శర్మ కాలక్షేపంకబుర్లు-కారపు ఆవకాయ/కాయావకాయ

కారపు ఆవకాయ

దీన్నే కారపు ఆవకాయ అంటారు గోజిలలో. దీని పేరులో ఆవ ఉందిగాని దీనిలో ఆవ ఉండదు. అంచేత వేడి చేస్తుంది, అనారోగ్యం చేస్తుందనే మాట ఉత్తదే!

ఆవకాయ పెట్టుకోడానికి తగిన కాయేదీ? కొత్తపల్లి కొబ్బరి,చిన్నరసాలు ఇలా పీచు ఉన్నకాయ ఏదైనా ఆవకాయకి మంచిదే, పుల్లగా ఉంటే!   మాడుగుల ఆవాలు లేదా సన్నావాలు అంటారు, మహ ఘాటు, పెద్దావాలతో పెట్టుకుంటే కమ్మహా ఉంటుంది.  కారం, పచ్చావకాయకైతే గొల్లప్రోలు కాయలు, మామూలు ఆవకాయకైతే వరంగల్ కాయ బాగుంటుంది. వరంగల్ కాయైతే కారం కమ్మగా ఉంటుంది, గుంటూరు కాయ కంటే.వరంగల్ కాయ పెద్దదిగా ఉంటుంది, కొంచం దళసరిగా ఉంటుంది, కారం దిగుబడీ బాగుంటుంది. ఇక ఉప్పు, కళ్ళ ఉప్పు వాడుతారు, ఇందులో కూడా ఐయోడిన్ ఉంటుంది (ట). ఉప్పు ఎండబెట్టుకుని దంచుకుని అమ్మో బాధ పడలేమనుకుంటే పేకట్లో ఉప్పు వాడెయ్యచ్చు, చెమ్మ లేకుండటం ముఖ్యం.

ఇక మాగాయి పెట్టుకోడానికి తగిన కాయ పెద్దరసాలు,పంచదార కలసి, సువర్ణరేఖ ఇలా పుల్లగా ఉండేకాయ, పీచులేనట్టి కాయ, ఊట ఎక్కువగా వచ్చేకాయ ఏదైనా బాగానే ఉంటుంది.

కారపావకాయ పెట్టుకోడానికి కారం, ఉప్పూ గుచ్చెత్తుకోవాలి,కొద్దిగా పసుపేసుకోవాలి, కారమెంతో ఉప్పంత, భానుమతిగారి అత్తగారూ ఆవకాయ గుర్తొచ్చిందా? :). గానుగునూనె సిద్ధం చేసుకోవాలి, నువ్వులనూనె. మెంతులు సిద్ధం చేసుకోవాలి. కొంతమంది వేయించిన మెంతులు కలుపుతారు. పచ్చివి వేయడం శ్రేష్టం. ఇక ఊరగాయ పెట్టుకునే కాయ తెచ్చుకుని, నీటిలో వేసి శుభ్రంగా కడగాలి, తుడవాలి, తడిలేకుండా. ఈ కాయను నిలువుగా సగం పైగా చీరాలి, పూర్తిగా ముక్కలు చేసెయ్యకూడదు. కాయను వెనక్కి తిప్పాలి. ఇదివరలో చీరిన దానికి మరో వైపు మూడొంతులు చీరాలి. కాయ కాయలాగే ఉంటుంది,నాలుగు చెక్కలుగానూ ఉంటుంది. కాయలు ఇలా చేసుకున్న తరవాత తరిగిన కాయలో ఉన్న జీడి,పొర తీసెయ్యాలి. కారం,ఉప్పు గుచ్చెత్తిన దానిలో మెంతులు కలపాలి, నూనె పోసి ముద్దలా చెయ్యాలి. ఆ ముద్దను కొద్దికొద్దిగా కాయను కొద్దిగా విడదీసి కూరాలి, ముందునుంచి వెనకనుంచి. కాయల్ని అలాగే జాడీలో పెట్టేయాలి,మిగిలిన కారం పైన వేసేసి నూనెపోయాలి,తగు మాత్రంగా. మూడు రోజులకో సారి చూడాలి. ఉప్పు తక్కువైతే బూజుపట్టేస్తుంది, అది చూసుకోవాలి.

కాయావకాయ.

ఎలా చూసినా ఆవకాయకి వాడేవి ఐదు సరుకులే. అవి మామిడి కాయ,ఉప్పు, కారం, మెంతులు,ఆవాలు. వాటినే కొన్నిటిని కలిపి కొన్నిటిని వదిలేసి పెట్టే ఆవకాయలు రకరకాలు. ఈ కాయావకాయకు కూడా కాయల్ని పైన చెప్పినట్టు తరుక్కోవాలి. ఇప్పుడు మెంతుల్ని మెత్తగా చేసుకోవాలి. మెంతి పొడి కారం,ఉప్పూ సమానంగా తీసుకుని గుచ్చెత్తుకోవాలి. నూనిపోసి కలిపి ముద్ద చేయాలి. ముద్దను కొద్దికొద్దిగా కాయలలో కూరి భద్రపరచాలి, పైన నూనెపోయాలి. ఈ రెండు రకాల ఆవకాయలని వాడుకోడానికి మూడు నెలల సమయం కావాలి. ఈ కాయావకాయ ఆవ పడనివారికి, డయాబెటిస్ వారికి మంచిది. కాయావకాయ డయాబెటిస్ వారికి మందుగా కూడా పని చేస్తుంది.

దీన్నే కాయావకాయ,  డొక్కావకాయ అంటారు. కనీసం మూడు నెలలదాకా దీని ఉపయోగించలేము. అప్పటికి కాయలో పులుపు పిండికి చేరుతుంది. పిండిలో కారం పులుపు కాయకు చేరుతుంది. ఒక్క కాయ తీసుకుని ముక్క విడదీసుకుని వాడుకోవచ్చు. ఒక సారి తీసి సగం వాడిన కాయ మళ్ళీ అందులో పెట్టకండేం 🙂  కరోనా ఏం చేయలేదు. కరోనా ఉన్నా కతక్క తప్పదుగా

కాయను కాయలా తరుక్కోలేనివారు, ముక్కలు చేసుకోవచ్చు, ఏంచేస్తాం చెప్పండి.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కారపు ఆవకాయ/కాయావకాయ

  1. సర్, ఏమిటి తూగేజిలో (అకాల) వర్షాలు కురుస్తున్నాయా? అలా అయితే ఊరగాయలు పెట్టడం తూగోజి ప్రజలకు ఈసారి కష్టమేగా?

    • వేసవిలో ఉడుకు వర్షాలు మామూలేనండి. కాని నిన్న ఉదయం ఒక్క సారి గాలేసి మ్మామిడి కాయ రాలిపోయింది. లోకల్ డిమాండ్ తక్కువ. ఎగుమతికి సావకాశం లేదు. ఏం చేయాలో తెలియకా కాయి రాసులుగా పోసి కూచున్నారు రైతులు, కొంతమంది ఏరించను కూడా లేదు, కూలి దండుగని.
      వరి మాసూళ్ళు సగానికి దగ్గరలో ఉన్నాయండి. కొంత ధాన్యం ఒబ్బిడి అయింది. ఎఫ్.సి.ఐ కొంటోంది, చేలో కొచ్చి. ధాన్యం కూడా వెంట వెంటనే తరలించేస్తున్నారంది.

      • Thank you sir. కానీ ఇలా తొక్కుగా కాకుండా చప్పరించటానికి వీలుగా ఉండే మాగాయ కూడా ఉంటుంది కదండీ!

      • అలా పెట్టుకోవాలంటే శ్రమ ఎక్కువ పడాలండి.ఎండబెట్టడం ఎత్తిపెట్టడం ఇబ్బంది. ముక్కలు తరుక్కోవాలి సన్నగా, వాటిని ముక్క పట్టుకుని విరిస్తే విరిగేటంతగా ఎండబెట్టాలండి, ఉప్పేసి ఊటంతా వచ్చేసేలాగా ఎత్తిపెట్టి.. ఊటనుకూడా అలా ఎండబెట్టాలి. ఆ తరవాత సంగతి ఇలాగే చేసుకోవాలి.అంటే ఊటను కలిపి ముక్కలతో ఆవాలు మెంతులు వేయించి ఇలా… ఇంగువ నూనె ఇష్టమైతే పోసుకోవచ్చండి. ఊట బాగా వచ్చే కాయ కావాలి, పట్టణాల్లో ఇది సాధ్యం కాదని ఇది చెప్పేనండి. ఒక్క రోజుతో తేలిపోయేది.

వ్యాఖ్యానించండి