శర్మ కాలక్షేపంకబుర్లు-వినదగు నెవ్వరు చెప్పిన

వినదగునెవ్వరు చెప్పిన…

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
విని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ

ఈ పద్యం చిన్నప్పటి నుంచి చాలా సార్లు చదివి ఉంటాము, కాని జీవితానికి అన్వయించుకోడానికి ఇబ్బంది పడుతుంటాము. పద్యం అరువది ఐదు సంవత్సరముల ముందు నేర్చుకున్నా. జీవితానికి అన్వయం చేసుకోడానికి సమయం పట్టింది…….

నలుబది ఎనిమిది సంవత్సరముల ముందు నా ఇల్లాలికి మొదటిసారి ఆడబిడ్డ కలిగింది. ఏనుగెక్కినంత సంబరమైపోయింది. లక్ష్మీదేవి పుట్టిందనుకున్నాం. అమ్మ పేరు పెట్టుకున్నాం. ఇప్పటిలాగా ఆడపిల్ల పుట్టిందని ఏడవలా!. పాపకి మాటలు రాలా. ఆలస్యంగా వస్తాయన్నారు. రెండేళ్ళకి మరొక పాప పుట్టింది. ఆ పాప మాటాడటం చూసి పెద్దమ్మాయికి ఏదో తేడా ఉందనుకున్నాం. అప్పటి నుంచి మొక్కని దేవుడు లేడు, చూడని డాక్టరు లేడు. రెండేళ్ళు ఎవరేమి చెబితే అది చేశాము. విసిగిపోయాం. ఒక రోజు నా మిత్రుడు ఒకరు ” ఒరేయ్! పిల్లని చూస్తే బంగారపు బొమ్మ. చెబితే తప్పించి, ఈపిల్లకి మాటలు రావని ఎవరూ ఊహించరు. నువ్వు చాలా తిరిగి విసిగిపోయావు. ఒక్క పని చేద్దాం. మద్రాసులో ఒక డాక్టర్ ఉన్నాడు. తూర్పు ఆసియా దేశాలలో పెద్ద పేరున్న వాడు. మూడు నెలలు ముందు కాని అతని అప్పాయింటుమెంటు దొరకదు, అతన్ని చూసి విషయం అడుగుదాం. అతను చెప్పినదానిని పట్టి మీరు నిర్ణయం తిసుకుందురుగాని” అన్నాడు.నా కెందుకో ఇష్టం లేదు. నా ఇల్లాలు ” ఇన్ని చోట్లకి తిరిగాము,ఈ ఒక్క సారి అక్కడికి వెళ్ళి, వివరం తెలుసుకుని ఏమి చేయవలసినది అలోచిద్దాం” అంది. నేను ” ఒరేయ్! మూడు నెలలకి కాని మనకి దొరకని డాక్టర్ ని పట్టుకోడం ఎలా” అన్నా. అందుకు వాడు” నీకా గోలెందుకు. ఆ ఏర్పాటు నేను చూస్తాను కదా! మనం అక్కడికి వెళ్ళిన కొద్ది నిమిషాలలో మన కేస్ చూస్తాడు. సరేనా”అన్నాడు. సరే బయలుదేరి వెళ్ళేము. స్టేషన్ కి కారొచ్చింది. “ఎవరిదిరా” అన్నా, “మనదే నడు” అని కారెక్కించాడు మమ్మల్ని.. కారు ఒక ఇంటిలోకి వెళుతుండగా నేం బోర్డ్ చూశా, ఇన్ కం టాక్స్ కమిషనర్ అని ఉంది. ఇదేమిరా ఇక్కడకొచ్చామన్నా. “దిగండి” అని పెళ్ళాం పెరెట్టి పిలిచాడు. అమ్మాయి వచ్చి “రండి రండి” అంది. అప్పుడు చెప్పేడు ఇది “నా మామగారిల్లు” అని. అప్పటిదాకా ఉన్న డాక్టర్ ని చూడగలమా అన్న అనుమానం పోయింది. “ఎప్పుడెళ్దాం” అన్నా. “స్నానం చేసి వెళ్ళిపోదాం”అన్నాడు. సరే అని ఏర్పాట్లు చూసి భార్యకి ఏదో చెప్పేడు. స్నానాలు చేసి టిఫిన్ చేసి డాక్టర్ దగ్గరకెళ్ళేము. రిసెప్షన్ దగ్గరకెళ్ళి పేరు చెబితే “ఒక్క నిమిషం ఆగండి లోపల ఉన్న వారు బయటకు రాగానే మిమ్మల్ని పంపుతాను. మీరు రాగానే పంపమని డాక్టర్ చెప్పేరు” అంది. లోపలికెళ్ళేము. డాక్టర్ గారు పిల్లకి టెస్టులు చేసి ఒక ఇరువది నిమిషాలు పరీక్షలు చేసి మాకు చెప్పిన విషయం, ” ఈ అమ్మాయికి బ్రహ్మ చెముడు, అందుకు మాటలు రాలేదు. పిల్ల తెలివయినది. చదువు చెప్పించండి. ఇక్కడ కీల్పాక్ లో స్కూల్ ఉందని” చెప్పేరు. సరే “మీఫీజ్” అన్నాం. ఆయన వెంటనే “నేనీ అమ్మాయికి చేసినది లేదు. ఫీజ్ వద్దు” అన్నాడు. “అయ్యా, మీరు చూసి విషయం చెప్పేరు. ఈ సమయం లో మరొకరిని చూస్తే మీకు ఫీజ్ వచ్చేది కదా” అన్నా. “వద్దు” అన్నారు. మేమిద్దరం డీలా పడ్డాం. జీవితంలో ఊహించని, మార్పురాని, పెద్ద కష్టం. బయటికొచ్చిన తరవాత నా స్నేహితుడు” ఒరేయ్! ఇతనేమన్నా దేవుడా మరొకర్ని చూద్దాం లే, మీరు డీలా పడద్దు” అని ఉత్సాహం కబుర్లు చెప్పేడు. సరే సాయంత్రమే తిరిగొచ్చేశాము. ఇంటి కొచ్చిన తరవాత కొద్ది రోజుల తరవాత మా భార్యా భర్తలిద్దరం కూచుని చర్చ చేసుకున్నాం. ఒక నిర్ణయాని కొచ్చాం. “మరెక్కడికి తిప్పవద్దు. చదువు చెప్పిద్దాం. ఆ ప్రయత్నం చేద్దాం”. సరే బడి ఎక్కడ ఉంది కనుక్కుంటే కాకినాడలో ఒకటి హైదరాబాదులో ఒకటి ఉన్నాయని తెలిసింది. సరే అప్పుడున్న ఊరునుంచి బదిలీకి ప్రయత్నం ప్రారంభించా.

దరఖాస్తు పెట్టా. కదులు లేదు, మెదులు లేదు. ఎవరినడిగినా హైదరాబాదులోని వారు “ఈ బదిలీ ఇవ్వరు ఆయన బహు స్ట్రిక్ట్, ఎవరు చెప్పినా వినరు”. వెళ్ళికలుస్తానన్నా. వద్దన్న వాళ్ళే, అందరూ. ఒక రోజు ఎవరికి చెప్పకుండా బండెక్కేశా. అమ్మ మీద భారం, సత్యం మీద నమ్మకంతో. ఆ రోజుల్లో ఇప్పటిలాగా ఎవరు పడితే వారిని కలిసే వీలు లేదు. ఇక్కడ కింద ఆఫీసర్ ఒప్పుకుంటే నే వెళ్ళి కలవాలి. ఎవరికీ చెప్పలేదు. వెళ్ళి చీటి పంపా, లోపలికి. రమ్మన్నారు, అరగంట తరవాత. లోపలికెళ్ళి చెప్పుకున్నా. ఆయన అంతా విని “నీవు చెప్పినది నిజమయితే నీకు బదిలీ ఖాయం, కాక పోతే నీకు ఛార్జ్ షీట్ ఖాయం” అన్నారు. నేను వెంటనే “అయ్యా! మీదగ్గర ఛార్జి షీట్ తీసుకోవాలనుకుంటున్నా” అన్నాను. “ఏంటీ” అన్నారు. వివరించా. “నేను చెప్పినది అబద్ధం అయితేకదా మీరు ఛార్జి షీట్ ఇస్తానన్నారు. నేను చెప్పినది అబద్ధంకావాలని కోరుకుంటున్నా, నా పిల్ల వినగలిగి మాటాడగలిగితే అంతకు మించి ఆనందం నాకు జీవితంలో మరొకటి ఉండదు. మీ ఛార్జి షీటుని ఆహ్వానిస్తా.” అన్నాను. “సరే చూస్తాలే” అన్నారు. నేను తిరిగొచ్చా. నాఇల్లాలు “మీ ఆఫీస్ వాళ్ళు మన వీధిలో మన అమ్మాయి గురించి విచారించారట ఏందుకో” అంది. ఏదో జరిగిందని అనుకున్నా.. మూడవ రోజు నా కో టెలిగ్రాం వచ్చింది. నిన్ను కాకినాడ బదిలీ చేశాము. వెంటనే వెళ్ళి జాయిన్ కమ్మని. కాపీ చాలా మందికిచ్చారు. ఆఫీస్ కెళ్ళా. అప్పటికే రిలీవింగ్ ఆర్డరర్ రాసేసి సిద్ధం చేసి కూచున్నారు. వెళ్ళగానే నా చేతికిచ్చి “సంతకం చెయ్యి నాయనా, నిన్ను రిలీవ్ చేసినట్లు టెలిగ్రామ్ ఇవ్వాలి, లేకపోతే నా చమ్డాలు ఎక్కతీస్తారు, ఎలా వచ్చింది నీకు బదిలీ? ఏంచేశావు, మొన్న నన్ను మీ అమ్మాయి గురించి వివరం చెప్పమన్నారు, చెప్పేను. ఆయన దగ్గర మొత్తానికి బదిలీ తెచ్చుకోగలిగావన్నారు” అని సంతకం పెట్టించుకుని టెలిగ్రాం ఇచ్చాడు, రిలీవ్ చేసినట్లు. కాకినాడలో జాయిన్ అయిన తరవాత వారికి నమస్కారాలతో, కృతజ్ఞత తెలుపుతూ ఉత్తరం రాశా. అమ్మాయి చదువు,పెళ్ళి వగైరా మరో టపాలో, మరో సారి…….. అందుకే…..వినదగునెవ్వరు చెప్పిన……..

శర్మ కాలక్షేపంకబుర్లు-దీవెన/తధాస్తు.

దీవెన/తధాస్తు

తధాస్తు అంటే అటులనే జరుగు గాక అని అర్ధం. ఇది సాధారణంగా ఒకరు దీవెన ఇస్తూవుంటే మరొకరు, పెద్దలు తధాస్తు అంటారు. ఇది సాధారణంగా పెళ్ళి, వ్రతాలు, పూజలు,ఇవి జరిగేటపుడు, చివరగా ఆశీర్వచనం చెబుతారు, దీవెనలిస్తారు, ఆ వెనుక పెద్దలు తధాస్తు, అని అంటారు. ఇతరమైనవి అనగా అశుభం జరిగినపుడు అది పూర్తి చేసిన తరవాత ప్రత్యేకంగా ఆశీర్వచనానికి ఏర్పాటు చేస్తారు. సాధారణం గా మనం బట్టలు పెట్టె సమయం అంటాము. అప్పుడు దీవిస్తారు, ఇక ముందు శుభం జరగాలని. ప్రతి దీవెన వెనుక పెద్దలు, మరొకరు తధాస్తు అనాలి. ఈ అశీర్వచనం మూడు వేదాలలో వుంది. ఏ వేదానికి సంబంధించిన ఆశీర్వచనం ఆ వేదానికి వేరుగా వుంటుంది, అవి చెప్పగలను కాని ఇక్కడ టపా చాలా పెద్దదయిపోతుంది. “ఇన్ద్ర శ్రేష్ఠాని ద్రవిణాని ధేహి…”..ఇది ఋగ్వేదాశీర్వచనం. యజుర్వేదాశీర్వచనం “యో వైతాం బ్రహ్మణో వేద…..”. ఇక సామవేదాశీర్వచనం “ఇమంస్తోమాం……”. ఇవేకాక మరి కొన్ని కూడా ఉండవచ్చు. నాకు తెలిసినవి చెప్పేను. నమస్కారం చేసిన వారికి ఆశీర్వచనం చెప్పడం మన సంప్రదాయం. తధాస్తు దేవతలుంటారట. అందుకే మన పెద్దలు చెడుమాట, అనను కూడా వద్దంటారు.

రామాయణం, భాగవతాల్లో నమస్కారాలున్నాయి కాని దీవెనల గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. మాటాడితే రామాయణం, భారతం, భాగవతం అంటారు, మరొకటి చెప్పలేరా అని ఒకరు ప్రశ్నించారు. నిజమే. నాకు వచ్చిన భాష తెనుగు. అందులోనే రామాయణ, భారత, భాగవతాలు చదువుకున్నా. మరే ఇతర భాషలు రావు గనక వాటి సాహిత్య పరిచయం లేదు. తెనుగు భాష లోనే సాహిత్య పరిచయం లేదు. సొల్లు కబుర్లు చెప్పడానికి సాహిత్య పరిచయం అక్కరలేదనుకుంటా.

రామాయణం లో ఒక గొప్ప ఘట్టం ఉంది. సీతా రాములు వనవాసానికి వెళుతున్నారు. లక్ష్మణుడు తానూ వస్తున్నానని, రామునికి చెప్పి, తల్లి సుమిత్ర తో, అడవికి అన్నతో వెళుతున్నానని చెప్పి, నమస్కరిస్తే, ఆమె దీవెన వినండి.” రామం దశరధం విద్ధి మాం విద్ధి జనకాత్మజ, అయోధ్యా మటవీం విద్ధి గఛ్ఛ తాత యధాసుఖం” రాముడు దశరధునితో సమానుడు, జానకి నాతో సమానం,అయోధ్య అడవీ రెండూ నీకు సమానమే అందుచేత సుఖంగా వెళ్ళిరమ్మన్నది. ఎంత గొప్ప మనసున్న తల్లి. కొడుకు రాజ్యాలేలడానికి, పదవులు సంపాదించడానికి, ఇహ భోగాలు అనుభవించడానికి వెళుతున్నాననలేదు. అడవికి పోతున్నా అదీ అన్నకు, వదినకు సేవకునిగా అని చెప్పి, నమస్కరించి, ఆశీర్వచనం కోరిన కొడుకును ఎంత గొప్పగా అశీర్వదించిందా తల్లి. ఇటువంటి తల్లులు కలిగిన నా సంస్కృతి ఎంత గొప్పదీ!

భారతం లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ఒక ఘట్టం ఇదివరకొకసారి చెప్పుకున్నాము, కాని ఈ సందర్భం లో అవసరం కనక మళ్ళీ చెప్పుకుందాము. యుద్ధం ఖాయమైపోయింది. యుద్ధానికి వెళుతూ దుర్యోధనుడు గాంధారి వద్దకు వచ్చి నమస్కరిస్తే ఆమె “యతో ధర్మస్తతో జయః” అని దీవించింది. అంటే ధర్మం ఎటు ఉంటే అటే జయం కలుగుతుంది, అని దీవించింది. కాని, విజయోస్తు అనికాని, దిగ్విజయమస్తు అనికాని, దీర్ఘాయుషు మస్తు అని కాని దీవించలేదు, ఆసందర్భాన్ని బట్టి. గాంధారి తన దీవెనలో, కుమారుని యొక్క తప్పును పరోక్షంగా యెత్తి చూపింది, ఆ ఆఖరు క్షణంలో కూడా. ఈమె కూడా నా సంస్కృతిలోనిదే. కొడుకని, తప్పు చేస్తున్నవాడిని సమర్ధించని తల్లి. ధర్మం కోసం కడుపుతీపిని వదలుకున్న గొప్ప తల్లి, గాంధారి. ఈ పరంపర నేటికీ కొనసాగుతున్నందుకు గర్వపడుతున్నా. తల్లులందరికీ నమస్కారం, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మకి నమస్కారం.

నేటి కాలంలో కూడా పెద్దలకి నమస్కారం పెట్టిస్తారు, కారణం ఎవరి దీవెన, నోటి వాక్కు ఫలిస్తుందో, తెలియదు కనక. పెద్దల మాట బోటు పోదంటారు. దానికి కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా మనకు జీవితాల్లో కనపడతాయి. సాధారణంగా స్త్రీలని దీర్ఘ సుమంగళీ భవ అని, పురుషులనైతే దీర్ఘాయుష్మాన్ భవ అని, పెళ్ళికాని పిల్లలని శీఘ్రమే వివాహ ప్రాప్తి రస్తు అని, పెళ్ళి అయిన వాళ్ళని సుపుత్రా ప్రాప్తి రస్తు అని దీవించడం అలవాటు. లేకపోతే వంశాభి వృద్ధిరస్తు అంటారు. చదువుకునే పిల్లలని విద్యాభివృద్ధిరస్తు అని దీవిస్తారు. వీటికి పైనున్న తధాస్తు దేవతల సంకల్పం ఉంటుందంటారు.

సరదాగా ఒక మాట. నా టపాలని వెంకట్ గారు హిందూ పత్రిక తో పోల్చారు. ఆయనకి అలా అనిపించి ఆశీర్వదించారు. దాని మీద జిలేబీ గారు తధాస్తు అన్నట్లుగా టపాలు లేని రోజున తమ బ్లాగులో హిందూ పేపర్ రాలేదు అని పెట్టి నా టపాలను హిందూ పత్రిక తో పోలికను తధాస్తు అన్నారు. అదేకాక నిన్న మరొక సారి వారి బ్లాగ్ లో నా బ్లాగును ఆశీర్వదించిన తల్లికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఏంటీ! శంకరాభరణం డవిలాగు చెబుతున్నారనద్దు.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉపవాసం.

ఉపవాసం

జన్మకో శివరాత్రి అన్నారు. మహా శివరాత్రి ఉపవాసం ఉన్నాము. శివరాత్రి ఉదయమే లేచి కాలకృత్యాల తరవాత స్నానం సంధ్య, పూజ తరవాత తీరుబడిగా కూచుంటే భారతం కనపడింది. సరే! కిరాతార్జునీయం తీస్తే ఉదయ పారాయణ సరిపోయింది. మధ్యాహ్నం కొద్దిగా ఫలహారం చేసి ఉపవాసం గురించి చూస్తే, భాగవతం లో మంచి ఘట్టం గుర్తుకొచ్చింది, అంబరీషోపాఖ్యానం. శివస్య హృదయం విష్ణుః, విష్ణుశ్చ హృదయం శివః అన్నారు కదా! ఇద్దరికి భేదం లేదు కనక, ఉపవాసం మీద ఉన్న కధ అంబరీషోపాఖ్యానం చెప్పుకుందాం.

అంబరీషుడు అచంచల హరి భక్తుడు. అతని భక్తికి మెచ్చి హరి చక్రం ని అంబరీషునికి కాపుంచారు. అంబరీషుడు ఒక సంవత్సరం కార్తీక మాసంలో మూడు రోజులు ఉపవసించి కాళిందిలో స్నానంచేసి మధు వనంలో హరికి మహాభిషేకం చేసి, దానాలు నిర్వహించారు. ఆ సమయంలో దుర్వాసో మహర్షి రాకతో, అంబరీషుడు వారికి నమస్కరించి భోజనం చేయమని అర్ధించారు. ముని నదికి పోయి స్నానం పూర్తి చేసుకువస్తానని వెళ్ళి రావడం ఆలస్యమైనది. ద్వాదశి ఘడియలు పూర్తి కావస్తున్నాయి. మహర్షి జాడ లేదు. భోజనానికి పిలిచిన వారు భుజించకుండా, భుజించ కూడదు. ద్వాదశి ఘడియలు పూర్తి కాకుండా భుజిస్తే తప్పించి వ్రత ఫలం దక్కదు. ఈ ధర్మ సంకటం లో పెద్దలను సలహా అడిగితే, నీరు తాగితే ద్వాదశి ఘడియలలోపు భుజించినందుకు వ్రత ఫలం దక్కుతుందని, జలపానం అతిధిని వదలి భుజించడం కాదని చెప్పగా అలా చేస్తారు. దుర్వాసో మహర్షి తిరిగివచ్చి జరిగినది తెలుసుకుని, అతిధి భుజించకుండా, భుజించావని నిందించి, కోపం తో కృత్యను అంబరీషునిపై ప్రయోగిస్తారు. ఇది తెలిసిన హరి చక్రాన్ని విషయం సరి చేయమని ఆజ్ఞ ఇవ్వగా, చక్రం కృత్యను సంహరించి ముని వెంట పడుతుంది. ముని భయంతో పరిగెట్టి బ్రహ్మను శరణు వేడగా, చక్రాన్ని నిరోధించడం తనవల్ల కాదని బ్రహ్మ చెప్పగా, శివుని వద్దకు పరిగెడితే, వారు కూడా అశక్తత చూపితే హరి పాదాలు పట్టుకుంటారు. అప్పుడు హరి నేను భక్తుల బందీని, అందుచేత నీవు అంబరీషునే శరణు వేడమంటారు. ముని అంబరీషుని వద్దకు వచ్చి వేడగా, చక్రాన్ని ప్రార్ధించి ఉపసంహరిస్తారు. మునికి తృప్తిగా భోజనం పెట్టి తరవాత అవశేషం అంబరీషుడు భుజించి వ్రతం పూర్తి చేస్తారు.

పై కధవల్ల తెలిసేదేమంటే భక్తికి మించినది లేదు. ఎవరిపైనా అహంకరించడం మంచిదికాదు.
సంవత్సరానికి ముఖ్యంగా మూడయినా ఉపవాసాలు చేయమన్నారు, పెద్దలు. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, మహాశివరాత్రి. ఆపైన ఇరువది నాలుగు ఏకాదశులు ఉపవాసం చేయమన్నారు. నేడు చాలా మంది శనివార నియమం చేస్తారు. నిన్నను ఎక్కడికీ పోకుండా ఇంటి దగ్గరే పారాయణ చేసుకుంటే భక్తి టి.వి. వారు గోధూళి వేళ నమకం, చమకం వినిపించారు. చాలా చోట్ల జరుగుతున్న కార్య క్రమాలు కూడా చూశాము. జగడమాడి అయినా ఝాము రాత్రి జాగరం చెయ్యాలంటారు. కాని నా ఉద్దేశ ప్రకారం జాగరణ అంటే నిద్ర పూర్తిగా మేలుకుని ఉండడం కాదని, ఎఱుక కలిగి ఉండాలని హెచ్చరిక అనుకుంటా. శివరాత్రి రోజు లింగోద్భవ కాలం దాకా నైనా మెలుకువగా ఉండాలనుకుంటారు.

నేటి కాలానికి ఉపవాసం అంటే ముందు గుర్తొచ్చేది, మహాత్ముడు, ఆయన సత్యాగ్రహం చేసేరు. నేడు సత్యంలేదు ఆగ్రహం మాత్రం మిగిలిపోయింది. నేడు ఈ ఉపవాసం అనేపేరుతో నిరశన ( నిరసన కాదు) వ్రతం అని చెప్పి చాలా కొత్తకొత్త పోకడలొచ్చాయి. గంటలలో చెబుతున్నారు, నిరశన వ్రతం గురించి. రిలే నిరాహార దీక్షలు కూడా ఉన్నాయి. ఉపవాసం అనగా సమీపంగా ఉండటం, ఎవరికి? భగవంతునికి. ఉపవాసం రోజు జీవ ప్రక్రియకి కావలసిన ఆహారం ఇవ్వాలి, శరీరానికి. పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండటం లంఘనం అవుతుంది.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఊరగాయలు/వేసవికాలం

ఊరగాయలు/వేసవికాలం

మహా శివరాత్రి పూటా తిండి గోలేంటి అనద్దు, ఉపవాసం ఈ వేళే కాని రేపు కాదుగా! చిత్తమూ, ధ్యానమూ శివుని మీద ఉంచి చేసుకునే పని చేయాలి.

వేసవికాలం వచ్చేస్తోంది. ఊరగాయలకి తయారవాలి. పాత జాడీలు, గూనలు, ఖాళీ అయినవి బయట పడేసి నీళ్ళు పోసి అట్టిపెట్టింది నా ఇల్లాలు. “అప్పుడే తీసేసేవేమిటి అన్నీ” అన్నా. “వీటి అన్నిటిని శుభ్రం చేసి ఎండలో బోర్లించి సిద్ధం చేసుకోవాలి. తడి లేకుండా ఎండపెట్టాలి. మామిడికాయ వచ్చేసమయానికి ఇవి తయారుగా వుండాలి” అంది. ఈలోగా ఉప్పు వాడి కేక వినపడింది. వాణ్ణి పిలవమంది. “ఎందుకన్నా”. “ముందు పిలవండి, లేకపోతే వాడు వెళ్ళిపోతాడని తరిమింది”. నిజమే వాడొక కేక వేసి వెళ్ళిపోతున్నాడు. వాడి వెనకపడి పిలిస్తే వచ్చాడు, బండి తోలుకుని. నా ఇల్లాలు వచ్చింది. బస్తా ఉప్పు ఎంత అని అడిగింది. నాకు మతిపోయింది. “బస్తా ఉప్పెందుకు”అన్నా. “ఉండండి చెబుతా” అంది. ఊరుకున్నా. వాడు 450 చెప్పేడు. “అరబస్తా తీసుకుంటా ఇచ్చే బేరం చెప్పమంటే”, వాడు “అరబస్తా 215 రూపాయలకి ఇస్తా” అనన్నాడు. “సరె ఉప్పు చూపించు” అంది. తెల్లగానే ఉంది. పెద్ద పెద్ద కళ్ళు. ఉప్పు పలుకులని కళ్ళు అంటాము. వాడు కొత్త బస్తా విప్పి 12  కుంచాలు కొలిచాడు. గోని సంచిలో పోయించి. వెంటనే ఇద్దరం సాయం పట్టి మేడమీద అరపోశాము, ఎండలో. ఉప్పు వాడికి డబ్బులిచ్చిపంపేను. మళ్ళీ నా సందేహం వెలిబుచ్చా. అప్పుడు చెప్పింది. “వందకాయ ఊరగాయ పెట్టాలి, నూట ఏభయి కాయ మాగాయిపెట్టాలి. మిగిలినవి ఇంకా వున్నాయి కదా అవి పెట్టాలి. వాటికి ఇప్పుడు పోయించుకున్న ఉప్పులో ఎక్కువ అయిపోతుంది. మిగిలినది పగిలిన జాడీలలో పోసి ఉంచుకుంటే సంవత్సరం వాడుకోవచ్చు. ఒక కేజి పేకట్ ఉప్పు తెస్తే పది రూపాయలవుతోంది”, అంది. నిజమే మరి “ఈ ఉప్పు వాడకూడదు తెలుసా” అన్నా. “తెలుసు. పేకట్ల ఉప్పులో అయొడిన్ కలుపుతామనిఅంటున్నారు. ఈ ఉప్పు మన చిన్నప్పటినుంచి వాడుతున్నాం, మరి రోగాలు రాలేదు కదా. అయొడిన్ ఇందులో లేదా. లేక పోతే మీ ప్రభుత్వం వారు ఎవరికేనా ఉపకారం చెయ్యడానికి ఇది వాడద్దని అంటున్నారా చెప్పండి”.అని ఉప్పున్యాసం అదే ఉపన్యాసం ఇచ్చింది. ఊరుకున్నా.

ఈ సంవత్సరం మామిడిచెట్టు పూత సరిగా రాలేదు, వస్తుందో రాదో అనుకుంటున్నాము. ఏమయినా ఊరగాయలు పెట్టాలి కదా! ఆవకాయ, మాగాయ, తొక్కుడుపచ్చడి,ఇలా రకరకాలవి పెట్టుకోలేకపోయినా కొన్నయినా కావాలి కదా!. ఆవకాయలోనే ఆవకాయ, కారపు ఆవకాయ లేదా డొక్కావకాయ, దీన్నే కాయ పళంగా పెడతారు,పెసరావకాయ, శనగల ఆవకాయ, పులిహార ఆవకాయ,ఇలా ప్రాంతాన్ని బట్టి రకాలు. ఇక మాగాయలో మాగాయ, నూనిమాగాయ వగైరా వగైరా, వీటిలో కొన్నిటిలో వెల్లుల్లి వేస్తారు. నిజంగా మనవారి ఆరోగ్య రహస్యం తినే వస్తువులలోనే ఉంది. ఈ వెల్లుల్లిని తింటే చాలా వ్యాధులు రావని ఇప్పటివారు చెబుతున్నారు. వ్యాధినిరోధక శక్తి వెల్లుల్లికి ఎక్కువంటున్నారు. ఇకమిగిలినవి మెంతికాయ, ఇందులో వేడి చేసే ఆవ లేకపోవడం మూలంగా, చక్కెర వ్యాధిగ్రస్తులుకి అవసరమైన మెంతి ఉన్నమూలంగా వారు కూడా తినవచ్చు. తొక్కుడు పచ్చడి బాగుంటుందికదా. మరి ఊరగాయలకి సిద్ధం కావాలి కదా! అలాగే వేసవి వచ్చేటప్పటికి నిలవకి ఉంచుకునే ఉసిరి దీన్ని రాచ ఉసిరి అంటాం. అమలక అని హిందీ మాట. దీని పచ్చడి,ఇది ఆరోగ్యానికి గొప్ప ఔషధమని పేరు. చింతకాయ పచ్చడి, నిలవకి. వెలగపళ్ళు పచ్చడి పెట్టేముకదా!! ఇవన్నీ పెట్టుకోవాలికదా!!! సంవత్సరానికి అవసరమైన కందిపప్పు కొనుక్కునే సమయం. మిగిలిన పప్పులు కూడా కొనుక్కుని ఎండ బెట్టుకుని దాచుకునే సమయం కదా. ఇదివరలో వేసవిలోకూరలు దొరకడం తక్కువగా ఉన్నపుడు వరుగులు చేసేవారు. వంకాయ, కాకరకాయ, దొండకాయ, ఇలా, ఇప్పుడు చేయటం లేదు కాని, కేజి వంద రూపాయల ఖరీదును తప్పించుకోవాలంటే కొన్ని ఊరగాయలు పెట్టుకోక తప్పదు. మరిచిపోయా కొరివి కారం ముఖ్యం కదా!!! దానికీ ఇదే సమయం. చల్లలో మిరపకాయలు, గుమ్మడి వడియాలు పెట్టుకునే సమయం. అన్నట్లు సగ్గుబియ్యం వడియాలు,పిండి వడియాలు,ఇంకా ముఖ్యం అటుకులు. అయ్యో! అటుకులంటె గుర్తొచ్చింది, టూ మినిట్స్, రెండు నిమిషాలు, దో మినిట్ లో తయారయ్యే చిరుతిండి అటుకులూ బెల్లం, లేదా అటుకులూ పంచదార ఇంకా అర్జంటు. పిజ్జాలు, బర్గర్ల కంటే ఎంతో మేలు. కొద్ది సమయం ఉంటే పిండి వడియాలు వేయించి పిల్లలికి పెడితే ఇష్టంగా తింటారు. పిల్లలతో పెద్దలు కూడా.

ఇక ఈ సమయం లో వచ్చే పళ్ళు మామిడి, పనస, ముఖ్యమైనవి. పనసపొట్టు కూర ఆవపెట్టి వండుకుంటే, పోటీ పడి తింటే ఓహ్! ఆనందం. జాగ్రత్త వేడి బాగా చేస్తుంది. ఏకాలంలో వచ్చేపళ్ళు ఆ కాలంలో తింటే వైద్యుని అవసరం తక్కువంటున్నారు అనుభవజ్ఞులు. అలాగే ఈ సమయం లో వచ్చే వ్యాధులలో ముఖ్యమైనవి నీళ్ళ విరేచనాలు. వీటిని అరికట్టుకోడానికి చలి జ్వరం పెట్టిని, అదేనండి ఫ్రిజ్ ని తరచుగా శుభ్రం చేసుకోవాలి. లేక పోతే అది అనారోగ్యానికి పుట్టినిల్లయిపోతుంది. ఎన్ని మందులువాడినా రోగాలు తిరగబెడుతూనే ఉంటాయి.

ఇక ఇప్పటి వరకూ ఉపయోగించిన దుప్పట్లు, రగ్గులు ఒక సారి వేడి నీటిలో శుభ్రం చేసుకుని, గట్టి ఏండలో ఆరవేసి, నాఫ్తలీన్ బాల్స్ వేసి బీరువాలో జాగ్రత్త పెట్టుకుంటే, మరుసటి శీతాకాలానికి వాడుకోవచ్చు. వేసవికి తయారవుదాం.

 

శర్మ కాలక్షేపంకబుర్లు- “దృష్ట్వా సీతా”

దృష్ట్వా సీతా.

“దృష్ట్వా సీతా” …. అనేదానిని అస్వాదించాలంటే ముందు జరిగినది చూస్తేకాని దీనిలో అందం తెలియదు. చెప్పేందుకు ప్రయత్నం చేస్తా. ఇది హనుమ లంకకు వెళ్ళివచ్చిన సందర్భంగా ఆకాశం నుంచి కిందకు దిగిన వెంటనే అన్న మాట. “దృష్ట్వా సీతా” అనగా, “చూశాను సీతను” అని అర్ధం. ఐతే ఈ మాటకి ఇంత అవసరం, ప్రాముఖ్యత ఏమి అని చూస్తే…….

వానరరాజు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం గా భూమి నాలుగు చెరగులనుంచి కపి సైన్యం వచ్చి చేరింది. ఓక్కొక్కరిని ఒక్కొక భాగానికి నాయకుడిని చేసి వారు ఏదిక్కుగా వెళ్ళాలో ఎక్కడెక్కడ వెతకాలో వివరంగా ఆజ్ఞ ఇస్తాడు, కపిరాజు. చివరగా అంగదుని నాయకునిగా చేసి , హనుమదాదిగా వీరులను దక్షణ దిక్కుకు వెళ్ళి వెతకమని చెబుతాడు. ఎక్కడి దాకా వెళ్ళి వెతకాలో చెబుతాడు, అందరికీ, ఎక్కడెక్కడ వెతకాలో కూడా చెబుతాడు.. సమయం ఒక నెల అని చాలా వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు, అతిక్రమించిన వారికి శిరః ఛేదం శిక్ష చెప్పబడింది. అందుకే దానిని సుగ్రీవ ఆజ్ఞ అన్నారు. అన్నీ వివరంగా అనుమానం లేకుండా చెప్పడం, దానిని తప్పిన వారికి శిక్ష కూడా అందులోనే చెప్పబడింది.( ఈ రోజుల్లో ఇచ్చే ఆజ్ఞలలో అన్నీ లొసుగులే! కావాలనే ఇస్తారుకాబోలు అలా.) అప్పుడు రాముడు హనుమకు అంగుళీయం తన గుర్తుగా ఇస్తాడు, సీతకు ఇవ్వడానికి. ఎవ్వరికి ఇవ్వని ఈ గుర్తు హనుమకే ఇవ్వడం లో విశేషం, హనుమ మాత్రమే ఈ పని పూర్తి చేయగలడన్న నమ్మకం, దక్షణ దిక్కుకు వెళ్ళేవారి నాయకుడయిన అంగదునికి కూడా ఇవ్వబడలేదు, అంగుళీయం.

అందరూ అన్ని దిక్కులకూ బయలుదేరుతారు, వెతకడానికి. దక్షణ దిక్కుగా వెళ్ళినవారు చాలా చిక్కులు పడి సముద్ర తీరం చేరుతారు, స్వయంప్రభ యొక్క అనుగ్రహం చేత. అప్పటికే ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. అందరూ ప్రాణ భయంతో ఉన్నారు, సుగ్రీవాజ్ఞ మూలంగా. ఆ సమయం లో లంకకి వెళ్ళగలవారెవరని ప్రశ్న. చివరికి హనుమ శక్తి గుర్తు చేసి ఆయనను పంపుతారు. హనుమ లంక కు చేరుకుని సీతను చూసి ఆమెతో మాటాడి ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడి, అంగుళీయమిచ్చి, సీతమ్మ ఇచ్చిన చూడామణి ని తీసుకుని, అశోకవనం నాశనం చేసి, రావణుని పరివారం కొంత, అతని సుతుని పరిమార్చి, రావణుని చూచి, లంక కాల్చి, విజయంతో తిరిగి వస్తున్న సమయం. ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్న వారు ఉత్కంఠ తో ఉన్నారు, ఏమయినది తెలియదు. హనుమ సీతను చూసి వస్తే అందరి ప్రాణాలు నిలబడతాయి లేకపోతే సుగ్రీవాజ్ఞ కి తీయబడతాయి. ఇటువంటి సమయంలో హనుమ తిరిగివస్తూ సముద్రపు ఒడ్డున వున్న తనవారికి విజయ సందేశం క్లుప్తంగా తెలియ చేయడానికి సింహనాదం చేస్తాడు. ఆ సింహనాదం విని , అక్కడ వున్న జాంబవంతుడు మొదలైన వారు హనుమ కార్య సాధనతో తిరిగి వస్తున్నాడని భాష్యం చెబుతారు. ఆయినా ఉత్కంఠం పోదు. హనుమ నేల మీద కాలుమోపుతూ అన్న మాట “దృష్ట్వా సీతా” అన్నది, ఈ సందర్భం లో. సాధారణంగా క్రియాపదం తో వాక్య నిర్మాణం ఉండదు, తెనుగులో. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం కూడ తోడు కలవడం, వ్యాకరణ పండితుడవటం మూలంగాను, అక్కడ వున్నవారి ఉత్కంఠను వెంటనే చల్లార్చే ఉద్దేశంతో దృష్ట్వా సీతా అన్నాడు. ఐతే మొదటి మాట విన్న వెంటనే కపి సమూహం యొక్క జయ జయ ధ్వానాలమధ్య తరవాత మాట వినపడకపోయినా ఇబ్బంది లేక పోయింది. ఇదీ క్లుప్తంగా దృష్ట్వా సీత వెనుక ఉన్న గాధ.

ఇయం సీతా మమ సుతా… దీనిని వ్యాఖ్యానించడానికి నాకు తాహతు సరిపోదు. కారణం దానిని నేనూ పూర్తిగా అర్ధం చేసుకో లేకపోవడం. ప్రయత్నం చేస్తున్నా పొరపాట్లు మన్నించగలరు. ఈమె సీత, నా కుమార్తె…. నీకు సహధర్మ చారిణిగా ఉండేందుకు సమర్పించబడుతోంది, ఈమె నీడలా నిన్ను అనుసరిస్తుంది, ధర్మాచరణలో, అని చెప్పి అప్పజెప్పేడు, జనకుడు….. ఇది స్థూలం..సూక్ష్మంలో ఈమె నీకు ధర్మాచరణలో నీడలా వెన్నంటి వుంటుంది, ధర్మాచరణ చేయమని జనకుని కోరిక. ఇద్దరూ ధర్మమైన అర్ధాని, ధర్మమైన కామాన్ని అనుభవించమని చెప్పి, జనకుని ఆకాంక్ష. ఐతే దీనికి వ్యతిరిక్తమయిన సంఘటన వనవాసానికి వెళ్ళేటపుడు సంభవిస్తుంది. రాముడు సీతను అడవికి రావద్దంటాడు. అప్పుడు సీత మాట్లాడిన మాటలు చూడండి. “నా తండ్రి , నన్ను నీకు అప్పజెప్పేటపుడు ధర్మాచరణలో నీడలా అనుసరిస్తుందనికదా చెప్పినది, ఇప్పుడు నేను నీతో రాకపోతే ఆ మాట బోటు పోయినట్లేకదా, నీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడానికి నీవు అడవికి వెళుతున్నావు, కాని నా తండ్రి ఇచ్చిన మాటను నన్ను నిలబెట్టవద్దంటున్నావు.” అని చెప్పడానికి చివరి అస్త్రంగా “మా తండ్రి పురుష రూపం లో ఉన్న స్త్రీకిచ్చి, నా వివాహం చేశాడు” అని అంటుంది. అప్పుడు రాముడంటాడు, “నీ మనసు తెలుసుకోవడం కోసం అన్నాను సుమా” అంటాడు. అది అసలు సంగతని నా ఉద్దేశం.

నా రామాయణ, భారత, భాగవాతాల చదువు, పరిశీలనకు మొదటి గురువు, భిక్ష పెట్టిన వారు,నా తల్లి. చిన్నప్పుడు నామరామాయణం పాడేది. అలా నాకు రామాయణం మీద అభిరుచి పెరిగిందనుకుంటా. తరవాత,   ఆకతాయి  గా తిరుగుతున్నపుడు విన్న కీ.శే. శ్రీ పురాణపండ శ్రీరామమూర్తి గారి ప్రవచనాలు నా ఇరవై వయసులో రెండవ భిక్ష, తరవాత శ్రీ పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు ( ఉషశ్రీ) గారు మూడవ కబళం ఆకాశవాణి ద్వారా వినిపించినది. తరవాత నేటి కాలానికి ప్రవచన చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు నాల్గవ కబళం భిక్ష, తప్పించి నా గొప్పతనం ఏమీ లేదని మనవి. చదువుదామంటే రామాయణం సంస్కృత+ తెనుగు అనువాదం సరియైనది దొరకలేదు, నాకు, మిత్రులు, మంచి ప్రచురణ ఎక్కడ దొరికేది తెలియ చేస్తేతెప్పించుకుంటాను. వారి ఉపకారానికి ఋణపడి ఉంటాను. నేను ఇలా పలకడానికి ప్రేరణ ఇచ్చిన జిలేబీ గారికి ఈ టపా అంకితం.

శర్మ కాలక్షేపంకబుర్లు-అష్టావధానం/అప్రస్తుత ప్రసంగం

అష్టావధానం/అప్రస్తుత ప్రసంగం.

దర్శించండి..http://andhraamrutham.blogspot.in…….

“ఏమండీ నాలుగయ్యింది లేవండి” శ్రీ వారికి హెచ్చరిక. “పడుకోనీవోయ్ కాసేపు” శ్రీవారి గోము. “నాకేం పడుకోండి, నెట్ లో ఏదో దొరకలేదు, ఉదయం చూస్తానన్నారు, అక్కరలెకపోతే మీఇష్టం” మరొకసారి హెచ్చరిక. “అమ్మలూ! లే! పరిక్షలు దగ్గరకొస్తున్నాయి చదువుకో” అమ్మలు కి మేలుకొలుపు. “బుజ్జీ! లే నాన్నా! లేచి చదువుకోవాలి” ఇది బుజ్జిగాడికి చేసే అలవాటు. ఇలా చెబుతూ ఉదయం నాలుగుకు లేచిన ఇల్లాలు బాత్ రూంలోకి పోయి చన్నీళ్ళు స్నానం చేసి ( గిజర్ వేస్తే సమయం సరిపోదని ) ఒణుక్కుంటూ చీర చుట్టబెట్టుకుని బయటికొచ్చి దేముని మందిరం లో నిన్నటి పూలు తీసేసి కొత్తవో రెండు పెట్టి దణ్ణం పెట్టుకుని లలితా సహస్రనామమో, విష్ణు సహస్రనామమో పారాయణ చేస్తూ, వంటింటిలో చొరబడి, ఆ రోజుకి శ్రీ వారికిష్టమైన చిక్కుడుకాయ వేపుడు, బుజ్జిగాడికిష్టమైన చల్లపులుసు, అమ్మలికిష్టమైన పాటోళీ, ఇలా ఎవరికి కావలసినవి వారికోసం తయారుచేస్తూ, మధ్యలో వీళ్ళంతా వాళ్ళవాళ్ళ పనులు నెరవేరుస్తున్నారో లేదో వొక కన్ను ఇటేసి చూసుకుని, వంట దగ్గర భరత నాట్యంచేసేటప్పటికి ఏడున్నర. బుజ్జి గాడి కేరేజి హాట్ పాకు సద్ది, మిగిలిన వారి కేరేజీలు హాట్ పాక్ లూ సద్ది, బుజ్జిగాణ్ణి తయారు చేస్తూంటే, అమ్మలు “అమ్మా జడెయ్యవే” అని గునుస్తూంటే “ఇన్నేళ్ళొచ్చేయి జడెసుకోడం రాలేదు” అని అమ్మలు జడేస్తూ ఉంటే “అమ్మా నా షూ ఒకటి కనపడటం లేదే” అని బుజ్జిగాడంటే అంటే “రాత్రి పాలీష్ చేసి పెట్టా బట్టలబుట్ట కిందికి పోయిందేమో చూడు” అని చెబుతూ ఉండగా “ఏమోయ్! సబ్బు” బాత్ రూం నుంచి శ్రీవారి కేక సబ్బు పట్టుకెళ్ళి ఇచ్చి వస్తూ ఉండగా “టవల్ మరిచిపోయనోయ్!” శ్రీ వారి అభ్యర్ధన కలిసిన ఆజ్ఞ. “అమ్మా నా చున్నీ కనపడటం లేదే” అమ్మలు అభ్యర్ధన. “చూడు! నిన్న ఆరేసిన బట్టలు తీసినపుడు బుజ్జిగాడు ఆడుకున్నాడు దానితో ఎక్కడదాచాడో అడుగు” టవల్ పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చి అందరికి ఉదయం టిఫిన్ పెట్టి బుజ్జిగాడిని వేన్ లో ఎక్కించడానికి వీధి మలుపుదాకా వెళ్ళి, వాడిని వేన్ ఎక్కించి వచ్చేటప్పటికూడా టిఫిన్ చేయని శ్రీవారిని “చల్లరిపోతూంది టిఫిన్, దాని సంగతి చూడండి” అని హెచ్చరిస్తూ, అందరికీ, వారి వారి హాట్ పేక్ లు వారి వస్తువులు వారికి అమిర్చి వారి వారి స్థానలకి పంపేందుకు ఇంటి ఇల్లాలు ఉదయం చేసేది నిజంగా అష్టవధానమే. అష్టావధానం ఒక మన తెనుగు భాషకు మాత్రమే ఉన్న ప్రక్రియట. మరొక భాషలో లేదంటారు, ఒక వేళ ఉన్నా అది ఇంత ప్రచులితం కాదేమో. ఇక్కడ ఇల్లాళ్ళు, కవులు కూడా నన్ను మన్నించాలి. పోలిక సరిగా చెప్పలేకపోయినందుకు. అప్రస్తుత ప్రసంగిని కనుక మీరిద్దరూ నన్ను మన్నిస్తారని నా నమ్మకం. నిజం మీరు మన్నిస్తున్నారు.

ఏమయ్యా! నీకు తెనుగుభాషలో అవధానమంటే అంతలోకువా అనద్దు. ఇక్కడెంత కష్టం ఉందో అక్కడా అంతే కష్టం ఉంది మరి. శతావధానం, సహస్రవధానం కంటే కష్టం అష్టావధానమని నా చిన్ని బుర్రకి, పెద్దలు చెప్పిన మాట గుర్తు, తప్పయితే సవరించుకుంటా. అసలు అష్టావధానం అనగానే మనకు తెనుగు నాట ముందు గుర్తొచ్చేది తిరుపతి వేంకట కవులు. శ్రీపాదవారు నేత్రావధానం కూడా చేసేరట. తిరుపతి వేంకటకవుల సమకాలీకులు, తరవాతి తరంవారు చాలా మంది ఉన్నారు. వారిని నేను ప్రస్తావించడం లేదు, ప్రస్తుతం. నాకూ నా ఇల్లాలికి కవిత్వం రాదు కాని, తల ఊచగలం కారణం, పూలతో కూడిన దారానికి వాసన అబ్బినట్లు, మాకు ఇది చెళ్ళపిళ్ళ వారి ద్వారా అబ్బింది. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారిల్లూ మా మామగారిల్లు కడియం గ్రామం లో ఎదురెదురుగా ఉండటం, మూలాన నాఇల్లాలు, చిన్నపుడు షష్టి ఘడియలూ అక్కడే వుండటం కారణం. మరొకటి నా అభిమాన రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వగ్రామం “పొలమూరు” నేను ఉంటున్న గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటం. ఈ అష్టావధానంలో నా లాంటి అప్రస్తుత ప్రసంగి కూడా ఉండటం విశేషం.

మన ప్రభుత్వాలు భాష పట్ల సరియైన వైఖరి చూపటం లేదేమోనని నా అనుమానం. ఏ ఒక్క కవి గారి ఇల్లు కూడా భద్రపరచలేకపోయారు. చెళ్ళపిళ్ళ వారిల్లు కాని, సుబ్రహ్మణ్య శాస్త్రి గారిల్లు కాని పదిలపరచలేదు. భాషని బతికించుకునే బాధ్యత ఇప్పుడు ప్రజలపైనే ఉంది.శ్రీ. చింతా రామ కృష్ణారావుగారు తెనుగు భాషపట్ల మక్కువతో తమ బ్లాగును నా బ్లాగు ద్వారా పరిచయం చేయమని కోరారు, కాని. నేను టపా రాస్తానని బాకీ పెట్టేశాను. అనారోగ్యం తో రాయలేకపోయా. తరవాత అశ్రద్ధ అయిపోయింది. బాకీ ఈవేళ గుర్తుకొచ్చి వెంటనే రాసిన టపా ఆపుచేసి ఇది రాసాను. పెద్దలు విజ్ఞులు ఈ అప్రస్తుత ప్రసంగి తప్పుల్ని మన్నించి చింతా వారికి భాషా సేవలో చేయూతనిద్దామని, వారి బ్లాగులో కార్యక్రమాలలో పాల్గొని వారికి సహకారం అందించుదామని, “అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకూ” అనకండి. భాషా సేవ అనే పెద్ద పెళ్ళిలో ఇదొక చిన్న కార్యక్రమం కనక, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికి మనవి చేస్తూ శలవు.

దర్శించండి..http://andhraamrutham.blogspot.in…………………

శర్మ కాలక్షేపంకబుర్లు-మాట

మాట

జీవులన్నిటిలోను, దేవుడు ఒక మానవులకే ప్రసాదించిన వరం మాట. ఇది తమ భావాన్ని వ్యక్త పరచేందుకు సాధనం.
మాటకు ప్రాణము సత్యము అన్నాడు శతక కారుడు. …సూనృతవాక్యము మేలు చూడగన్ ఆని చెప్పింది శకుంతల దుష్యంతుని రాజ సభలో……అబ్బే! ఎవరెన్ని చెప్పినా నేటి కాలానికి కలికానికి కూడా కనపడనిది అదొక్కటే. “అందరూ శ్రీ వైష్ణవులే బుట్టెడు రొయ్యలేమైనాయని” సామెత. ముఖం మీద బేలతనం, మనసులో జాణతనం, మాటలో లేకితనం కనపడుతున్నాయి. ఈ సంవత్సరం సంకురుమయ్య అధికారులమీద, అదీ ఐ.ఎ.యెస్ అధికారులమీద నడుస్తున్నాడు. అయ్యా! యెస్ లకి భయంకాని ఐ.ఎ.యెస్ లకెందుకూ భయం? ఎక్కడి నుంచో ఎక్కడికో పోతున్నాను కదా.

మాట ప్రాణం పోస్తుంది. ఎలా అంటే రామాయణం లో భయంతో పరిగెడుతున్న సుగ్రీవుని నిలువరించింది మాట. హనుమ ” రాజా ఎందుకు భయంతో పరిగెడతావు, వచ్చేవాళ్ళు మనకోసం వస్తున్నట్లులేదు” అని నిలువరించాడు. ఐతే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాటాడు, మాటాడెటపుడు నీ ముఖం నాకు కనపడాలని చెప్పి పంపేడు సుగ్రీవుడు. రామునితో మాటాడేటప్పుడు ముఖం సుగ్రీవుని వైపు ఉంచి మాటాడతాడు, హనుమ, భిక్షుని రూపంలో. హనుమను గొప్ప వాడిగా మొదటిసారి మాటాడినపుడే గుర్తించాడు, రాముడు. లక్ష్మణునితో, “తమ్ముడూ! ఇతను మాటాడే టపుడు, ఒక వ్యర్ధపదం వాడలేదు, ముఖంలో భావం కనపడలేదు, కనులు, కనుబొమలు, కదపలేదు,చెప్పవలసినది ఎక్కడ ఎంత చెప్పాలో, ఏ పదం మీద ఎంత వత్తి పలకాలో అంతే పలికేడు సుమా, వ్యాకరణ పండితుడు కానివాడిలా మాటాడలేడు” అంటాడు రాముడు. హనుమ చెప్పిన ప్రకారంగా రామునితో స్నేహం చేసుకున్నాడు,సుగ్రీవుడు..తరువాత హనుమ మాటాడిన సందర్భం లంకలో సీతమ్మతో. సీతమ్మకి హనుమ తెలియదు. హనుమకూ సీతమ్మ తెలియదు. కాని గుర్తు పట్టేడు. కాని తనను ఆమె గుర్తుపట్టడం ఎలా? ఆమె ఉరిపోసుకోబోతూ ఉంది. ఈ సమయం లో మాటాడాలి. పొరపాటు మాటాడితే ప్రాణం పోతుంది. ఏ భాషలో పలకాలి అన్నది కూడా తర్కించిన మహానుభావుడు. దీనికి ఆయన చేసిన పని, సీతమ్మ కి ఇష్టమైన రామ కధ గానం చేయడం , మొదలుపెట్టేడు. సీతమ్మ తన ప్రయత్నం వాయిదా వేసి, చూసింది. అంటే ఆమెను ఆత్మ హత్యనుంచి రక్షించేడు, మాట ద్వారా. సీతమ్మని చూసి వచ్చేటపుడు దూరం నుంచి సింహనాదం చేసి సందేశం వినిపించిన ప్రజ్ఞాశాలి. కిందికి దిగుతూనే దృష్ట్వా సీతా, అని క్రియాపపదంతో మాట మొదలుపెట్టిన హనుమ గొప్పవాడు. ఇప్పటికి రామాయణం తో సరిపెడదాం. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, మరి. భారతం అంతా మాటే. మాట ప్రాణం తీస్తుంది, అది మనం చెప్పుకోటంలేదు.

మాటలో, అన్యాపదేశం ఒక ప్రక్రియ. ఇందులో కవులు చాలానే చెప్పేరట. సాధారణంగా ఇది తిట్లకి ప్రసిద్ధి. అన్యాపదేశం అంటే, చెప్పేదానిని తిన్నగా చెప్పక,మరొక దానిని చెప్పి విషయాన్ని సూచించడం. పిల్లి మీద, యెలక మీద పెట్టి చెప్పడమంటాం,మన వాడుక భాషలో. ఇది పూర్వకాలంలో వుమ్మడి కుటుంబాలున్నపుడు, అత్త కోడలు మధ్య, తోడికోడళ్ళ మధ్య నడిచేది, యెక్కువగా. అత్తా కోడళ్ళకి ఇది గొప్ప వరం. తిన్నగా కోడలు అత్తని తిట్టలేదు కదా, అలా వొకవేళ తిడితే, అందరూ కోడలినే మళ్ళీ తిడతారు. అందుకు కోడలికి యిది ఆయుధమన్న మాట. సాధారణంగా తెనుగు కుటుంబాలలో, కోడలి పరంగా, మొదటి ఆడపిల్లకి అత్తగారిపేరు, కొడుకుకి మామగారిపెరు పెట్టడం ఆనవాయితీ. దీనిని అవకాశంగా తీసుకుని కొడుకుని, కూతురుని కోడలు తిట్టితే, అది అత్తగారికి మామగారికి తగలాలన్నామాట. “ఒసేయ్! సత్తి ముండా! చెప్పిన మాట వినకుండా ఎక్కడికే,ఎగరేసుకు పోతున్నావ్, నీకాళ్ళు విరిచి కూచో బెడితేకాని బుద్ధి రాదు, దొగముఖం దానా……..” ఇది కోడలి తిట్టు కూతురిని. దీనిమీద అత్తగారు “ఏంటే! ఎవరినీ తిడుతున్నావ్, నన్నేనా?” అత్తగారి ప్రశ్న. “అయ్యో రామా! అత్తయ్యా మీకలా అనిపించిందా?. నేనేం చేతునూ…. కళ్ళుపోతాయి. సత్తి ముండ! చెప్పిన మాట వినటం లేదు” తెలివైన కోడలి జవాబు, అన్యాపదేశంగా మళ్ళీ తిడుతూ….. “అదేంటే, దానికి శుభ్రమైన, నా పేరు సత్యవతి అని పెట్టి సత్తి ముండా అని తిడతావా?”అత్త ప్రశ్న. “అయ్యోరామా! అత్తయ్యా!! సత్తి ముండ అల్లరి భరించలేకా”………..గడుసు కోడలి జవాబు. ఇలా రసవత్తరంగా సాగిపోతూ వుంటుంది, వినాలిగాని. అత్త మీద కోపంతో, కూతురు ముడ్డి కుంపటిలో పెట్టిందని సామెత. మరొకటి కూడా వుంది, అత్త మీద కోపం దుత్త మీద చూపిందని. అనగా అత్త గారి మీద కోపం చేతిలోని కుండపై చూపిందని. ఇది స్త్రీల ఆయుధమనే చెప్పాలి. భర్త దగ్గర, అత్తగారి గురించి చెప్పడం కష్టం కదా! అన్యాపదేశంగా చెబితే, అర్ధం చేసుకోలేకపోతాడా, ఏనాటికైనా అని ఆశ. ఈ విషయం లో అత్తకూడా ఏమీ తక్కువ తిన్నదైవుండదు. ఆమె కోడలు పుట్టింటివారి గురించి అన్యాపదేశంగా యెత్తి పొడుస్తుంది, సమయం రావాలి.. అంతతో ఆ ఇంట్లో శీతల యుద్ధం నడుస్తూ వుంటుంది. ఇందులో మగవాళ్ళు సమిధలైపోతారు, ఒక్కొకప్పుడు. మగవారిలో కూడా యీ లక్షణాలున్న వారు లేకపోలేదు. ఆఫీస్ లో బాస్ ని తిట్టలేడు కదా! అందుకు ప్రత్యామ్నాయ మార్గం, అన్యాపదేశం. ఎవరినో తిడుతూ బాస్ దగ్గరకెళ్తాడు. “ఎవరినయ్యా! తిడుతున్నావు” అంటే, “ఉన్నాడు లెండి, వెధవ, రెండురోజుల్నుంచి చూస్తున్నా,ప్రాణం తీసేస్తున్నాడు”, అని కహానీ చెబుతాడు. బాస్ కీ తెలుసు, తననేతిడుతున్నాడని, ఊరుకుంటాడు. సమయంవచ్చినపుడు వడ్డీతో తీర్చేస్తాడు. మరొకటి ఉంది అశక్తదుర్జనత్వమని, దాని గురించి మరోసారి.