రాళ్ళు మోయడం.

DSCN3171

“పాలకోసం రాళ్ళు మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం కోసం కష్టపడటమని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఉదాహరణ, ఒక సామాన్యుడు తన కొడుకు/కూతురు అభివృద్ధికోసం పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి కూడా కష్టపడి సంపాదించి వారి చదువు కోసం కష్టించడం, ఇలా చెప్పుకోవచ్చు. మరి దీనికి పాల కోసం రాళ్ళు మోయడానికి సంబంధం ఏమని కదా మీ ప్రశ్న, అదుగో అక్కడికే వస్తున్నా.

DSCN3173
పాడి పంట అన్నారు కదా! పల్లెలలో ఉదయమే పొలం వెళ్ళడం అలవాటు చేసుకోడం కోసమనీ, పాలు పితుక్కుని తెచ్చుకోడంకోసమనీ, పొలం చూసుకోడం కోసమనీ, బహుళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, పశువులను పొలంలో ఉంచేవారు, పశువులకు తగినంత మేత అక్కడే ఉంటుంది కనక, ఒక పాక వేసి పశువులను అందులో కట్టేవారు. పాడి పశువులను ఇతర పశువులనుంచి వేరుగా ఉంచేవారు కూడా. ఉదయమే పొలం వెళ్ళి, వస్తూ పాలు పితుక్కుని వచ్చేవారు. ఈ పాలు ఇంటికి తేవడమెలా? ’పాల తప్పేలా’ అని ఉండేవి, ఇవి బిందె ఆకారం లో చిన్నవిగా ఉంటాయి. ఈ పాల తప్పేలా తేవడానికి రెండు మార్గాలు. ఒకటి, తప్పేలా కి ’ఉగ్గిలి’ వేసి తేవడం, రెండు ఒక కావడిలో తేవడం. ఉగ్గిలి వేసి తెచ్చే సందర్భంలో పాలు తొణికే సావకాశం ఉండి నేల పాలయ్యే సావకాశం ఉంది.

DSCN3186
“ఉగ్గిలి”

దానికి తోడు పాల తప్పేలాని చేతితో తాకే సావకాశం ఉంది. ఇక్కడ పాలతప్పేలా గురించి చెప్పాలి. దీనిని ఇత్తడితో తయారు చేస్తారు, ఈ తప్పేలాని రోజూ శుభ్రంగా చింతపండుతో ముందు తోమి తరవాత వెలిబూడిదతో తోమి, కడిగి ఎండలో బోర్లిస్తారు, తప్పేలా బంగారపు రంగులో మెరుస్తూ ఉంటుంది, ఎందుకూ, కారణం ఏ సందర్భంలో కూడా పాలు విరిగిపోకుండా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికీ. ఇదే పాలున్న తప్పేలాని కావడిలో తెస్తే పాలు తొణకవు, నేలపాలూ కావు. ఇక్కడ కావడి గురించీ చెప్పుకోవాలి. సాధారణంగా కావడి మట్లు( పక్కనుండే వాటిని మట్లు అంటారు) నేలకు ఒక అడుగు ఎత్తులో ఉంటాయి. అదే పాల కావిడికి అవి భూమికి బాగా ఎత్తులో ఉంటాయి. ఈ పాల తప్పేలాని ఒక పక్క మట్టు అనగా కావడి ఒకవైపు లో పెడితే రెండవ వైపు తేలిపోతుంది కదా! తేవడం కష్టం కదా అందుకు సరి సమానమయిన బరువున్న ఒక రాతిని కావడి రెండవ మట్టులో వేసుకుని తూకం సరి చూసుకుని పాలు ఇంటికి తెచ్చేవారు. ఇదిగో అలాగ రోజూ పాలు కోసం ఒక రాతిని ఇంటికీ పొలానికి మోసేవారు. అదిగో అలా పాలకోసం రాళ్ళు మోయడం వచ్చింది. దీని మూలంగా ఉపకారం ఉంది కూడా, పశువు ఇస్తున్న పాలు తగ్గినా రాయి మార్చవలసివస్తుంది, దానితో ఆ విషయం తెలుస్తుంది. మరి ఇంటినుంచి పొలం వెళ్ళేటప్పుడెలా? రాతిమోత, అనుమానం రావచ్చు, ఇంటినుంచి ఆ పాల తపేలాలో శుభ్రమైన నీళ్ళు పట్టుకెళ్ళేవారు, ఈ నీళ్ళు కావడి తూకానికి సరిపోవడమే కాక పశువు పొదుగును పాలుతీసేముందు కడగడానికి తన చేతులు కడుగుకోడానికీ ఉపయోగించేవారు. ఆ రోజులలో పొలాలలో శుభ్రమైన నీరు దొరికే సావకాశాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు చెప్పండి మన పూర్వులు తెలివి తక్కువవారా? ఊరికే మోశారా రాళ్ళు. పాలకోసం రాళ్ళూ మోయడం తెలిసిందికదా!

DSCN3174

25 THOUGHTS ON “శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !”

Reply ↓
గోపాలకృష్ణ on 16:55 వద్ద మే 2, 2013 said:మార్చు
0 0 Rate This
శర్మగారూ, ఊరికి వెళ్లి రావడం వల్ల మీ ఈ పోస్టుని ఇప్పుడే చూసేను.పుట్టి పెరిగింది మరీ పల్లెటూరు కాకపోవడం వల్లనో ఏమో మరి ఈ నానుడి ఎప్పుడూ విని ఉండలేదు.ఎక్కడా చదవ లేదు కూడా. మంచి విషయాలు చెబుతున్నారు.అభినందనలు..

Reply ↓

kastephale
on 23:06 వద్ద మే 2, 2013 said:మార్చు
0 0 Rate This
@గోపాలకృష్ణ గారు,
పుట్టి పెరిగినవి రెండూ బహుచిన్నపల్లెలు, ప్రతివిషయం పరిశీలించి చూచే అలవాటు, నానుడులన్నీ ఇద్దరమ్మలూ విరివిగా మాటాడటం చేత అస్థిగతమైపోయాయి, అప్పుడప్పుడిలా బయటికి వస్తున్నాయి. ఈ నానుడి విరివిగా గో.జిలలో వాడేదే.
ధన్యవాదాలు
నెనరుంచాలి.

Reply ↓
గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు on 01:58 వద్ద మే 2, 2013 said:మార్చు
0 0 Rate This
Reblogged this on Gpvprasad’s Blog.

Reply ↓

kastephale
on 23:02 వద్ద మే 2, 2013 said:మార్చు
0 0 Rate This
@ప్రసాద్,
ధన్యవాదాలు
నెనరుంచాలి.

Reply ↓
జలతారువెన్నెల on 00:56 వద్ద మే 1, 2013 said:మార్చు
0 0 Rate This
అసలు ఈ సామెత నేనెప్పుడు వినలేదండి శర్మ గారు.
మొదటి సారి చదివాను ఇప్పుడే!

Reply ↓

kastephale
on 22:41 వద్ద మే 1, 2013 said:మార్చు
0 0 Rate This
@జలతారు వెన్నెలగారు,

ఇది మన గో.జి లలో ఎక్కువగా వాడే నానుడి. ఒక చిన్న సంభాషణ,

వదినా అన్నయ్య కనపడటం లేదు.

ఏంచెప్పమంటావు వదినా! పెద్దాడేమో ఇంజనీరింగ్ చేశాడు,దేనికో డబ్బు కట్టాలట, చిన్న పిల్ల డాక్టర్ గా ఇంకా రెండేళ్ళ చదువుంది, సంసారం చూస్తే పోసిన నూనెకి, వేసిన వత్తికి సరిపోతోంది, పిల్లలకోసం నిద్ర హారాలు మానేసి తిరుగుతున్నారు, పిచ్చి మారాజు.

అలా అనుకుంటే ఎలా వదినా పాలకోసం రాళ్ళుమొయ్యాలిగా!

నెనరుంచాలి.

Reply ↓
Sudhakar on 21:45 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
మీరు చెప్పిన విషయాలు, ఆసక్తి కరం గా ఉన్నాయండీ !

Reply ↓

kastephale
on 23:24 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
@సుధాకర్ జీ,
ముఫై, నలభై సంవత్సరాల కితందాకా ఈ దృశ్యం పల్లెలలో బాగా కనపడేది. రోజులు మారేయికదా రాళ్ళు మోయడం మానేశారు 🙂
నెనరుంచాలి.

Reply ↓
Sharma G S on 14:59 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
శర్మ గారూ ,

నమస్తే .

మీరీ టపాకు పెట్టిన ఫొటో చూడగానే 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందండి నా మనసు .
గ్రామఫోన్ రికార్డులకి ఇదే రకంగా ఓ చిహ్నముండేది .
మా నాన్నగారు హరికథాభాగవతార్ . ఆయన వద్ద గ్రామఫోన్ రికార్డులుఇండేవి .

మన పూర్వీకులు చేసే ప్రతి చేతలో , మాట్లాడే ప్రతి మాటలో పలు ప్రయోజనాలు ఉండి తీర్తాయి .
కాని వాటి అర్ధాలు బహు కొద్దిమందికే తెలుస్తాయి . మీరిలా వివరించటం వల్ల చాలామంది తెలుసుకోగలుగుతున్నారు .

Reply ↓

kastephale
on 23:21 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
@శర్మాజీ,
నా టపా మిమ్మల్ని పాతకాలానికి తీసుకుపోయిందనమాట 🙂 మనం ప్రస్తుత వ్యవస్థను మార్చలేం, మారాలనుకోడం కూడా పొరపాటే, పాత విషయాలు తెలుసుకోడమే.
నెనరుంచాలి.

Reply ↓
sahiti on 12:07 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
అరటిపండు వొలిచి మరీ అందించారు కదండీ శర్మగారూ! చాలా థాంక్స్ ….:-)

Reply ↓

kastephale
on 23:18 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
@సాహితి గారు,
స్వాగతం.సుస్వాగతం నా బ్లాగుకు, మా గురువుగారు ఎప్పుడూ “నీకు తెలియదన్నట్లు వివరించి చెప్పాల”న్నారండి 🙂 కదళీ పాకమయితే సరిపోతుందని 🙂 అలా
నెనరుంచాలి.

Reply ↓
bonagiri on 12:06 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
బాగుందండి.
మీ టపాలతో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము.

Reply ↓

kastephale
on 23:15 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
1 0 Rate This
@మిత్రులు బోనగిరి గారు,
కొన్నయినా విషయాలు తెలియనివి తెలుసుకున్నందుకు, మన జీవన వ్యవస్థ ఎంత మారిందో తెలుసుకోడానికి పనికొస్తాయి కదా, ఈ టపాలు 🙂
నెనరుంచాలి.

Reply ↓
Dantuluri Kishore Varma on 11:21 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
బాగుంది శర్మగారు.

Reply ↓

kastephale
on 23:13 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
@వర్మాజీ
నెనరుంచాలి.

Reply ↓
C V R Mohan on 10:13 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
1 0 Rate This
ఇప్పుడు రాళ్ళూ మోసే అలవాటు తప్పిపోయింది.
పిల్లలు పాలు మిషన్లో బిళ్ళ వేయడం వల్ల వస్తోందనీ,
ఆవుపాలు ఇచ్చే విషయాన్నే మరచి పోతున్నారు. కాల మహిమ.

Reply ↓

kastephale
on 23:12 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
@మోహన్జీ,
ఇప్పుడు పాలు కాదు పాపాలే తాగుతున్నవి. పిల్లలు ఆవులు పశువులను జూ లలో చూసే రోజులొచ్చేసేయి. 🙂
నెనరుంచాలి.

Reply ↓
anuradha on 07:47 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
“పాలకోసం రాళ్ళు మోయడం”అనే నానుడి గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.

Reply ↓

kastephale
on 23:10 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
@అమ్మాయ్ అనూరాధ,
ఈ సామెతలు, నానుడులు వాడేస్తాం కాని వాటి పుట్టుక గురించి ఆలోచించం 🙂
నెనరుంచాలి.

Reply ↓
తాడిగడప శ్యామలరావు on 04:26 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
బాగా తెలిసిందండి.

Reply ↓

kastephale
on 23:08 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
@మిత్రులు శ్యామలరావు గారు,
మీకు ఈ సంగతి తెలియదంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది.
నెనరుంచాలి.

Reply ↓
Palla Kondala Rao on 00:13 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
0 0 Rate This
పాలకోసం రాళ్లు సామెత ఎలా వచ్చిందో అర్ధమయిందండీ. మరిన్ని సామెతల సంగతులు మీ కలం …. కాదు కాదు కీ బోర్డ్ నుండి రావాలని ఆశిస్తున్నాను.

Reply ↓

kastephale
on 23:07 వద్ద ఏప్రిల్ 30, 2013 said:మార్చు
2 0 Rate This
@మిత్రులు కొండలరావుగారు,
ఇదివరలో కొన్ని చెప్పేను. మరికొన్ని చెప్పచ్చు, కాని సమయానికి గుర్తురావు 🙂 ఎవరేనా అడిగినపుడు, ఒక సంఘటన జరిగినపుడు ఇవి గుర్తొస్తాయి, అప్పటికప్పుడు రాసెయ్యాలి, దానికి బోలెడు చిక్కులు, కరెంట్ వారు ప్రధములు. నోట్ బుక్ లో రాసుకుని ఉంచుకుని కొన్ని రాస్తున్నా అక్కడికీ. తరవాతనుకుంటే మరుపొచ్చేస్తోంది 🙂
నెనరుంచాలి.

శర్మ కాలక్షేపంకబుర్లు- 8 log 10

నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతువది మేలు తత్క్రతుశతంబుకంటె సుతుండు మేలు త
త్సుతశతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు చూడగన్.

శ్రీమదాంధ్ర మహాభారతము. అరణ్యపర్వం.ఆశ్వాసం-౪-౯౩

నిజంమాటాడటమే వ్రతంగా కలవాడా! వంద మంచినీళ్ళ నూతులకంటే ఒక బావి మేలు. అటువంటి వంద బావులకంటే ఒక మంచి క్రతువు మేలు. అటువంటి వంద క్రతువులకంటే ఒక కొడుకు మేలు. అటువంటి వంద మంది కొడుకులకంటే ఒక్క నిజమైన మాట మేలు.

ఇది భారతంలోని పద్యం.

మన పెద్ద పెద్దమామ్మ చెప్పిందీ మాట ఎవరితో? పెద్ద పెద్దతాతతో ఏం సందర్భం? మన పెద్దమామ్మ శకుంతల పెంచిన తండ్రి కణ్వునకు చెప్పకుండా, తండ్రి ఆశ్రమంలో లేనప్పుడు వచ్చిన రాజు దుష్యంతుని గాంధర్వ వివాహం చేసుకుంది. పెళ్ళి చేసుకుని, ఆమె గర్భవతి కాగానే నేను రాజ్యానికి వెళ్ళి నిన్ను రాజ్యానికి తీసుకెళ్ళడానికి మనుషుల్ని పంపిస్తానూ అని వాగ్దానం చేసి వెళిపోయాడు. నమ్మేసింది. ఆయనేమో వెళిపోయాడు. తండ్రి వచ్చాకా విషయం తెలుసుకున్నాడు, గొడవ చెయ్యలేదు, చూదామని కూతుర్ని ఆశీర్వదించి ఊరుకున్నాడు. శకుంతలకి కొడుకు పుట్టేడు. ఆ కుఱ్ఱాడికి భరతుడు అని పేరు పెట్టేరు, మరీ కుఱ్ఱాడికి ఆ ఆశ్రమం చుట్టు పక్కల ఋషులు సర్వదమనుడు అని బిరుదిచ్చేసేరు, సింహాలు,పులలను తీసుకొచ్చి వాటిని ఆశ్రమం చుట్టూ ఉన్న చెట్లకి కట్టేసేవాడట. కాలం గడుస్తోంది. దుష్యంతుని నుంచి కబురు లేదు. తనే బయలు దేరింది, ఈ సారి తండ్రితో చెప్పి. తండ్రి శిష్యులను తోడిచ్చి పంపేడు. రాజ సభకి వచ్చింది. ఇడుగో వీడు నీకొడుకు అని పరిచయం చేసింది,సభలో. దుష్యంతుడు కంగుతిన్నాడు. దారేపోయేవాడెవడినో తీసుకొచ్చి వీడు నీ కొడుకంటావా? అసలు నువ్వెవరో నాకు తెలీదు, చాలు చాలు ఇటువంటి మాటలు కట్టిపెట్టు అన్నాడు. రాజు అబద్ధం ఆడుతున్నట్లు తెలిసిపోయింది శకుంతలకు. అప్పుడు అన్నమాటిది. దీని అంతరార్ధం ఏంటీ?

వందమంచినీళ్ళ నూతులు కంటె ఒక బావి మేలు, వందబావులకంటే ఒక క్రతువు మేలు. వంద క్రతువులకంటే ఒక మంచి కొడుకు, వంద మంది మంచి కొడుకులకంటే ఒక నిజమైన మాట మేలు. ఒకదానికంటే ఒకటి నూరు రెట్లు మేలు అని లెక్కలు చెప్పింది.

అదెంత?

(ఇక్కడో మాట అసందర్భమే! నుయ్యి అంటే కొద్దిలోతుండేది,కొద్దిమందికే నీరిచ్చేది. బావి అంటే చాలా లోతైనదీ తోడిన కొద్దీ నీరిచ్చేది, వ్యవసాయానికీ నీటి వసతి. ఇదీ నూతికి బావికి తేడా.)

వంద నూతులు= ఒక బావి 10 square

వందబావులు =ఒక క్రతువు 10 square

వంద క్రతువులు= ఒక కొడుకు 10 square

వంద మంది కొడుకులు = ఒక నిజమైన మాట 10 square

Total 10 square X 10 square X 10 square X 10 square = 10 to the power 8

అనగా

10,00,00,000

పది కోటి రెట్లు మేలని చెప్పడానికి ఇంత చెప్పింది చూడండి.

అదీ ఎవరితో చెప్పిందీ నువ్వెవరో నాకు తెలీదు పొమ్మన్న మొగుడుతో. అబద్ధమనే సముద్రంలో ములిగిపోయిన తాతతో

Great మామ్మా you are great.

బొమ్మకి టపాకి లింకేంటీ? వస్తున్నా! బొమ్మలోదేంటో తెలుసా దాన్ని గేలం అంటేరు. అదే ఏంకర్. నూతుల్లోంచి బావుల్లోంచి నీరు తోడుకునేందుకు బొక్కెనలు వాడేవారు. వీటిని చేదలు అని కూడా అనేవారు.

ఇవి తాటాకుతో తయారు చేయబడేవి, కాలంలో ఇనుప బొక్కెనలొచ్చాయి. అవి నూతిలో పడిపోతే వెతికి తీసుకునే సాధనమే ఈ గేలం. అబద్ధమనే సముద్రంలో ములిగిపోయిన తాతని నిజమనే గేలం వేసి పట్టుకుంది మన మామ్మ.

శర్మ కాలక్షేపంకబుర్లు-జ్యాభర్త దుర్మంత్రిచే……

దౌర్మంత్ర్యాన్నృపతిర్వివశ్యతి యతిః సంగాత్సుతో లాలనాత్‌
విప్రోఽనధ్యయనాత్కులం కుతనయాచ్ఛీలం ఖలోపాసనాత్‌ ।
హ్రీర్మద్యా దనవేక్షణాదపి కృషిః స్నేహః ప్రవాసాశ్రయాన్‌
మైత్రీ చాప్రణయాత్సమృద్ధిరనయాత్త్యాగ ప్రమాదాద్ధనమ్‌॥

యతిసంగంబున, బాలుడాదరముచే, జ్యాభర్త దుర్మంత్రిచే,
శ్రుతిహానిన్ ద్విజు,డన్వయంబు ఖలుచే, గ్రూరాప్తిచే శీల, ము
ద్ధతిచే మిత్రత, చూపులేమిగృషి, మద్యప్రాప్తిచే సిగ్గు, దు
ర్మతిచే సంపదయు నశించు, జెడు నర్ధంబుల్ ప్రమాదంబునన్.

దుర్మంత్రివలన రాజు,సంగమువలన యతి,లాలించుటచే పుత్రుడు, వేదాధ్యనమౌ లేమి బ్రాహ్మణుడు,చెడ్డ పుత్రునివలన వంశము, దుర్మార్గుల సేవలతో సదాచారము, మద్యపానముచే సిగ్గు, చూడకపోవడం మూలంగా వ్యవసాయము, దేశాంతరము వలన స్నేహము,అనురాగము లేమివలన మైత్రి, నీతిలేమి వలన సంపద, అపాత్రదానము,పరాకువలన ధనము నశించును.

ఎవరంతట వారు పాడైపోతే బాధ లేదుగాని ఒకరు మరొకరిచే పాడవడం విచారించతగ్గదే 🙂 ఎవరెవరి వలన పాడవుతారని భర్తృహరి చెప్పిన మాట లక్ష్మణకవి నోట పలికారు. అదెలాగో తెలియాలిగా 🙂

యతిః సంగాత్‌

యతి అంటే సంన్యాసి. సర్వసంగ పరిత్యాగులైతే సంన్యాసి అవుతారు, రమణులలాగా. ఇలా ఉండవలసిన సంన్యాసి సంగము అనగా ఏ విషయం మీదనైనా స్నేహంచే చెడిపోతారు, అంటే తాముండవలసిన మార్గం లో ఉండరు. యతి నిత్య సంచారం చేయాలి,ఇది నియమం. ఎక్కడ ఆగినా రెండు రాత్రులు మించి ఒక చోట ఉండరాదు,ఇదీ నియమమే. అటువంటి యతి ఒక ఊళ్ళో ఉండిపోయారంటే అక్కడేదో స్నేహం ఏర్పడింది, అది ఏ స్నేహమైనా కావచ్చు, ఆఖరికి ఆ చోటు బాగుందనిపించడం కూడా అందులోనిదే! మరి వీరు చాత్రుమాస్యం చేస్తారు కదా! అప్పుడు సంచారం ఎలా? ప్రశ్న. నిజమే అందుకు చాతుర్మాస్యానికి ఒక పుణ్యక్షేత్రానికి చేరుకోవాలి. అదండి సంగతి, బాబోయ్ నేను సంన్యాసిని కాను….

సుతో లాలనాత్‌…..

చిన్నపిల్లవాడిని కొంతవయసొచ్చేదాకా రాజులా పెంచాలి, ఆ తరవాత సేవకునిలా చూడాలి, మరికొంత వయసొచ్చాకా మిత్రునిలా చూడాలి లేకపోతే….పప్పూలే తయారవుతారోచ్

దౌర్మంత్ర్యాన్నృపతిర్వివశ్యతి……

రాజు చెడ్డవాడైన మంత్రిచే చెడిపోతాడట. ఇప్పుడు రాజులూ లేరు, రాజ్యాలూ లేవు మంత్రులూ లేరు. నేడు ప్రజలే ప్రభువులు, ఆ ప్రభువులనుంచి ఎన్నుకోబడినవారే మంత్రులు వారే నేటి రాజులు. అధికార గణమే మంత్రులు. వీరు సరియైన సలహాలిచ్చి మంత్రులను నడిపించాలి. ””ఇదిగోనండీ ఇదో మంచి కాంట్రాక్టు, మీరు పదవికి కొత్త, ఇక్కడ బాగానే నొల్లుకోవచ్చు..”” ””.రేపెవవరేనా చూస్తే…పట్టుకుంటే…పరువుపోయె,డబ్బుపోయే…భయంగా ఉందయ్యా!”” ” నేను ఇరవైయేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నా, ఎంతమంది మీలాటి కొత్తవారికి ఉపకారం చెయ్యలేదు, మనం మనం ఒకటే,రేప్పొద్దున్న ఏమొచ్చినా మీరు మమ్మల్ని కాపాడాలి,మేము మిమ్మల్ని కాపాడాలి, చిదంబర రహస్యం తెలిసింది కదా! అంచేత నొక్కండి……నన్ను మరిచిపోకండి, ఇంకా ఇరవైయేళ్ళు ఉద్యోగంలో ఉంటా……”” ఇంకా మంత్రి ఎలా తయారవుతాడు, అసలే కోతి కల్లుతాగింది,నిప్పుతొక్కింది,పిచ్చిపట్టింది,ఆ పై దయ్యం పట్టినట్టు కనపడిన ప్రతీది నొల్లేసుకోడూ? అందుచేత సలహా చెప్పేవాణ్ణి సరైనవాణ్ణి వేసుకోకపోతే ఇంతే సంగతులోచ్..

విప్రోఽనధ్యయనాత్‌…..

ఇప్పుడు వేదం చదువుకునేవారే తక్కువ. కుల బ్రాహ్మణులేగాని గుణ బ్రాహ్మణులు లేరు. వేదం చదుకున్నవారు  అధ్యయనం చేయకమానరు. అలా అధ్యయనం చేయకపోతే చెడిపోవడం ఖాయం.

కులం కుతనయా…..

కులములో నొక్కడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత అన్నారు వేమనతాత. అంతెందుకుగాని ఒక్కడు కుపుత్రుడుంటే చాలు, తల్లి తండ్రులకు అందరికి గొప్పపేరు తెచ్చిపెడతాడు కదా! ఏదీ ఆ ఆకులవారబ్బాయా! ఓహో ఎంత గొప్పవాడు అని చెప్పుకోరూ

శీలం ఖలోపాసనాత్‌….

దుర్మార్గుని సేవలో సదాచారం, బ్రాకెట్ కంపెనీలో ఉద్యోగం చేస్తే ఏంమాటలు అబ్బుతాయి? డబల్ జీరో వస్తుందా? నిన్న ఓపెనింగ్ ఈవేళ క్లోజింగ్ వస్తుంది,ఒరే నిన్న రత్నాలొచ్చింది కదా! ఎప్పుడెళ్ళిందీ? ఇటువంటి మాటలు తప్పించి మంచిమాటలొస్తాయా?

టపా పెద్దదైపోతోంది,మిగిలింది తరవాత

శర్మ కాలక్షేపంకబుర్లు- వంకాయ బండ పచ్చడి

వంకాయ బండ పచ్చడి

వంకాయలు రెండు రకాలు తెల్లవి నల్లవి. వీటిలో మళ్ళీ రెండు రకాలు పొడుగువి గుండ్రనివి. గుండ్రని వాట్లో పెద్ద కాయలు వేరు, ఇవి ఒక్కొకటి కేజి ఆ పైన తూగుతాయి కూడా. వీటిని మా దగ్గర జేగురుపాడు వంకాయ అంటాం. ఇవి తెల్లగా పెద్దవిగా ఉంటాయి. ఇందులో ముళ్ళొంకాయ కూడా ఉంటుంది,తెల్లగా, పెద్దదిగా. ఇలా పెద్దగా ఉన్న కాయలు పచ్చడికి బాగుంటాయి. ఇందులో చారలున్న కాయలుంటాయి, వీటిలో గిజర ఎక్కువుంటుంది, ఇవి మాత్రం బాగోవు పచ్చడికి. గిజర అంటే గింజలని అర్ధం, ఈ గింజలు చిన్నచిన్నగానే ఉంటాయి. 

ఈ కాయని నిప్పుల మీద కాల్చాలి, నిప్పులు దొరకవు కదూ! గేస్ బర్నర్ మీద ఇనప చిక్కం వేసి  కాల్చచ్చు. కాల్చిన కాయను పక్కన పెట్టుకోండి. సన్నగా చింతపండు పులుసు పిసకండి. దానిలోకి ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కోండి. అలాగే పచ్చి మిర్చిని కూడా బాగా సన్నగా తరగండి. కొచం పసుపు పిసర వేయండి. కాల్చిన వంకాయ పైన నల్లగా మాడినది ఒలిచేయండి. ఇప్పుడు ఈ ఒలిచిన వంకాయను చింతపండు పులుసులో వేసి పిసకండి. మిక్సీ లో వేయద్దు. బండతో దంచుకుంటే బాగుంటుంది, బండ దొరకదుగా! పప్పు గుత్తి ఉంటే దానితో కలపండి. ఇందులో పోపు వేయండి, ఇష్టమైతే ఇంగువ వేయండి,పోపులో.కొద్దిగా వేయించిన నువ్వు పప్పు కలపండి.చిన్న బెల్లం ముక్కేయండి. తీపిగా తినాలనుకుంటే ఎక్కువే వేయండి. ఉప్పు సరి చూసుకు వేయండి. మూత పెట్టి ఉంచేయండి. నాలుగు గంటల తరవాత వాడండి. ఆ రుచేవేరు కదా!

 

శర్మ కాలక్షేపంకబుర్లు- బెల్లపు ఆవకాయ!

బెల్లపు ఆవకాయ!

బెల్లము+ఆవకాయ అనాలా?
బెల్లపు+ఆవకాయ అనాలా?

సరే
ఏదోలా అన్నామే సరి చూడండి, సంధి చేస్తే ఏమనాలి?
బెల్లపావకాయ సవర్ణదీర్ఘ సంధియా?
బెల్లపుటావకాయ అనాలా? టుకారసంధియా?

సరే
ఇదేం సమాసం. సమాసం తెలియాలంటే విగ్రహవాక్యం చెప్పుకోవాలట కదూ? 

బెల్లంతో ఆవకాయ తోన్,తోడన్ తృతీయా విభక్తియా?
బెల్లం కలిసిన ఆవకాయా? అందు,న సప్తమీ విభక్తియా?

ఐతే సమాసం విశేషణ పూర్వ పద కర్మధారయ సమాసమా?అమ్మో! అమ్మో!! నాకూ తెనుగొచ్చేస్తోందండోయ్!

మిత్రులొకరు వాటస్ ఆప్ లో ఇది

పుంప్వాదేశ సంధి అని
విగ్రహ వాక్యం బెల్లం యొక్క ఆవకాయ కనక
షష్టీ తత్పురుష సమాసమని చెప్పేరు.
ధన్యవాదాలు.

ఎందుకింత గందరగోళం, తెల్లోడు చూడండి ఎంగిలిపీస్ లో జాగరీ పికిల్ అనేసేడు, చక్కహా లేదూ

ఏంటో గందరగోళం. తెనుగులో బెల్లపావకాయ, పుల్ల పుల్లగా, కారం కారంగా, తియ్య తియ్యగా ఉండేది తినడానికి ఇన్ని తెలిసుండాలా? ఇవేవీ తెలియకపోతే బెల్లపావకాయ ముద్ద గొంతు దిగనంటుందా?

ఏంటీ? ఆవకాయలో బెల్లమా? మతుండే మాటాడుతున్నారా?

అవును బాబూ! అవును!!

ఆవకాయలో బెల్లం వేస్తారు! దాన్ని బెల్లపు ఆవకాయంటారు, మహా ప్రీతిగా తింటారు. అదెలాగో చూదాం, రుచిగానూ ఉంటుంది .

పుల్లటి మామిడి కాయలు తీసుకోవాలి. బెల్లపు ఆవకాయకి పుల్లటి కాయలెందుకని కదా అనుమానం! పుల్లటికాయలైతేనే రుచిమరి. ఆ తరవాత మీ ఇష్టం. కారం,ఆవ సరి సమానంగా తీసుకోండి. ఆవ తయారు చేసుకునేటపుడు, ఆవాలకి కొద్దిగా మజ్జిగ రాయండి. ఆరనివ్వండి, మిక్సీలో వేయండి. వెంఠనే కొద్దిగా పసుపేసి,ఉప్పేసి కలిపెయ్యండి.పిండి ఐన వెంటనే పొట్టు చెరిగెయ్యండి, ఇలా తొందర తొందరగా చేస్తే ఆవ కనరెక్కదు, లేకపోతే కనరెక్కిపోయి ఆవకాయ బాగోదు. ఇప్పుడు ఆవ,కారమూ గుచ్చెత్తండి, వెంఠనే కాయ దొరక్క పెట్టుకోలేకపోతే! ఉప్పు మాత్రం కలపకండి. ఉప్పు ఎప్పుడూ ఆవకాయ గుచ్చెత్తేటపుడు మాత్రమే కలుపుకోవాలి.ఉప్పు కారం,ఆవ అన్నీ సమాన పాళ్ళు ఉండాలి.

మామిడి కాయలు ముక్కలుగా తరగండి, పెచ్చుని డొక్క ఉండాలి. కారము,ఆవ కలిపిన గుండను వెడల్పైన పళ్ళెం లోకి తీసుకోండి. ఇప్పుడు ఉప్పు కలపండి, ఆపై ముక్కలేయండి, నూని వేయండి, ముక్కల్ని గుండలో పొలపండి, ఆవకాయని తడిలేని జాడీలో పెట్టండి, పైన కొద్దిగా నూని వేయండి, మూత గట్టిగా పెట్టి నిలవుంచండి.

ఇదేంటీ బెల్లపావకాయ చెబుతానని…..

అలా పెట్టిన ఆవకాయని మూడురోజుల తరవాత తీయండి, ఊటవచ్చి ఆవకాయ జారుగా అవుతుంది, ఇందులో మెంతులేయండి, పచ్చివే. ఆపైన నూనెపోయండి. కలపండి పైనా కిందా! వేరే బేసిన్ లోకి తీసుకునీ కలపచ్చు. దీనిని జాగ్రత్త పెట్టండి. తగినంత బెల్లం తీసుకోండి, పాకం పట్టండి, మరీ లేతపాకం బాగోదు, నిలవుండదు, మరీ ముదురు పాకం కాక తీగ పాకం వచ్చేదాకా మరిగించండి. కొద్ది చలారనివ్వండి. అప్పుడు జాడీలో ఊరగాయను ఒక బేసిన్ లో తీసుకుని అందులో ఈ బెల్లం పాకం పోసి కలపండి, ఒక్క రోజు నిలవుంచండి. మర్నాడు పెచ్చులతో సహా ఎండలో పెట్టండి. గట్టి ఎండ తగిలిన తరవాత, మర్నాడు పెచ్చులని ఉన్న పిండి ఊడ్చెయ్యండి, పెచ్చులు పిండి విడి విడిగా ఎండలో పెట్టండి, రెండు గట్టి ఎండలు తగిలిన తరవాత పెచ్చులు పిండి కలిపేయండి. బెల్లపు ఆవకాయ రెడీ. నీరు తగలనివ్వక జాడీలో నిలవ చేయండి. బెల్లపు ఆవకాయ రెడీ!

ఆవకాయ పుల్లపుల్లగా,తియ్యతియ్యగా,కారంకారంగా బలే ఉంటుంది.

శర్మ కాలక్షేపంకబుర్లు- n log బంగారం

చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్

హేమంబుఁ గూడఁబెట్టిన

భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ

  చీమ చాలా చిన్న జీవి, ఇవి సంఘ జీవులు. కష్టపడి పుట్ట నిర్మించుకుంటాయి. అది చాలా సౌకర్యంగా ఉంటుంది. పాములు సొంతంగా గూడు నిర్మించుకోలేవు. ఇవి బలహీనమైన చీమల పుట్టల్ని స్వాధీనం చేసుకుంటాయి. సాధారణంగా చీమలు ఓడిపోతుంటాయి.పాములు చీమల పుట్టల్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం సామాన్యులు పోగుచేసుకున్న బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారంటారు బద్దెన. కాని అప్పుడపుడు ఇలా కూడా జరుగుతుంది.

బలవంతుడ నాకేమని

పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలి చీమల చేతజిక్కి చావదె సుమతీ

బలవంతుడినని విర్రవీగినవారంతా చిన్నవైన చలిచీమల చేత చనిపోయిన మహా సర్పంలా ఐపోతారు సుమా అని కవిగారి మాట. అందుకు ఎప్పుడూ ఎక్కువమందితో విరోధం పెంచుకోకూ అని సలహా కూడా.

ప్రజలు కూడా చిన్న చీమలలాటివాళ్ళు. బంగారం పోగుచేస్తూనే ఉంటారు. ఇదే వారికి ఒక ఆధారం,అత్యవసరాలలో. అదెలాగంటే, ఏ కుటుంబంలో నైనా ఎంతో కొంత బంగారంలో మదుపుచేయాలని చూస్తారు. అది కూడా స్త్రీకి అనగా ఆఇంటి ఆడకూతురికి నగగా ఉండాలని చూస్తారు. దీనిని స్త్రీ ధనం అంటారు, ఆ బంగారం తండ్రి ఇచ్చినదే కావచ్చు లేదా భర్త ఇచ్చినదే కావచ్చు. సాధారణంగా స్త్రీ ధనాన్ని ముట్టుకోడానికి పురుషాహంకారం అడ్డొస్తుoది. పూర్తిగా అర్ధికంగా చితికిపోయి దిక్కుతోచని సమయంలో ఆ ఇంటి స్త్రీ, తన ఒంటి మీద బంగారాన్నిచ్చి కుటుంబాన్ని నిలబెట్టిన కతలూ కోకొల్లలు. అందుకు భారతీయులు అందునా స్త్రీలు బంగారం మీద మోజు చూపిస్తారు, పై పై కబుర్లు చెబుతారుగాని పురుషులూ సహకరిస్తారు.. మరి ఈ బంగారం అధికంగా ఉంటే ప్రభుత్వం పట్టుకుపోతుందని బద్దెనగారు నాడే చెప్పేరు, మరి ఇప్పుడు బంగారం ఎంత వుండచ్చు అన్నది CBDT Central board of direct taxes చెప్పిన మాట ఇలా ఉంది.

1.బంగారం మీదగ్గర ఎంతైనా ఉండచ్చు అది వస్తు రూపంలో ఉండాలి. నాణేలు,బార్ ల రూపంలో ఉండకూడదు. కొన్ని మినహా ఇంపులున్నాయి, కుటుంబ కట్టుబాటులు, మత ఆచారాలుకి సంబంధించిన నాణేలు వగైరా,పాతకాలపు కాసుల పేర్లు,లక్ష్మీ రూపులు వగైరా కావచ్చు..

2. అలా ఉన్న బంగారం మీకు ఎలా సంక్రమించినదీ ఋజువులు కావాలి. అనగా ఆ వస్తువులు మీకు విల్లు ద్వారా గాని మరో విధంగాగాని సంక్రమించిన కాగితాలు కావాలి.అవీ లేకపోయినా బాధ లేదు, మీకు పెద్దలనుంచి వచ్చినదైతే వారి ఆర్ధికస్థితి చెప్పాలి. మీరు స్వంతంగా తయారు చేయించుకుని ఉంటే వాని తాలూకు రసీదులు, అవీ లేకపోయినా బాధలేదు, మీరు సంపాదించిన సొమ్ముకు టాక్స్ కట్టినదీ చూపిస్తేచాలు. ఇవేవీ లేక ఆ బంగారం మాది కాదు మరొకరిది మాదగ్గర ఉంచారన్నా ప్రభుత్వం నమ్మదు,పట్టుకుపోతుంది.

3. ఒక కుటుంబంలో ఎంత బంగారం ఉండచ్చు?

ఒక కుటుంబాన్ని చూద్దాం. ఒక భార్య,భర్త. ఒక కొడుకు కోడలు, ఒక కూతురు, పెళ్ళి కానిది. మొత్తం ఎంత బంగారం ఉండచ్చు వీరందరికి కలిపి?

మగవారికి ఒక్కొక్కరికి 100 గ్రాములు

పెళ్ళైన స్త్రీ ఒకరికి 500 గ్రాములు

పెళ్ళికాని స్త్రీకి ఒక్కొకరికి 250 గ్రాములు

మగవాళ్ళు (తండ్రి,కొడుకు) = 2 X 100= 200 grams

పెళ్ళయిన స్త్రీలు(అత్త,కోడలు) 2 X 500 = 1000 grams

పెళ్ళికాని ఆడపిల్ల 1 X 250 = 250 grams

మొత్తం బంగారం ఆ కుటుంబంలో ఉంచుకోతగినది. 1450 gram.ఈ బంగారానికి ఋజువులు సాక్ష్యాలు అక్కర లేదు. ఐతే ఒకటే షరతు, ఇదంతా వస్తురూపంలోనే ఉండాలి, కాని బార్ లా ఉండ కూడదు. 1450 gramsఅంటే దగ్గరగా 181 కాసులు… 1 కాసు= 8 grams.

దగ్గరగా కేజిన్నర బంగారం నేటి ధర ప్రకారం ఎంత విలువ చేస్తుంది. గ్రాము నాలుగు వేలైతే, 1450 X 4000 = nearly 60 lakh rupees. బంగారంలో పొదుపు నిరర్ధక పెట్టుబడి. దీనిపై రాబడి ఉండదు.మరి దీనిలో ఎందుకు జాగ్రత్త పెట్టాలని చూస్తారు? భద్రత,స్త్రీలవద్ద ఉంటుంది గనక,చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అమ్ముకుంటే తొందరగా సొమ్ము చేతికొస్తుంది, ఆపద తొందరగా గట్టెక్కచ్చు, ఇదీ సామాన్యుల ఆలోచన. చిన్నమెత్తు అన్నది చాలా చిన్న మొత్తం, బంగారపు తూకంలో. ఈ చిన్నమెత్తు బంగారం కూడా లేని భారతీయులు కోటానకోట్లు ఉన్నారు. ఐతే కేజిల కొద్దీ, టన్నుల కొద్దీ బంగారం ఉన్నవారూ ఉన్నారు.

కొంతమంది దగ్గర బంగారపు నిల్వలే దొరుకుతున్నాయి, టన్నుల కొద్దీ, వెతికినకొద్దీ.

ఇక ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లో 181 కాసుల బంగారపు ఆభరణాలుండచ్చంటోది. ఇంత బంగారం ఉన్నవారు సామాన్యులై ఉంటారంటారా? అరవై లక్షల రూపాయలు నిరర్ధక ఆస్థిగా ఉంచగలిగినవారు కోటీశ్వర్లులు కారూ? మరి వీధికెక్కి ఎందుకు కొంతమoది బాధ పడుతున్నారు?

 సామాన్యుని దగ్గర ఇంత బంగారం ఉంటుందా?

స్త్రీ పురుషుల మధ్య ఇంత వివక్షతా! (Gender discrimination)అన్యాయం కదూ!! స్త్రీ శక్తి సంఘాలు పిల్ PIL వేయవేం?