శర్మ కాలక్షేపంకబుర్లు-పోగాలము దాపురించినవారు…….

పోగాలము దాపురించినవారు…….

”పోగాలము దాపురించినవారు దీపనిర్వాణగంధమును, అరుంధతిని, మిత్ర వాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు” అన్నారు, చిన్నయ సూరి నీతి చంద్రికలో… అంటే పోగాలము= చావు, దీపనిర్వాణగంధము=దీపం ఆరిపోయేటపుడు వచ్చే వాసన, అరుంధతి= అరుంధతి నక్షత్రం, మిత్ర వాక్యము=స్నేహితుని మాట, మూర్కొనరు=వాసనచూడలేరు, కనరు=చూడలేరు, వినరు=వినలేరు అని మాటల అర్ధం. మరి వాక్యం ఇలా చెప్పేరేంటి మాస్టారూ అని తెలుగు గురువులని అడిగితే ”ఒరే చెవలాయ్! ఇది ఒక ప్రక్రియరా! ఇలా చెప్పడాన్ని ఒక అలంకారం అంటారు, దీని పేరు క్రమాలంకారం. ఇప్పుడు అర్ధం చెబుతావిను.”

”చావు దగ్గరపడినవాడు దీపం అరిపోయేటపుడు వచ్చేవాసన గుర్తించలేడు, అరుంధతీ నక్షత్రాన్ని చూడలేడు,మిత్రుని మాట వినలేడు, వినలేడంటే వినపదడనికాదు,వినినా దానిలో మంచిని గ్రహించి మసులుకోలేడని అర్ధం,” అని చెప్పేరు.

ఇది నిజమా అని ఆలోచిస్తే నూటికి నూరుపాళ్ళూ నిజమే అనిపిస్తూంది. దీపనిర్వాణ గంధమును మూర్కొనడని కదా! అసలిప్పుడు నూనెదీపాలేవీ? అందుచేత నూని లేక దీపం ఆరిపోయేటపుడు వచ్చే వాసన ఎలా ఉండేది చాలా మందికి తెలియదు. ఒక వేళ దేవుడి దగ్గర దీపం పెట్టినా అదీ ఎలక్ట్రిక్ దీపమే అయివుంటోంది. ఈ సారి నేతితో కాని నూనెతో కాని వత్తి వేసి దీపం వెలిగించండి, దేవుని ముందు, అది ఆరిపోయేటపుడు వచ్చే వాసన చూడండి ఎలా ఉండేది అనుభవమవుతుంది.

ఇక అరుంధతి, అసలు అరుంధతి అనే నక్షత్రం ఉందనే చాలమందికి తెలియదేమో! పెళ్ళిలో చూపించాలి, మరి, ఒక గంటలో అయ్యే పెళ్ళిళ్ళలో అరుంధతీ నక్షత్రం ఏమి చూపించగలరు? ఈ అరుంధతి నక్షత్రం సప్త ఋషిమండలంలోతోకలో ఉన్న చివరి జంట నక్షత్రాలలో ఒకటి. అవి అరుంధతి, వశిష్ఠుడు, ఇవి ఒకదాని చుట్టు మరొకటి తిరుగుతుంటుంది. వీటిని చూపించడం లో ప్రత్యేకత, నాకనిపించింది, ఈ నక్షత్రాలు ఒకదాని చుట్టు మరొకటి తిరుగుతున్నట్లు మీరు కూడా ఒకరి చుట్టూ మరొకరు తిరాగలని అనుకుంటా. ఇవి  సప్త ఋషిమండలపు తోకచివర చాలా దగ్గరగా  ఉంటాయి, అందులో ఒకటి అరుంధతి. ఇది పట్టుబట్టి చూస్తే కాని కనపడదు.అరుంధతి గురించి ఈ కింద లింక్ లో చూడండి. http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B0%E0%B1%81%E0%B0%82%E0%B0%A7%E0%B0%A4%E0%B0%BF finder_north

Courtesy: google

పై బొమ్మలో నాలుగు నక్షత్రాలున్నాయి కదా మంచంకోళ్ళలాగాను, ఒక మూలనుంచి తోకలా మూడు నక్షత్రాలున్నాయి చూడండి, అందులో మూడవ నక్షత్రమే వశిష్టుడు, దానికి దగ్గరలోనే ఉంటుంది అరుంధతి కనపడి కనపడక, మిలుకు మిలుకుమంటూ. నేను చదువుకోనివాడిని పెద్ద పరిజ్ఞానం లేదు తప్పయితే సరిచేయండి. వీటి ఇంగ్లీష్ పేర్లు చెబితే ఇంకా సంతసం.

ఇక మూడవదైన మిత్రవాక్యం, అసలు మన మంచికోరి చెప్పే మిత్రుని మాట అసలు వినిపించుకోం. సాయంత్రం బార్ కి వెళదామన్న మిత్రుని మాట మాత్రం బాగా గుర్తుంటుంది. అందరం అబ్బే అదేం లేదండి అంటాం కాని చేసేపని అదే 🙂 మన మంచికోరి చెప్పే మిత్రుని మాట కటువుగానూ, చేదుగానూ ఉండచ్చు, మనమే అతన్ని ముఖం మీదే తిరస్కరించచ్చు కూడా, ఐనా అతను చెప్పడం మానలేడు.

ఇవన్నీ అంటే దీపం ఆరిపోయేటపుడు వచ్చేవాసన తెలియనివారు, అరుంధతిని చూడలేనివారు,మిత్రవాక్యాన్ని వినని వారు ఆరునెలలలో మరణిస్తారని పెద్దల మాట. దీనికో మంచి ఉదాహరణ, పరమాత్మ పాండవుల పనుపున రాయబారం వెళ్ళేరు, మామా! సత్యవతీ పౌత్రా! అని సంభోధించాడన్నారు తిరుపతి వేంకట కవులు. ఆ తరవాత ఐదుగురుకి ఐదూళ్ళిమ్మన్నారయ్యా! అది కూడా ఎందుకట గ్రాసవాసోదైన్యము లేకుండుటకు, ఎవరికి అంతే వాసులకు అన్నారు. ఐదూళ్ళియ్యి సంధి చేస్తా, అన్నారు. వివరిస్తా! పాండవుల కూడా ఉన్న పరివారానికి కూడు, గూడు లోటులేకుండటానికిగాను ఐదూళ్ళడిగారు అన్నారు. విన్నాడా దుర్యోధనుడు? వాడి సూది మొనమోపినంత కూడా భూభాగం పంచి ఇవ్వనన్నాడు! ఏమయ్యాడు? తొడలు విరిగి రణరంగం లో చచ్చాడు.

మరొక ప్రబుద్ధుడు సీతని ఎత్తుకురావద్దు. రామునితో వైరం వద్దు సుమా! రాముడంటే ఎవరనుకున్నావు,

రామో విగ్రహవాన్ ధర్మః

సాధుః సత్యపరాక్రమః

రాజా సర్వస్య లోకేస్య

దేవానామివ వాసవః.

అంటే రాముడంటే మూర్తీభవించిన ధర్మమయ్యా!నెమ్మదైనవాడు, సత్యవాక్యపరిపాలకుడు, రాజులందరిలోకి గొప్పవాడు అంతెందుకు ఇంద్రునికంటె గొప్పవాడయ్యా! అని చిలక్కి చెప్పినట్టు చెప్పేడు, ఎవరు మిత్రుడు, సచివుడు అయిన మారీచుడు. ఇంకా చెప్పేడు మనం చాలా సార్లు చెప్పుకున్నదే సందర్భం కనక మళ్ళీ చెప్పుకుందాం.

సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదినః

అప్రియస్యచ పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః

పొగడ్తలు, మెరమెచ్చులు చెప్పేవాళ్ళు చుట్టూ ఎప్పుడూ చేరతారు రాజా! అప్రియమైనా సత్యం చెప్పేవాడు దొరకడు, ఒకవేళ ఎవరైనా చెప్పినా వినేవాడు లేడయ్యా అన్నాడు. ఇంత చెప్పినా మంచి మాట తలకెక్కిందా? లేదు చివరికేమయ్యాడు! భార్య మందోదరి ఏమని ఏడ్చింది? నీ స్త్రీ కాంక్ష నిన్ను చంపిందయ్యా రాముడి రూపంలో అని ఏడిచిందే!

పైన చెప్పినవ్న్నీ నిత్యసత్యాలన్నారు, పెద్దలు. కాలం మారినా మనుషుల ప్రవృత్తి మారదు, మారలేదు, మారబోదు. అన్వయించుకుంటే అన్నీ నేటికి జరుగుతున్నవే. ఇప్పుడెందుకంటారా?ఊసుపోక…..